చరిత్రను వక్రీకరిస్తారా?


Sun,September 15, 2019 12:52 AM

తెలంగాణ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17న, ముందూ వెనకా ఏం జరిగిందనే దానిపై నేటితరం తెలుసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రజల చరిత్రను మరుగునపరిచారు. ఈ స్థితిని తమ కు అనుకూలంగా మలుచుకోవడానికి కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటిష్ పాలకులు భారతదేశ స్వాతంత్య్ర చట్టం-1947లోని సెక్షన్ 2 ద్వారా దేశంలోని 565 సం స్థానాలకు భారత్‌తో లేదా పాకిస్థాన్‌తో లేదా స్వతంత్రంగా ఉండే స్వేచ్ఛనిచ్చారు. హైదరాబాద్, జమ్ముకశ్మీర్, జునాగఢ్ తప్ప మిగిలిన సంస్థానాలు అప్పటి ఉప ప్రధాని సర్దా ర్ వల్లభాయ్ పటేల్, గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాట న్ కార్యదర్శి వి.పి.మీనన్ కృషితో భారత్‌లో విలీనమైనాయి. హైదరాబాద్ విషయానికి వస్తే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ నేత కాశీంరజ్వీ, ఇతర ముస్లిం మత పెద్దలు పాకిస్థాన్‌తో ఒప్పందం చేసుకోవాలని ఒత్తి డి తెచ్చారు. హిందువులు అధికంగా ఉండటం, పాకిస్థాన్‌తో సరిహద్దు లేకపోవడం వల్ల నిజాం ఏ నిర్ణయమూ తీసుకోలేక ఆలస్యం చేశాడు. నిజాంపై కాశీం రజ్వీ ఒత్తిడి పెంచడానికి రజాకార్లను సృష్టించాడు. మరోవైపు స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో స్టేట్ కాంగ్రెస్ భారత్‌లో చేరాలని నిజాంపై ఒత్తిడి తెచ్చింది. పూన, నాగపూర్‌లలో యువకులకు సాయుధ శిక్షణను, ఆయుధాలు ఇప్పించి (రజాకార్ల అకృత్యాల నుంచి ప్రజలను కాపాడే నెపం తో) నిజాంను కలవరపెట్టింది. స్వాతంత్య్రానికి పూర్వమే ఆగస్టు 7న జాయి న్ ఇండియా డే నిర్వహించింది. నిజాం 1947 నవంబర్ 29న భారత్‌తో యథాతథ ఒడంబడిక చేసుకున్నాడు. దీనిప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ విషయం లో తప్ప అన్నింటిలో నిజాం సర్వస్వతంత్రుడు. 1935 చట్టం ప్రకారం ఇదే వెసులుబాటు బ్రిటిష్ పాలకులతో కూడా నిజాంకు ఉన్నది.


1948 సెప్టెంబర్ 17న పూర్తయిన సైనిక చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానంలోని మరట్వాడా, కన్నడ భాషా ప్రాంతాలలో ముస్లిమేతర కుటుంబాలు మాత్రం రజాకార్ల పీడ విరగడైనందుకు సంతోషించాయి. నిజంగానే వారికి సెప్టెంబర్ 17 విమోచన దినం. తెలంగాణ ప్రాంతంలో మిలటరీ సహాయంతో ప్రజలు పంచుకున్న లక్షలాది ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్న జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములకు మాత్రమే అది విమోచనం దినం.


హైదరాబాద్ సం స్థానంలోని భారత సేనలను ఆరు నెలల్లోపు ఉపసంహరించాలనే షరతు కూడా ఈ ఒప్పందంలో ఉన్నది. దీంతో ఆరు నెలల్లోపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఖాళీ అయ్యింది. కానీ భారత ప్రభుత్వం, నిజాం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. తెలంగాణ గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేవులపల్లి, భీంరెడ్డి ప్రత్యక్ష నాయకత్వంలో భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటం కొనసాగింది. ప్రజలు లక్షలాది ఎకరాలు జాగీర్దార్ల, దేశ్‌ముఖ్‌ల భూములను పంచుకొని దున్నుకున్నారు. జాగీర్దార్లు, భూస్వాములు తమను, తమ ఆస్తులను, పెద్దరికాన్ని కాపాడాలని ఎంఐఎం నాయకుడైన కాశీం రజ్వీ శరణుజొచ్చారు. రజ్వీ పంపిన రజాకార్లు, భూస్వాముల అనుచరులతో కలిసి గ్రామాలపై విరుచుకుపడ్డారు. మూకుమ్మడి హత్యలు, లైంగికదాడులు, లూటీలు, దోపిడీలకు పాల్పడ్డారు. రజాకార్ల దురాగతాలు, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం, వారిని అణిచివేయలేని నిజాం అశక్తత. నిజాంను పక్కనపెట్టి ప్రధాని లాయక్ అలీ, కాశీంరజ్వీ విదేశాల నుంచి సిడ్నీ కాటన్ సహాయంతో ఆయుధాలను రహస్యంగా దిగుమతి చేసుకున్నారు. ఈ పరిణామాలు నెహ్రూ-పటేల్‌లను కలవరపెట్టా యి. రజాకార్లపై నిషేధం విధించాలని నిజాంకు నెహ్రూ లేఖ రాశారు. నిజాం దీనికి అంగీకరించలేదు. ఒడంబడిక ప్రకారం స్పర్థలను మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకుందామని, తన తప్పులేవైనా ఉంటే సరిదిద్దుకుంటానని నిజాం బదులిచ్చారు. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించలేదు. హైదరాబాద్‌కు అన్నివైపుల నుంచి మందులు, ఇతర సరఫరాలను నిలిపివేసింది. సైనిక చర్య అనివార్యమని నెహ్రూ ప్రకటించారు. తర్వాత నిజాం ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి కేబుల్ గ్రాం పంపారు. దీనిపై జోక్యం చేసుకొని సైనిక చర్యను ఆపాలని కోరారు. విదేశీ వ్యవహారాల మంత్రి మోయిన్ నవాజ్ జంగ్ ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి వర్గాన్ని ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ పారిస్ సమావేశాని కి పంపించారు. 1948 సెప్టెంబర్ 13న ఉదయం 4 గంటలకు భారత సేన హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించింది.

దారిలో వేలాది మంది నిజాం సైనికులను, రజాకార్లను, అనుమానం వచ్చిన ముస్లిం ప్రజలను భారత సైన్యం చంపినట్టు నెహ్రూ నియమించిన పండిట్ సుందర్‌లాల్ కమిటీ నివేదిక ద్వారా 2013లో ప్రపంచానికి తెలిసింది. హైదరాబాద్ సంస్థానంలో పరిస్థితి ఎంత అధ్వాన్నం గా ఉన్నా నెహ్రూ-పటేల్ ఒడంబడికను ఉల్లంఘించి సైని క చర్యకు పాల్పడటాన్ని లండన్‌తో సహా పలు ఐరాస సభ్య దేశాలు తప్పుపట్టాయి. సైనిక చర్య మొదలైన మరునాడే భద్రతామండలి హైదరాబాద్ సమస్యపై చర్చించిం ది. తనకు తలవంపులు తెస్తున్నదని అర్థం చేసుకున్న నెహ్రూ సైనిక చర్య ముగిసిన తర్వాత నిజాం రాజును సం స్థానాధీశునిగా కొనసాగించారు. జనరల్ చౌదరి గవర్నర్‌గా సెప్టెంబర్ 19న బాధ్యతలు చేపట్టారు. అయితే ఫర్మానాలన్నీ నిజాం సంతకంతోనే వెలువడినాయి. నిజాం కరెన్సీ ఉస్మానియా సిక్కా, నిజాం రైల్వేలు, నిజాం పోస్టల్ సర్వీస్, నిజాం దక్కన్ ఎయిర్‌వేస్, నిజాం హైకోర్టు అన్నీ యథావిధిగా కొనసాగాయి. రాజ్యాంగ పరిషత్‌తో కానీ, పార్లమెంట్‌లో కానీ 1950 జనవరి 26 వరకు హైదరాబాద్ నుంచి ఎవ్వరికీ ప్రాతినిధ్యం లభించలేదు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. దీనికి 48 గంటల ముందు నవంబర్ 24న నెహ్రూ హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేస్తున్నట్టు నిజాంతో లేఖను తెప్పించుకున్నారు (దీనిపై నిజాం సంతకం లేదని చరిత్రకారులంటున్నారు). ఈ విలీనం ఆధారంగా నవంబర్ 30న మిలిటరీ-గవర్నర్ స్థానంలో సివిల్ సర్వీసెస్ అధికారి వెల్లోడీని హైదరాబాద్ ప్రధానిగా నియమించారు. (అప్పట్లో దేశంలోని ప్రెసిడెన్సీ పాలకుడు ప్రధానిగానే వ్యవహరించారు) 1950 జనవరి 25న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నిజాం మధ్య నిజాం ఆస్తులు, రాజభరణం తదితర అంశాలపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 1950 జనవరి 26 న నిజాం హైదరాబాద్ జూబ్లీహాల్‌లో రాజప్రముఖ్‌గా ప్రమాణం చేశారు.
Prakash
రాజ్యాంగం ప్రకారం ఆ రోజునే హైదరాబాద్ భారత్‌లో విలీనమైనట్లు పరిగణించబడింది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారతదేశంలో విలీ నం చేసే ప్రక్రియలో ఒక ప్రారంభంగా చూడాలి. పూర్తి విలీన దినం 1950 జనవరి 26వ తేదీ మాత్రమే. విలీన దినమే కానప్పుడు దాన్నొక స్వాతంత్య్ర దినంగా ఎలా చూడగలం? వివిధ సంస్థానాలు, జాగీర్లు, కొన్ని రాష్ర్టాలు వివిధకాలాల్లో భారతదేశంలో విలీనమైనాయి. అవన్నీ ఆవిర్భావ దినం జరుపుకుంటున్నాయే తప్ప ప్రత్యేకంగా స్వాతంత్య్ర దినాలు జరుపుకోవడం లేదు. భారతదేశ స్వాతంత్య్ర దినాన్నే భారత ప్రజలు (ఏ మూలన ఉన్నా, ఎప్పుడు దేశంలో విలీనమైనా) స్వాతంత్య్ర దినంగా పరిగణించాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేదా ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు విమోచన దినంగా కూడా మిగులలేదు. కేవలం రజకార్లను అణిచివేసి పౌర పాలనను హైదరాబాద్‌లో ప్రారంభించి ఉంటే నిజంగానే దోపిడీ, దౌర్జన్యాల నుంచి విమోచన జరిగినట్లు భావించేవాళ్లం. కానీ 1952 దాకా సుమారు 50 వేల భారత సైనికలు కమ్యూనిస్టుల అణిచివేత పేరుతో అమాయక ప్రజలపై జరిపిన దారుణ మారణకాం డ, రజాకార్ల అకృత్యాలకన్నా ఎన్నోరెట్లు ఎక్కువ. 1948 సెప్టెంబర్ 17న పూర్తయిన సైనిక చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానంలోని మరట్వాడా, కన్నడ భాషా ప్రాంతాలలో ముస్లిమేతర కుటుంబాలు మాత్రం రజాకార్ల పీడ విరగడైనందుకు సంతోషించాయి. నిజంగానే వారికి సెప్టెంబర్ 17 విమోచన దినం. తెలంగాణ ప్రాంతంలో మిలటరీ సహాయంతో ప్రజలు పంచుకున్న లక్షలాది ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్న జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములకు మాత్రమే అది విమోచనం దినం. అంతేతప్ప సామాన్య ప్రజలకు కాదు.

(వ్యాసకర్త: రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్)

609
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles