అంబేద్కర్ ఆశయం ఇదా?


Sat,May 11, 2019 11:29 PM

పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ ఘటన రెండు తెలుగు రాష్ర్టాల్లో చర్చనీయాంశం అయింది. తొలిగించిన చోటే ప్రతిష్ఠించాలని అంబేద్కర్‌వాదులుగా చెప్పుకుంటున్నవారు, పంజాగుట్టలో మాత్రం ప్రతిష్ఠించడం కుదరదని ప్రభుత్వ, అధికారపార్టీ నాయకుల మాటలు వేడిని రాజింపజేస్తున్నాయి. దేశంలోని, రాష్ట్రంలోని దళిత, బహుజనుల ప్రధాన సమస్యలన్నింటినీ వదిలేసి వాటిమీద స్పందించడం లేదు. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయం చేయడం ద్వారా దళిత, గిరిజన, బహుజన కులాలను ఏకం చేసి విగ్రహ ప్రతిష్ఠాపన జరిపే వరకు పోరాటం చేస్తామని మందకృష్ణ ప్రకటించారు. ఈ ఉద్యమ తీరును ఈ రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు గమనించాలి. అసలు మందకృష్ణకు ఉన్న నైతికత గురించి ప్రజాస్వామికవాదులు, దళిత, బహుజన మేధావులు ఆలోచించాలి. అంబేద్కర్ జీవితాన్ని, ఆయన ఉద్యమాన్ని పూర్తిగా గమనించాలి. ఆయన ఎప్పుడూ కూడా వ్యక్తి పూజను గానీ, విగ్రహారాధనను ప్రోత్సహించినట్టు గానీ, సమర్థించినట్టు గానీ కనిపించదు. ఆయన జీవితం మొత్తం ధారపోసి మనల్ని మనుషులుగా మార్చారు. ఆ ఉద్యమం ద్వారా లబ్ధి పొందిన మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లకుండా, ఆయన ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఆయన ఆశయ సాధన ఎంత మాత్రం కాదు. దాన్ని ఆయనకు చేసే ద్రోహంగా మనం చూడవచ్చు. అంబేద్కర్‌కు ఘనమైన నివాళిని, ఆయన ఆశయ సాధనను నిజాయితీగా నిర్వర్తించడం ద్వారానే ఇవ్వగలం. అంతేగానీ విగ్రహాల ద్వారా కానే కాదు.


నా జీవితం మొత్తం ధారపోసి ఉద్యమం అనే రథాన్ని నా చేతనైనంత, నా శక్తియుక్తుల మేరకు లాక్కురావడం జరిగింది. దానితోనే మీరందరూ ప్రస్తుత స్థానాల్లో ఉన్నారు. మీకు చేతనైతే ఆ రథాన్ని ముందుకు తీసుకెళ్లండి. తప్పితే వెనక్కి లాగే ప్రయత్నం మాత్రం చేయకండి అని అంబేద్కర్ మాటలను గుర్తు చేసుకోవాలి. ఆ రథాన్ని వెనక్కి లాగే పనిలో మందకృష్ణ ముందుకు దూసుకెళ్తున్నాడనిపిస్తున్నది.


ఇక్కడ మనం మందకృష్ణ గురించి ఆయన ఎంఆర్‌పీఎస్ ఉద్యమం వల్ల బహుజన ఉద్యమానికి జరిగిన నష్టం గురించి కాన్షీరాం చెప్పిన మాటలను ప్రస్తావించుకోవాల్సి ఉన్నది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా లాంటి చమార్, మిగతా దళిత కులాల జనాభా గల రాష్ర్టాల్లో దళిత, బహుజనులు అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసే బీఎస్పీని ఆదరిస్తున్నారు. కానీ దక్షిణ భారతదేశంలో అత్యంత సామాజిక చైతన్యం గల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీఎస్పీని గానీ, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసే దళిత, బహుజన ఉద్యమం ఎదగలేదు. దీనికి ఉత్తర భారతం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అంబేద్కర్ ఉద్యమం బలంగా తయారు కాకపోవడానికి ఇక్కడ ఒక బలమైన అడ్డుగోడ కారణమవుతున్నది. అదే మందకృష్ణ నాయకత్వంలోని ఎంఆర్‌పీఎస్ ఉద్యమం అని కాన్షీరాం గారు చాలాసార్లు మనోవేదనకు గురయ్యారు. ఐక్యత విచ్ఛిన్నానికి అలా 85 శాతం గల దళిత, బహుజన, మైనార్టీల ఐక్యతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతూ ఎంఆర్‌పీఎస్ అనే చిన్న హక్కును సాధించడం కోసం తన జీవితాన్ని, ఎంతోమంది కార్యకర్తల జీవితాలను బలిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్పీని ఎదగనివ్వలేదు. తద్వారా అంబేద్కర్ ఉద్యమం ఎదగకుండా చేసిన వ్యక్తి మందకృష్ణ. ఇరువై ఏండ్ల తర్వాత తన ఉద్యమం అంతా నీరుగారి, వ్యవస్థ నుంచి సామాన్య వ్యక్తిగా మారారు. ఇప్పుడు మందకృష్ణకు అంబేద్కర్ గుర్తుకు రావడం నిజంగా బాధాకరం. విగ్రహ తొలిగింపునకు కొద్దిరోజుల ముందు జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లనివ్వలేదు. అగ్రవర్ణ పార్టీకి లబ్ధి చేకూరుస్తూ ఏపీలో నోటాకు ఓటు వేయమని చెప్పారు.

బీఎస్పీ, జనసేన (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ)లను ప్రత్యక్షంగా, పరోక్షంగా బలహీనపరుస్తూ మందకృష్ణ అంబేద్కర్ ఉద్యమానికి ద్రోహం చేశారు. మందకృష్ణకు అంబేద్కర్ విగ్రహం గురించి గానీ, ఆయన ఆశయ సాధన గురించి గానీ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అంబేద్కర్ ఆశయ సాధన గురించి మాట్లాడే ముందు అంబేద్కర్‌ను చదువవలసిందిగా మందకృష్ణకు సలహా ఇవ్వదలచుకున్నాను. అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టినందుకు దానిని తిరిగి ప్రతిష్ఠించాలని చేసే ఉద్యమంలో, అంబేద్కర్‌ను జీవితాంతం ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సభ నిర్వహించడం ఆయన అవివేకానికి నిదర్శనం. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై పోరాటం కోసం, అంబేద్కర్‌ను ఇబ్బంది పెట్టిన వారిని వాడుకోవడం నిజంగా దురదృష్టకరం. ఒక్కసారి ఆయన గర్జన సభకు వచ్చిన నాయకులను పరిశీలిస్తే వారెవ్వరికీ అంబేద్కర్ ఉద్యమంతో సంబంధం లేదు. పైపెచ్చు ఆయన ఆశయ సాధకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. నా జీవితం మొత్తం ధారపోసి ఉద్యమం అనే రథాన్ని నా చేతనైనంత, నా శక్తియుక్తుల మేరకు లాక్కురావడం జరిగింది. దానితోనే మీరందరూ ప్రస్తుత స్థానాల్లో ఉన్నారు. మీకు చేతనైతే ఆ రథాన్ని ముందుకు తీసుకెళ్లండి. తప్పితే వెనక్కి లాగే ప్రయత్నం మాత్రం చేయకండి అని అంబేద్కర్ మాటలను గుర్తు చేసుకోవాలి. ఆ రథాన్ని వెనక్కి లాగే పనిలో మందకృష్ణ ముందుకు దూసుకెళ్తున్నాడనిపిస్తున్నది. విగ్రహ ధ్వంసం విషయంలో కేసీఆర్‌ను మందకృష్ణ రోజూ నానా మాటలంటున్నాడు.
Pidamarthi-Ravi
దళిత వ్యతిరేక విధానానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నాడు. ఇక్కడ మందకృష్ణకు అర్థం కావల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ తన స్వధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తున్నాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీకు మా ఓట్ల ద్వారా తగిన శాస్తి చేస్తామని మందకృష్ణ ప్రగల్భాలు పలికాడు. అయితే గత ఎన్నికల్లో (63 సీట్లు) కంటే ఈ ఎన్నికల్లో (88 సీట్లు) గెలుచుకున్నారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో అధిక జనాభా గల తన కులం తనతో ఉన్నదో లేదో, ఉంటే గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ మెజారిటీని కేసీఆర్ ఎలా సాధించగలిగాడో మందకృష్ణ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మందకృష్ణ తన జాతిని తాకట్టు పెట్టి లబ్ధి పొందే ఉద్యమాలను నిలిపివేయాలి. తన జాతి ద్రోహిగా మిగిలిపోకూడదని కోరుకుందాం.
(వ్యాసకర్త: మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు)

505
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles