బీజేపీ దూకుడు టీఆర్‌ఎస్‌కు లాభం

Fri,September 6, 2019 12:57 AM

దేశ మౌలిక రాజకీయ స్వరూపం ఒకలా ఉంటే దక్షిణ భారత రాజకీయాలు మరోలా ఉంటాయి. అందునా తెలంగాణ రాజకీయ స్వరూపం విభిన్నం. ఇక్కడ ఉద్యమస్ఫూర్తి, రాజకీయ చైతన్యం ఎక్కువ. తెలంగాణ రాజకీయాల్లో లౌకికత ధారలా మతతత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ దళిత బహుజన మైనారిటీ స్పృహ కూడా ఎక్కువే. దళితులను, బహుజనులను ద్వితీ య శ్రేణి పౌరులుగా చూసే పార్టీలను వారు తరిమికొట్టే చైతన్యం కలిగి ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ స్వరాష్ట్ర పోరా టం, తెలంగాణ సాధించుకోవడం అంశాల ప్రాతిపదికన రూపొందిన తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ భావనే తెలంగాణ రాజకీయంగా మారిపోయింది. తెలంగాణ కోసం తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడే పార్టీయే తెలంగాణ పార్టీ అనే భావన తెలంగాణ ప్రజల మనసుల్లో బలంగా నాటుకున్నది. వాస్తవానికి తెలంగాణ రాజకీయాలను విశ్లేషించాలంటే టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ముందు, తర్వాత పరిస్థితిని పరిశీలించాలి. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ పూర్తి రాజకీయపార్టీగా మారడం, ఈ మార్పును ప్రజలు స్వాగతించడం చూడవచ్చు. 2014 ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్ ఆధిక్యత స్పష్టమైనప్పటికీ 2014-2018 మధ్య తెలంగాణ భావన తెలంగాణ అభివృద్ధి మూలసూత్రంగా జరిగిన పాలన చూసిన ప్రజలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బహ్మ్రాండంగా వంద స్థానాల దిశగా టీఆర్‌ఎస్‌ను తీసుకెళ్ళడం పెరిగిన గ్రాఫ్‌కు అద్దం పడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ కులవృత్తి దారులకు, మైనారిటీలకు ఒక్కరికేమిటీ ప్రతీ ఒక్కరికి విడివిడిగా వారి అవసరాలకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి తెలంగాణ యావన్మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నది టీఆర్‌ఎస్. ముఖ్యం గా సాగు, తాగునీటి పథకాలైన మిషన్ కాకతీయ, ప్రాజెక్టులు, మిషన్ భగీరథ ఎండిన తెలంగాణ బీళ్ళ దూప తీర్చే అద్భుతమైన పథకాలు. ఇక కళ్యాణలక్ష్మి, ఆసరా పథకాలు ఎవర్‌గ్రీన్.

తెలంగాణ గడ్డ బీజేపీ విభజన సిద్ధాంతాలకు అనువైన ప్రదేశం కాదు. పైగా తెలంగాణ జీవితాలన్నీ దశాబ్దాల పీడనలో మగ్గి ఉన్నవే. కాబట్టి మళ్లీ ఎటువంటి పీడనను కల్పించే పరిస్థితులను తెలంగాణ ప్రజలు కోరుకోరు. వారు కోరుకునేది ఇప్పుడొక్కటే దశాబ్దాల స్వప్నం స్వరాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది. కాబట్టి మన నేలలో మన పాలనను, దానితోపాటే కాస్త ప్రశాంత జీవనాన్నే కోరుకుంటున్నారు. ఇలా ఏ అంశం తీసుకున్న బీజేపీ బలపడటం జరుగదు.


ఇక సాంఘిక సంక్షేమ గురుకులాలు తెలంగాణలో విద్యావ్యవస్థను సమర్థవంతంగా మార్చివేసి నాణ్యమైన ప్రభుత్వ విద్యను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన గొప్ప పథకం. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గొప్ప పథకం. ఈ పథకాన్ని అధికార బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంగతి యావత్ భారత ప్రజానీకానికి తెలుసు. ఇక సమర్థ భూ ప్రక్షాళన, భూ రికార్డుల ఆధునికీకరణ అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు. పథకాలు మాత్రమే కాదు, సమర్థ నాయకుడు ఇక్కడ ప్రధాన పాత్ర పోషించాడు. తెలంగాణ భావనను ప్రపంచవ్యాప్తం చేసిన కేసీఆరే తమ నాయకుడని ప్రజలు మూకుమ్మడిగా అంగీకారం తెలిపారు. విచి త్రమేమంటే ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రధాని మోదీ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బహిరంగంగానే సమర్థించడం గమనించదగిన అంశం. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టే వ్యూహరచన చేస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమేనంటూ ప్రకటనలు చేస్తున్నారు. అసలు తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? గత ఐదేండ్లలో బీజేపీ తెలంగాణకు ప్రత్యేకంగా చేసిందేమిటీ? పసుపు బోర్డు తెస్తానంటూ నిజామాబాద్‌లో ఊదరగొట్టిన బీజేపీ ఆరు నెలలు గడిచినా దాని ఊసే ఎత్తలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక్కదానికైనా జాతీయ హోదా కల్పించిందా?. మరి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓ నాలుగు సీట్లు వచ్చా యి కదా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే వచ్చింది కదా అని ఎదురు ప్రశ్న ఒకటి బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సూటిగా చెప్పాలంటే తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు ను బీజేపీకి బదలాయించడం స్పష్టంగా ప్రజల కళ్లముందే జరిగింది. దానికి ఫలితమే నాలుగు సీట్లు. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగడానికి తెలంగాణలో ఎటువంటి అవకా శం లేదు. తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం వరకు అన్నారం, దర్గా ల సాక్షిగా ఇక్కడి హిందు, ముస్లింలు కలిసిమెలిసే ఉద్యమా లు చేశారు.
dr-c-praveen-kumar
కాబట్టి తెలంగాణలో మత ప్రాతిపదికన రాజకీయాలు నడిపించే పరిస్థితులు ఎప్పుడూ ఉండవు. మైనారిటీ, దళిత, బహుజనులను రెండో పక్షం చేసి సమాజాన్ని విభజించి కొంత ఓటుబ్యాంక్‌ను కొల్లగొట్టాలనే ఎత్తుగడ తెలంగాణలో ఎప్పటికీ సాధ్యం కాదు. సమీప భవిష్యత్‌లో బీజేపీ మతతత్వ విధానాలతో తెలంగాణలో పుంజుకోవాలని చూస్తున్నది. కానీ మౌలికంగానే తెలంగాణ గడ్డ బీజేపీ విభజన సిద్ధాంతాలకు అనువైన ప్రదేశం కాదు. పైగా తెలంగాణ జీవితాలన్నీ దశాబ్దాల పీడనలో మగ్గి ఉన్నవే. కాబట్టి మళ్లీ ఎటువంటి పీడనను కల్పించే పరిస్థితులను తెలంగాణ ప్రజలు కోరుకోరు. వారు కోరుకునేది ఇప్పుడొక్కటే దశాబ్దాల స్వప్నం స్వరాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది. కాబట్టి మన నేలలో మన పాలనను, దానితోపాటే కాస్త ప్రశాంత జీవనాన్నే కోరుకుంటున్నారు. ఇలా ఏ అంశం తీసుకున్న బీజేపీ బలపడటం జరుగదు. బీజేపీ వేర్పాటువాదం వల్ల తెలంగాణ ప్రజ లు ముఖ్యంగా దళిత, మైనార్టీ, బహుజన వర్గాలు టీఆర్‌ఎస్‌కు ఇంకా దగ్గరవ్వడం ఖాయం. ఏ విధంగా చూసినా బీజేపీ దూకుడు టీఆర్‌ఎస్‌కే లాభం.

(వ్యాసకర్త: పోస్ట్ డాక్టోరియల్ సంఘం అధ్యక్షులు, కేయూ)

472
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles