భూమి హక్కు పరీక్ష సులువే

Sat,May 11, 2019 11:29 PM

భూమి హక్కుల చిక్కులు గుర్తించడానికి, వాటి పరిష్కారాలకు చేయాల్సిన ప్రయత్నాలను తెలుసుకోవడానికి మీరే చేసుకోగలిగే ఒక ముఖ్యమైన పరీక్ష. మీకు భూమి ఉందా?వ్యవసాయ భూమైనా, ఇంటిస్థలమై నా, భూమి హక్కులకు 75 రకాల రోగాలు/చిక్కులు ఉంటాయని మీకు తెలుసా? మీకు మీ భూమిపై ఉన్న హక్కులకు ఇందులో ఏదైనా రోగముందో మీకు తెలుసా? భూమి ఉంది కాని పట్టా లేదని, పట్టా ఉంది కాని రికార్డుల లో పేరు రావడం లేదని, రికార్డులలో పేరు ఉంది కాని భూమి/పట్టా లేదని, ఇలా భూమికి సంబంధించి ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. భూమి హక్కులకు సంబంధించి 75 రకాల సమస్యలు ఉంటాయని అంచనా. కానీ ఎక్కువ శాతం భూయజమానులకు తమ భూమికి సమస్య ఉన్న విషయమే తెలియదు, బ్యాంకులో రుణాలు తెచ్చుకోవడానికి వెళ్లినపుడో, రైతుబంధు చెక్కు రానప్పుడో, భూమి అమ్మాలనుకున్నపుడో, సరిహద్దు తగాదాలు వచ్చినపుడో లేదా భూసేకరణలో భూమి పోయినపుడో భూమి సమస్య ఉన్న విషయం బయటపడుతుంది. భూరికార్డు ల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భూయజమానికి భూమి రికార్డులలోని వివరాలు ఇవ్వడం, గ్రామాలకు భూరికార్డులు తీసుకవెళ్లడం వల్ల చాలా భూమి సమస్యలను గుర్తించే వీలు కలిగింది. అయినా ఇప్పటికీ తమకు భూమి సమస్య ఉందా లేదా తెలియని వారు, తెలిసినా అది ఎలాంటి సమస్య, ఆ సమస్య పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియని వారే ఎక్కువమంది. చట్టాలు రికార్డులు ఏవి లేనపుడు ఎవరు భూమి దున్నుకుంటే వాళ్ళదే భూమి అని సమాజం భావించింది. చట్టం కూడా అదే, భూమి స్వాధీనంలో ఉంటే యాజమాన్య హక్కుల నిరూపణలో పదికి తొమ్మిది మార్కులు వచ్చినట్లే.

తెలంగాణ ప్రభుత్వం భూసమస్యల పరిష్కా రంపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఈ సందర్భంలో భూమి సమస్యలను గుర్తించగలిగితే సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్నది. భూమి హక్కుల పరీక్ష చేయడం ఎలా? భూమి హక్కుల పరీక్ష, భూమి హక్కులు భద్రంగా ఉన్నాయా? ఏవైనా భూమి సమస్యలు ఉన్నాయా? అని తెలుసుకోవడానికి సులువుగా చేసుకోగలిగే ఓ చిన్న హక్కుల పరీక్ష.


కానీ ఎప్పుడైతే భూమికి సంబంధించి చట్టాలు చేసుకున్నామో, భూముల సర్వే జరిగి రికార్డులు తయారయ్యాయో భూమి స్వాధీనంలో ఉంటే మాత్రమే సరిపోదు. ఆ భూమి ఎవరిదో చెప్పే ఒక పట్టా, ఆ పట్టా ఉంది అని చెప్పే వివరాలు రికార్డులలో రానట్లయితే ఎప్పటికైనా సమస్యే. అందుకే, స్వాధీనంలో భూమి, చేతి లో పట్టా, రికార్డులలో పేరు ఉంటేనే ఆ భూమిపై వ్యక్తికి ఉన్న హక్కుకు భద్రత. భూమి ఉన్న ప్రతి వ్యక్తి ఒక్కసారైనా భూమి హక్కుల పరీక్ష చేసుకున్నట్లయితే సమస్య ఉందా లేదా అన్న విషయం తెలుస్తుంది. పరిష్కారం చేసుకోవడం కూడా తేలిక అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం భూసమస్యల పరిష్కా రంపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఈ సందర్భంలో భూమి సమస్యలను గుర్తించగలిగితే సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్నది. భూమి హక్కుల పరీక్ష చేయడం ఎలా? భూమి హక్కుల పరీక్ష, భూమి హక్కులు భద్రంగా ఉన్నాయా? ఏవైనా భూమి సమస్యలు ఉన్నాయా? అని తెలుసుకోవడానికి సులువుగా చేసుకోగలి గే ఓ చిన్న హక్కుల పరీక్ష.

ఈ పరీక్షలో మూడు భాగాలు ఉంటాయి.

1. భూమి చిరునామా తెలుసుకోవడం: మనిషికి ఒక పేరు, ఇంటికి ఒక చిరునామా ఉన్నట్లే భూమికి కూడా ఒక చిరునామా ఉంటుంది. భూమి యొక్క సర్వే, సబ్ డివిజన్ నెంబర్, భూమి విస్తీర్ణం; భూమి హద్దులు; ఆ భూమి ఏ రెవెన్యూ గ్రామం పరిధిలో వస్తుంది అనే అంశాలను కలిపి ఆ భూమి చిరునామా అంటాము, పహాణి, గ్రామ నక్షా ఆధారంగా ఒక భూమి సర్వే నెంబర్ ను తెలుసుకోవచ్చు.

2. భూమి రికార్డుల పరిశీలన: భూమికి సంబంధించిన ముఖ్యమైన భూ రికార్డులను తీసుకుని వాటిలో వివరాలను పరిశీలించాలి. సేత్వార్, ఖాస్రా పహణి, చెసాల, 1బీ, పహాణి, నిషేధిత భూముల జాబితా, ఈసీ, భూములకు సంబంధించి ముఖ్యమైన రికార్డులు. ఈ రికార్డులను తహసిల్ కార్యాలయం నుంచి పొందవచ్చు. 1బి, పహానీ, నిషేధిత భూముల జాబి తా, ఈసీలను ఆన్‌లైన్ లేదా ఈసేవా కేంద్రాల ద్వారా పొందవచ్చు.

ఈ రికార్డులలో తప్పకుండా చూడవలసిన వివరాలు.

-భూమి సర్వే నెంబర్/సబ్ డివిజన్ నెంబర్ , విస్తీర్ణం.
-భూమి స్వభావం (ప్రభుత్వ /పట్టా /అసైన్డ్ / ఇనాం/ సీలింగ్ దేవాదాయ/ వక్ఫ్/ టెనెన్సీ / అటవీ భూమి
-భూమి యజమాని పేరు, ఖాతా నెంబర్
-సాగుదారు/అనుభవదారు పేరు
-భూమి సంక్రమించిన విధానం
-నిషేధిత జాబితాలో ఉందా?

3. భూమి సమస్యలను గుర్తించడం: పైన పేర్కొన్న భూమి రికార్డులతో పాటు భూ యజమానుల వద్ద ఉన్న పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్, ఇతర దస్ర్తాలను పరిశీలించి ఏదైనా సమస్య ఉందా అని గుర్తించాలి. 1బి, పహాణిలో వివరాలు అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని చూడాలి.

ప్రధాన భూమి సమస్యలు:

1. పట్టాదార్ పాస్ పుస్తకం / టైటిల్ డీడ్‌లు లేకపోవడం (వారసత్వం / భాగా పంపకాలు / రిజిష్టర్డ్ డాక్యుమెం ట్/ సాదాబైనామా / బహుమతి / పసుపు కుంకుమలు/ అసైన్డ్‌మెంట్ / 38 ఈ సర్టిఫికేట్ ద్వారా వచ్చిన భూమి 2. ఇనాం ద్వారా సంక్రమించిన భూమికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్(ఓ.ఆర్.సి) లేకపోవడం లేదా ఓ.ఆర్.సి. వచ్చినప్పటికీ పట్టదార్ పాస్ పుస్తకం/టైటిల్ డీడ్‌లు జారీ కాకపోవడం 3. పహాణి/ 1బి లో పేరు నమోదు కాకపోవడం లేదా తప్పులు/పొరపాట్లు/తేడాలు ఉండటం.4. భూమి వాస్తవ విస్తీర్ణానికి, రికార్డులలో విస్తీర్ణానికి వ్యత్యాసం 5. పట్టదార్ పాస్ పుస్తకం/టైటిల్ డీడ్ యందు తప్పులు/పొరపాట్లు/తేడాలు, ఉండటం.

6. యాజమాన్యపు హక్కులు వివాదాల్లో ఉండటం

7. భూమి లేని నిరుపేద సాగులో ఉన్న ప్రభుత్వ భూమికి అసైన్డ్‌మెంట్ పట్టా లేకపోవడం

8. భూమి లేని నిరుపేదకు అసైన్డ్‌మెంట్ చేసిన భూమి అన్యాక్రాంతం కావటం

9. అసైన్డ్ చేసిన భూమిని మరో పేద వ్యక్తి కొనుగోలు చేయడం

10. అసైన్డ్‌మెంట్ పట్టా/లావుణి పట్టా వచ్చినప్పటికీ భూమిని చూపించకపోవటం

11. వాస్తవంగా సాగులో ఉన్న సర్వే నంబరుకు, రికార్డులో ఉన్న సర్వే నంబరుకు మధ్య తేడా ఉండటం

12. జాయింటు ఫార్మింగ్ కోపరేటివ్ సొసైటీస్ గల వ్యక్తులు వ్యక్తిగత పట్టాల కొరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకం/టైటిల్ డీడ్ జారీ కాకపోవటం.

13. సర్వే, హద్దు తగాదాలు

14. దారి తగాదాలు

15. వారసత్వం/భాగా పంపకాలు/కొనుగోలు/బహుమతుల ద్వారా వచ్చిన భూములకు రెవెన్యూ/భూమి రికార్డులలో సబ్ డివిజన్ జరుగకపోవటం

16. గిరిజనులు సాగు చేస్తున్నటువంటి అటవీ భూమికి పట్టా ఇవ్వకపోవడం

17. గిరిజనులు అటవీ భూమికి హక్కుపత్రం కోసం పెట్టుకున్నటువంటి దరఖాస్తు తిరస్కరణకు గురి కావడం

18. అటవీ హక్కుల చట్టం కింద జారీ చేసినటువంటి హక్కు పత్రంలో తప్పులు/పొరపాట్లు/వ్యత్యాసాలు ఉండటం.

19. అటవీ హక్కుల చట్టం కింద జారీ చేసినటువంటి హక్కు పత్రాలను పహాణిలో నమోదు చేయకపోవటం

20. అటవీ, రెవెన్యూ సరిహద్దుల సమస్యలు

21. పరిష్కారం కానటువంటి అటవీ సమస్యలు (డీవ్‌‌సు ఫారెస్ట్ సమస్యలు). అటవీ చట్టం కింద ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసి చివరి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం,

22. గిరిజనుల భూముల అన్యాక్రాంతం

23. ఎల్‌టీఆర్ ఆదేశాలు ఉన్నప్పటికీ గిరిజనేతరులు సాగులో ఉండటం.

24. షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనులు కొనుగోలు చేసిన భూములకు పట్టాలు లేకపోవడం. భూమి హక్కుల పరీక్షను చేసుకోవడం వల్ల భూమి సమస్య ఉంటే గుర్తించగలుగడమే కాక ఈ హక్కుల పరీక్షకోసం సేకరించిన రికార్డులు, కాగితాలు మీకు మీ భూమిపై ఉన్న హక్కుకు భద్రతను పెంచుతాయి. ఎప్పుడైనా భూ వివాదం/సమస్య వస్తే ఈ రికార్డులు, కాగితాలే సాక్ష్యాలుగా ఉపయోగపడుతాయి.

భూమిపై హక్కు భద్రంగా ఉండాలంటే?

1. స్వాధీనంలో భూమి - మీ భూమి మీ అనుభవం / అధీనం / సాగులో ఉండాలి. మీ భూమిని కౌలుకు / పాలుకు లీజుకు ఇచ్చినా అది మీ అధీనంలో ఉన్నట్లే.

2. చేతిలో పట్టా: వ్యవసాయ భూమి అయితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కొత్త పాసుపుస్తకం ఉండాలి. దీనితో పాటు కొనుగోలు చేసిన భూమి అయితే రిజిస్టర్డ్ దస్తావేజు, సాదాబైనామా ద్వారా వస్తే 13బి సర్టిఫికెట్, ఇనాం భూమి అయితే ఓ.ఆర్.సి., అసైన్డ్ భూమి అయితే లావుని పట్టా ఉండాలి. అటవీభూమికి హక్కు పత్రం ఉండాలి.

3. రికార్డుల్లో పేరు, వివరాలు: ప్రభుత్వ వివిధ శాఖలు నిర్వహించే భూమి రికార్డులలో వివరాలు నమోదై ఉండాలి. ఇందులో కీలకమైనవి రెవెన్యూ శాఖ నిర్వహించే పహాణి , 1బి, భూమి లావాదేవీలు జరిగితే రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉండే రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్‌లో నమోదు కావాలి. అటవీ భూమి అయితే అటవీ హక్కుల రిజిస్టర్లో నమోదు కావాలి.
(వ్యాసకర్త: భూచట్టాల నిపుణులు, న్యాయవాది నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు)
Sunil-Kumar

305
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles