నైతిక విజయం

Sat,May 20, 2017 01:50 AM

జాతి విద్వేషం నిలువెల్లా నింపుకున్నపాకిస్థాన్‌ది ఆది నుంచీ విపరీత బుద్ధే. కసి, అక్కసు కలగలిసిన కుట్రపూరిత చేష్టలే. ఇరుగు పొరుగుతో ప్రేమానురాగాలతో, పరస్పర సహకారంతో మెలగాలన్న ఇంగితం లేకుండా ద్వేషం పునాదుల మీదనే మనుగడ సాగించాలనుకోవటం లోనే పాక్ విపరీత బుద్ధి కనిపిస్తున్నది.కుట్రపూరిత గూఢచర్య ఆరోపణలు,అడ్డగోలు మరణశిక్షల విధింపును ఉపేక్షించేది లేదని నెలరోజుల క్రితం భారత్ చేసిన హెచ్చరికలు పాకిస్థాన్‌కు చెవికెక్కాయో లేదో తెలియదు. పాక్ కోరల నుంచి కుల్‌భూషణ్ క్షేమంగా సరిహద్దులు దాటి ఇల్లు చేరేదాకా మోదీ ప్రభుత్వం పట్టు సడలకుండా ఉండాలి.

అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో విచారణ సాగుతున్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మన దేశం నైతిక విజయం సాధించింది. గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణతో భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం విధించిన మరణశిక్షను ఐసీజే నిలిపివేసింది. తుది తీర్పు వెలువడేంత వరకు జాదవ్‌పై శిక్ష అమలు జరుగకుండా పాకిస్థాన్ అన్నిచర్యలూ తీసుకోవాలని ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం సూచించడం పట్ల భారత్‌లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అలాగే ఉత్తర్వును అమలు చేయడంలో తీసుకుంటున్న చర్యలన్నింటినీ తమకు తెలుపాలని 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాస నం ఏకగ్రీవంగా పాకిస్థాన్‌ను ఆదేశించటంతో పాక్ పన్నాగాలకు కళ్లెం పడింది.

నిబంధనల ప్రకారం దౌత్య కార్యాలయం ద్వారా జాదవ్‌తో మాట్లాడేందుకు భారత్ చేసిన ప్రయత్నాలన్నింటినీ పాక్ అడ్డుకున్నది. కుట్ర, ఉగ్రవాది అన్న నెపంమోపి తమ సైనిక న్యాయస్థానంలో విచార ణ పేరుతో ఓ తతంగం ముగించి జాదవ్‌ను అంతమొందించాలని కుయుక్తులు పన్నింది. ఈనేపథ్యంలో అన్ని ఒప్పందాల్ని ఉల్లంఘించిన పాక్ జాదవ్‌ను అమానుషంగా పొట్టన పెట్టుకోకుండా అంతర్జాతీయ న్యాయస్థానం అడ్డుకోవాలన్న భారత్ అభ్యర్థన దేశ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న కుల్‌భూషణ్‌ను అపహరించుకుపోయి గూఢచారిగా, ఉగ్రవాదిగా ముద్రవేసిందన్న భారత్ వాదనకు అంతర్జాతీయంగా మద్దతు లభించినట్లయింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ మాట నెగ్గటం మన విదేశాంగశాఖ సమర్థతకు, కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో మొదటి నుంచీ భారత్ చెబుతున్న విషయాల విశ్వసనీయతకు నిదర్శనంగా నిలుస్తున్నది.

పాకిస్థాన్ మాత్రం ఈ తీర్పును ఆమోదించేదిలేదని మొండిగా వాదిస్తున్నది. జాదవ్ విషయం అంతర్జాతీయ కోర్టు పరిధి కాదని చెప్పుకొస్తున్నది. బలూచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లో ఉగ్రచర్యల కుట్రకు పాల్పడిన జాదవ్ విషయం పాకిస్థాన్ భద్రతకు సంబంధించిన విషయమని బుకాయిస్తున్నది. అయినా పరిధి విషయంలో పాక్ లేవనెత్తిన అభ్యంతరాల మేరకు ఐసీజీ ఈ కేసును తోసిపుచ్చుతుందని ఆశించిన ఆ దేశానికి భంగపాటు తప్పలేదు. జాదవ్ కేసు కచ్చితంగా తమ పరిధిలో ని అంశమేనని ఐసీజే తేల్చిచెప్పడంతో అంతర్జాతీ య సమాజం ముందు పాక్ దోషిగా నిలువక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ కేసు విషయంలో పాకిస్థాన్ చర్యలు మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉన్నాయి. కుల్‌భూషణ్‌పై మోపిన అభియోగాలన్నింటినీ ఒక ప్రకటన రూపంలో వెల్లడి చేయటమే తప్ప అందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను ఇప్పటికీ బయట పెట్టలేదు. ఆయనకు వ్యతిరేకంగా తమ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలేమి టో చూపలేదు. మన దేశం కోరినా ఇవ్వలేదు.

విచారణ ప్రక్రియ నిజమో కాదో కూడా తెలియ దు. కనీసం న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు కనపడినా ఇవ్వాళ ఐసీజే ముందు పాకిస్థాన్‌కు తలవంపులు తప్పేవి. ఇప్పటికైనా పాక్ తన దుష్ట పన్నాగాలను పక్కనపెట్టి నడుచుకుంటే మంచిది. సరిహద్దులు దాటిన వారిపట్ల ఎలా వ్యవహరించాలో భారత్ అనేక సందర్భాల్లో ఆదర్శంగా నిలిచింది. షారూఖ్‌ఖాన్‌లా సినీ హీరో కావాలనుకొని సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చిన పాక్ యువకుడు నాసిర్ సుల్తాన్‌ను భారత్ ఆదరించి గౌరవంగా పాక్‌కు పంపింది. కానీ తాగిన మైకంలో సరిహద్దులు దాటిన పం జాబ్ రైతు సరబ్‌జిత్ సింగ్ విషయంలో పాక్ ఎంత క్రూరంగా ప్రవర్తించిందో ప్రపంచం చూసిం ది. అతన్ని అనేక కుట్రకేసుల్లో ఇరికించి ఇరవై రెండేళ్లు వివిధ జైళ్లలో మగ్గి చివరికి అక్కడే ప్రాణాలు వదిలిన విషాదం పాక్ క్రౌర్యానికి నిదర్శనం. గత మూడేళ్ల కాలంలోనే 46మంది పాకిస్థానీ గూఢచారులు పట్టుబడినా ఏ ఒక్కరికీ భారత్ మరణశిక్ష విధించలేదు. వీరితో పాటు ఇక్కడి జైళ్లల్లో ఉన్న 265 మంది పాక్ జాతీయులకు అన్ని రకాల దౌత్యపరమైన సాయం అందజేయటంలో భారత్ ఎంతో ఉదారంగా ఉన్నది. కానీ పాక్ మాత్రం కనీస మానవీయత, అంతర్జాతీయ న్యాయసూత్రాలను పాటించకుండా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర గర్హనీయం.

గతంలో వియన్నా ఒడంబడిక స్ఫూర్తికి విఘాతం కలిగిందంటూ మూడు దేశాలు పరాగ్వే, జర్మనీ, మెక్సికో అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టాయి. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాది అమెరికా. ఆ సందర్భాల్లో అమెరికా తన ఆధిపత్యంతో బాధిత దేశాల మాటలను ఖాతరు చేయకపోవటం ఓ విషాదం. అయితే అదే ఒరవడిలో మొండిగా వ్యవహరించి జాదవ్ విషయంలో ముందుకు పోవాలనుకుంటే పాక్ దుస్సాహసమే. జాతి విద్వేషం నిలువెల్లా నింపుకున్న పాకిస్థాన్‌ది ఆది నుంచీ విపరీత బుద్ధే. కసి, అక్కసు కలగలిసిన కుట్రపూరిత చేష్టలే. ఇరుగు పొరుగుతో ప్రేమానురాగాలతో, పరస్పర సహకారంతో మెలగాలన్న ఇంగితం లేకుండా ద్వేషం పునాదుల మీదనే మనుగడ సాగించాలనుకోవటం లోనే పాక్ విపరీత బుద్ధి కనిపిస్తున్నది. కుట్రపూరిత గూఢచర్య ఆరోపణలు, అడ్డగోలు మరణశిక్షల విధింపును ఉపేక్షించేది లేదని నెలరోజుల క్రితం భారత్ చేసిన హెచ్చరికలు పాకిస్థాన్‌కు చెవికెక్కాయో లేదో తెలియదు. పాక్ కోరల నుంచి కుల్‌భూషణ్ క్షేమంగా సరిహద్దులు దాటి ఇల్లు చేరేదాకా మోదీ ప్రభుత్వం పట్టు సడలకుండా ఉండాలి.

582
Tags

More News

VIRAL NEWS