దేశ గతిని మార్చడమే లక్ష్యం

Fri,May 17, 2019 01:07 AM

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి ప్రజలు ఘనవిజయం అం దించారు. అయినా టీఆర్‌ఎస్ పార్టీలోకి ఇతర పార్టీ ల ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుంటున్నారు? తెలంగాణలో ప్రజలు రెండోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజకీయాల మీద కేసీఆర్‌కు ఎందుకు ఆసక్తి? కాంగ్రెస్, బీజేపీలను కాదని కూటమి ఏర్పాటుచేసి విజయవంతమయ్యే సత్తా కేసీఆర్‌కు ఉందా? ఎందుకు ఈ ప్రయత్నాలు? ఇప్పుడు తెలంగాణలో కొందరు వేస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలను కాసే పు పక్కనపెడితే కేసీఆర్ ఏం చేసినా దానివెనుక తెలంగాణ ప్రయోజనాలే ప్రధానమనేది గుర్తుంచుకోవాలి. పధ్నాలుగేండ్ల ఉద్యమంతో దేశంలోని రాజకీయపార్టీల మద్దతు సాధించారు. కాంగ్రెస్, బీజేపీలాంటి జాతీయపార్టీలను తన వ్యూహంలోకి లాగి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని కలిపించారు. ప్రత్యర్థులు బయటకు ఎంత వ్యతిరేకించినా అంతర్గతంగా కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదన్నది అందరూ ఒప్పుకొనేదే. 2001లో ఉద్యమం మొదలుపెట్టి 2014 తెలంగాణ సాధించేవరకు కేసీఆర్ ఎదుర్కొన్నన్ని సవాళ్లు, సంక్షోభాలు, అవమానాలు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కోలేదు. రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ తెలంగాణ భవిష్యత్‌కు గట్టి పునాదులు పడాలని భావించారు. సాగు, తాగునీరు, కరెంట్, సంక్షేమం, ఉద్యోగ, ఉపాధి, పరిశ్రమలు, ఐటీరంగాల అభివృద్ధికి అన్నిరకాల చర్యలు తీసుకున్నారు.

రాష్ర్టాన్ని మాత్రమే కాదు అవకాశం వస్తే దేశ గతిని మలుపు తిప్పాలన్నది కేసీఆర్ ఆకాంక్ష. ఆ అవకాశం రేపో, మాపో రావచ్చు. లేదంటే ఐదేండ్ల తర్వా త ఎన్నికల్లో కేసీఆర్ ప్రశ్నలే ప్రధానాంశాలు కావచ్చు. రాజకీయ భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా తెలంగాణ కోసం 14 ఏండ్లు పనిచేసిన కేసీఆర్‌కు వేచిచూడటం కొత్తకాదు.


కొత్త రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేకరంగాల్లో దేశంలో నే ఉత్తమస్థానాన్ని అందుకున్నది. ఉద్యమంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో రాజకీయపార్టీలను ఒప్పించడానికి అనేక వ్యూహాలను అమలుపరుచడంలో ఆయా పార్టీ నేత ల ఆలోచనా విధానాలను అంచనా వేశారు కేసీఆర్. గత నాలుగున్నరేండ్లు గా తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపించే క్రమంలో కేంద్రం నుంచి అనేక ఒడిదుడుకులను, వ్యవస్థలో ఉన్న అనేక లోపాలను, రాష్ర్టాలపై అవసరం లేని విషయాల్లో కేంద్రం చేస్తున్న కర్రపెత్తనాన్ని, రాష్ట్రం నుంచి వెళ్తున్న నిధులను తిరిగి రాష్ర్టాలకు పంచడంలో అవలంబిస్తున్న విధానాలను అవగాహన చేసుకున్నారు. ఇక కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న విషయాలను వదిలేసి దేశంలో తిరిగి అధికారంలోకి రావడానికి ఏయే పార్టీలను దారిలోకి తెచ్చుకోవాలి? ఏయే రాష్ర్టాల్లో తమ పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది? ఏ పార్టీకి ఏ రాష్ట్రం లో మద్దతు పలికితే తిరిగి తాము కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందన్న దానిమీదనే దృష్టిపెట్టి పనిచేస్తున్నాయని కేసీఆర్‌కు స్పష్టంగా అర్థమైంది. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని వదిలేసి రాష్ర్టా ల మీద కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నది. దీని మూలంగా రాష్ర్టాల అభివృద్ధి కుంటుపడటమే కాకుండా, దేశం ఎదుగుదలకు అవరోధంగా మారుతుంది. ప్రపంచ దేశాల ముందు దేశం పరువు పోతుందన్న బాధతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదించారు.

కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలు మామూలువి కావు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి గత డ్బ్భై ఏండ్లుగా కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు ఎంత లోపభూయిష్టంగా పరిపాలన కొనసాగించాయో తరిచి చూస్తే అర్థమవుతుంది. ఈ దేశంలో ఒక ప్రాజెక్టు కట్టాలంటే రాష్ట్రం ప్రతిపాదిస్తే కేంద్రం అడ్డుకుంటుంది. లేదా ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అడ్డుపుల్లలు వేస్తాయి. కేంద్రంలోని అనేక ప్రభుత్వ పరిధిలోని శాఖలు అనుమతుల విషయంలో నాన్చుడు ధోరణి అవలంబి స్తా యి. అన్నీ అనుమతులు పూర్తయి ప్రాజెక్టు ఉపయోగంలోకి రావాలంటే దశాబ్దాలు గడుస్తాయి. అసలు ఈ దేశంలో నీరు ఎంత ఉంది? ఎక్కడ ప్రాజెక్టులు కట్టగలం? ఎంత కరెంట్ ఉత్పత్తవుతుంది? ఎంత అవసరం? ఎక్కడ ఏ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది? ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలం? అని కేంద్ర ప్రభుత్వం వద్ద ఓ ప్రణాళిక ఉన్నట్లుగానీ, దాని ప్రకారం ముందుకుపోతున్నట్లు గానీ ఎక్కడా కనిపించదు. గుడ్డెద్దు చేలో పడ్డట్లు అధికారం దొరికిన వెంటనే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి తప్పులను మీడియాలో ప్రచారం చేసి రాజకీయంగా దెబ్బతీస్తుంది. మంచి పథకాలు ఏమన్నా ఉంటే పేరుమా ర్చి కొత్త ప్రభుత్వం బొమ్మలేసుకోవడం. అంతే తప్పా దేశాన్ని ముందుకు తీసుకుపోయే ఒక్క మంచి ప్రయత్నమూ కనిపించదు. పీవీ హయాంలో సంస్కరణలు, రాజీవ్‌గాంధీ హయాంలో సాంకేతికతకు పెద్దపీట, వాజపే య్ హయాంలో గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం వంటి కొన్నికొన్ని అంశాలు మినహాయిస్తే మొత్తం దేశ స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందు కు ఒక్క పునాది పడిన దాఖలాల్లేవు. అసలు కేంద్ర పాలకుల వద్ద ఓ సమ గ్ర ఆలోచనా విధానం లేదు.

కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోడు. తీసుకుంటే వెనక్కిపోడు. ఎంతో ఆలోచించే కేసీఆర్ కేంద్ర రాజకీయాలకు వెళ్లాలని భావించారని అర్థమవుతుం ది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయం మీదనే తెలంగాణ ఉద్యమం మొదలైం ది. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కేవలం మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తిచేశారు. అరు వై ఏండ్ల పాటు గోదావరి, కృష్ణాల నుంచి అసలు తెలంగాణకు నీళ్లే రావని చెప్పిన మాటలు నిజంకాదని కేసీఆర్ నిరూపించారు. 24 గంటల విద్యుత్ ను సాకారం చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా దయనీయస్థితిలో ఉన్న రైతన్నలకు రైతుబంధు, రైతుబీమా పథకాలతో అండగా నిలిచి బతుకు మీద భరోసా కల్పించారు. కేసీఆర్ పథకాలను దేశంలోని ఇతర రాష్ర్టాలు ఆచరించేందుకు అధ్యయనం చేస్తుండగా, కేం ద్రం రైతుబంధును కాపీకొట్టి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. కేవలం నాలుగున్నరేండ్ల పాలనతో దేశం దృష్టిని కేసీఆర్ ఆకర్షించడమే కాదు, దేశం మొత్తం రైతు, వ్యవసాయం గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని సృష్టించారు. రైతు కుటుంబం నుం చి, గ్రామీ ణ నేపథ్యం నుంచి ఎదిగివచ్చిన కేసీఆర్ రైతు బతికితే దానిచు ట్టూ అల్లుకున్న ఎన్ని వృత్తులు బతుకుతాయో తెలిసిన వ్యక్తి. అందుకే అధికారం రాగానే దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టుల బూజు దులిపి శరవేగంగా పడావుపడ్డ భూములకు సాగునీటి కలను నిజం చేసి చూపారు.
sandeep-reddy-k
ఇదే సమయంలో కేంద్రం దేశాభివృద్ధికి దేశంలోని నీటిని సమగ్రంగా వాడుకోకపోవడం, 70 ఏండ్ల తర్వాత కూడా దేశంలో కరెంట్ లేని గ్రామాల దుస్థితిని, రహదారి లేని పల్లెల పరిస్థితిని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. అందుకే రాష్ర్టాన్ని మాత్రమే కాదు అవకాశం వస్తే దేశ గతిని మలుపు తిప్పాలన్నది కేసీఆర్ ఆకాంక్ష. ఆ అవకాశం రేపో, మాపో రావచ్చు. లేదంటే ఐదేండ్ల తర్వా త ఎన్నికల్లో కేసీఆర్ ప్రశ్నలే ప్రధానాంశాలు కావచ్చు. రాజకీయ భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా తెలంగాణ కోసం 14 ఏండ్లు పనిచేసిన కేసీఆర్‌కు వేచిచూడటం కొత్తకాదు. అప్పుడు తెలంగాణ ఉద్యమమైనా, ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనైనా నాడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం.. నేడు దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేయడం కోసం.

223
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles