పరిశోధనారంగం పటిష్టమవ్వాలె

Sat,May 11, 2019 12:41 AM

పరిశోధనారంగం పటిష్టపరిస్తేనే దేశ ప్రగతి సాధ్యమౌతుంది. ఆ అనుభవం ఉన్నవాళ్లే విశ్వవిద్యాలయాలను ప్రతిష్టాత్మకంగా మార్చగలరు. పీహెచ్‌డీ విద్యారంగంలో అత్యుత్తమైనది. కాబట్టి కేవలం పేపర్ మీద ఉండటం కాకుండా ఆ డిగ్రీ హోల్డర్ అత్యంత చైతన్యవంతమైన బోధకుడిగా, ప్రతిభావంతమైన పరిశోధకుడిగా, అత్యున్నత నైపుణ్యాలు కలిగి ఉండాలి. వాటిని తన విద్యార్థులకు అందించాలి.

Kanakadurga
ఏ రంగమైనా ప్రగతి సాధించాలంటే ఆ రంగానికి సంబంధించిన అంశాల మీద లోతైన పరిశోధన జరుగాలి. యూరప్‌లో ని కొన్ని దేశాలు, సాంకేతిక రంగాల్లో విశిష్టమైన పరిశోధన వల్ల ప్రగతి సాధించాయి. అయితే ఈ పరిశోధన సరిగ్గా జరుగాలంటే అవినీతి, బంధుప్రీతి, దురభిమానాలు పక్కనపెట్టి ప్రభుత్వాలు, అధికారులు ప్రజ్ఞ కలిగిన పరిశోధకులను ప్రోత్సహించాలి. మౌఖికంగానే కాకుండా ధన సహాయం చేసి ఉపయోగకరమైన పరిశోధనలను ప్రోత్సహిస్తే దేశాభివృద్ధి జరుగుతుంది. ప్రయోగశాలలు కలిగిన శాస్త్ర, సాంకేతిక సంస్థల్లోనూ, దేశంలోని విశ్వవిద్యాలయాల్లోనూ ఎక్కువగా పరిశోధనలు జరుగుతాయి. వైద్య రంగానికి సంబంధించిన అంశాల మీద ఆయా దవాఖానల్లోనూ, వాటికి సంబంధించిన వైద్య కళాశాలల్లోనూ జరుగుతాయి. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఆ విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. అయితే భారత్ పరిశోధనారంగంలో ప్రపంచంలో పాశ్చాత్య దేశాల కంటే కాదు, ఆసియా దేశాలైన చైనా, జపాన్, కొరియా దేశాల కంటే కూడా చాలా వెనుకబడి ఉన్నది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతున్నదో పరిశీలిద్దాం!

దేశంలో ఉన్న 819 విశ్వవిద్యాలయాల్లో చాలావాటిలో పీహెచ్‌డీ ప్రోగ్రాం ఉన్నది. చాలాచోట్ల ఈ ప్రోగ్రాంలో అడ్మిషన్‌కు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. యూజీసీ నిర్వహించే పరీక్ష నెట్. దాదాపు పీజీ కోర్సులు ఉన్న అన్నీ సబ్జెక్టుల్లోనూ దేశవ్యాప్తంగా ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. అలాగే రాష్ర్టాలు తమ రాష్ట్రస్థాయి పరీక్ష సెట్‌ను నిర్వహిస్తాయి. ఈ పరీక్ష లో అర్హత సంపాదించిన వారు పీహెచ్‌డీలో చేరడానికి, విశ్వవిద్యాలయా ల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరడానికి అర్హులు. అయితే ఈ పరీక్షలకు ఉపయోగించే ప్రశ్నాపత్రం మాత్రం వారి జ్ఞాపకశక్తిని పరీక్షించేదిగా ఉన్నది. కానీ పీహెచ్‌డీకి అవసరమైన భాషా నైపుణ్యాలు-ముఖ్యంగా రాయడం లో, బోధనకు అవసరమైన బోధనా నైపుణ్యాలు పరీక్షించేదిగా లేదు. నెట్, సెట్ ప్రశ్నపత్రాలు పరిశోధనకు కావల్సిన విమర్శనాశక్తి, విశ్లేషణాశక్తి, రచ నా నైపుణ్యాలు పరీక్షించకుండా, కేవలం ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో అభ్యర్థుల జ్ఞాపకశక్తిని మాత్రం పరీక్షిస్తాయి. వీటిలో అర్హత సంపాదించి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో చేరిన వారికైనా ఆయా విశ్వవిద్యాలయాలు పరిశోధనా గ్రం థం రాయడానికి అవసరమైన భాషా నైపుణ్యాలు (ముఖ్యంగా ఇంగ్లీషు లో) బోధించే కోర్సు ఏమైనా ఇస్తాయా అంటే అదీ లేదు. పాశ్చాత్య దేశా లు, ముఖ్యంగా ఇంగ్లీషు మాతృభాషగా కలిగిన దేశాల్లో ఇతర భాషల వారు పీహెచ్‌డీ చేయాలంటే అంతర్జాతీయ ఇంగ్లీషు భాషా పరీక్షలైన టోఫె ల్, జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్ వంటివి పాసైనా కూడా, ఆయా విశ్వవిద్యాలయాలు అందించే అకడమిక్ రైటింగ్ కోర్సు చేయడం తప్పనిసరి. మరి ఇన్ని భాషలు మాట్లాడే రాష్ర్టాలున్న మన దేశంలో డిగ్రీ దాకా సరైన ఇం గ్లీషు కోర్సులు లేక, పీజీ కోర్సులు చేసి, ఎలాగోలా పీహెచ్‌డీలో ప్రవేశించిన వారు అత్యున్నత భాషా ప్రమాణాలు కావల్సిన పరిశోధన ఎలా చేస్తా రు? వారి పరిశోధనా గ్రంథాలు ఇంగ్లీషులో ఎలా రాస్తారు? దేశంలో ఇన్ని విశ్వవిద్యాలయాలున్నా, ఒక్క కులపతి, ఒక్క రాష్ట్ర ప్రభుత్వమూ ఈ రకమైన ఆలోచన చేయకపోవటం విచారకరం. ముఖ్యంగా పల్లెటూర్ల నుంచి కష్టపడి చదువుకొని, ఈ స్థాయి దాకా వచ్చిన యువత ఈ విషయంలో చాలా బాధలకు గురవుతున్నది.

ఒక పక్క డిగ్రీ కాలేజీల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ పీహెచ్‌డీ డిగ్రీ ఉన్న వారినే నియమించాలనే నిబంధనలు చేసిన యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రోగ్రాం అందరికీ అందుబాటులో ఉందా అన్న ఆలోచన మాత్రం చేయటం లేదు. అసలు దేశంలో ఉన్న విశ్వవిద్యాయాల్లో ఏ పరిశోధనలు జరుగుతున్నాయో తెలుసుకునే మార్గమే లేదు. ఈ విశ్వవిద్యాలయాలను లింక్ చేస్తూ ఆయా సంస్థల్లో ఉన్న అవకాశాలు, ఆచార్యులు, వారి వివరాలు, జరుగుతున్న పరిశోధనల టైటిల్స్, ప్రవేశపరీక్షల ప్రకటనలు, పుస్తకాలు, డిజిటల్ మెటీరియల్ వివరాల వంటివి ఒక్క పోర్టల్‌లో పొందుపరుచటానికి ఏం అడ్డంకి ఉన్నది? జరిగిన, జరుగుతున్న పరిశోధనలు తెలియటం పరిశోధక విద్యార్థులకు చాలా అవసరం కదా!
విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ పరిశోధనల స్థాయి ఉన్నతంగా ఉండాలంటే బయటి విశ్వవిద్యాలయాల్లోని అనుభవజ్ఞులు, ఆయా రంగాల్లో నిపుణులు, పరిశోధక విద్యార్థి, ఆ పరిశోధన గైడ్ చేసే సూపర్ వైజర్ తెలియని వారిని ఆయా గ్రంథాల పరీక్షకులుగా నియమించాలి. ఇప్పుడున్న ఒక నిబంధన ఈ రకమైన స్థాయి లేకుండా అడ్డుపడుతున్నది. అదేమిటంటే పరిశోధన ఎవరు సూపర్‌వైజ్ చేస్తారో ఆ రీసెర్చ్ గైడే బయటి పరీక్షకుల లిస్ట్ ఇస్తారు. అంటే చాలా విశ్వవిద్యాలయాల్లో ఈ నిబంధన వల్ల యథేచ్ఛగా క్విడ్ ప్రో కో పద్ధతి సాగుతున్నది. పరిశోధనాస్థాయి ఎలా ఉన్నా రెండు విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఆచార్యులు నా విద్యార్థి గ్రంథం నువ్వు, నీ విద్యార్థి గ్రంథం నేను అప్రూవ్ చేయాలన్న పద్ధతిలో చాలా డిగ్రీలు వస్తున్నాయి. ఈ పద్ధతి మారి, ముగ్గురు పరీక్షకులెవరో పరిశోధక విద్యార్థికి, గైడ్‌కు తెలియకుండా అట్టిపెట్టి ఆ గ్రంథాన్ని మూల్యంకనం చేస్తే బాగుంటుంది. యూరప్‌లో చాలా దేశాల్లో వైవా పరీక్ష (మౌఖిక పరీక్ష) ఓపెన్ విధానంలో జరుగుతుంది.

అంటే దేశంలో ఏ విశ్వవిద్యాలయ ఆచార్యులైనా దానిలో పాల్గొని పరిశోధక విద్యార్థిని ప్రశ్నలు అడుగవచ్చు. మరి ఇటువంటి స్థాయి మన దేశంలో ఎప్పుడు సాధిస్తాం? పరిశోధనారంగం పటిష్టమవ్వాలంటే పీజీ కోర్సుల స్థాయిలోనే ఆయారం గాల్లో పరిశోధనకు అవకాశం ఉన్న అంశాల గురించి విద్యార్థులకు బోధించాలి. పరిశోధనలో చేరడానికి నిర్వహించే ప్రవేశపరీక్ష కేవలం జ్ఞాపకశక్తినే కాక, విశ్లేషణ, విమర్శనా, ఆలోచనా, ఊహాశక్తులను పరీక్షించేదిగా ఉండాలి. రాయడంలోని నైపుణ్యాలను పరీక్షించేదిగా ఉండాలి. ఆబ్జెక్టివ్ పరీక్ష కాకుండా వ్యాసాలు రాసేటట్టు ప్రశ్నలు రూపొందించాలి. ఇక పరిశోధన గ్రంథం సమర్పించి న తర్వాత పరీక్షకుల రిపోర్టులు రావడం, వైవా పరీక్ష జరిగి డిగ్రీ డిక్లేర్ అవటం ఆరు నెలల్లో జరిగేట్టు యూజీసీ విశ్వవిద్యాలయాలకు నిబంధనలు విధించాలి.పరిశోధనారంగం పటిష్టపరిస్తేనే దేశ ప్రగతి సాధ్యమౌతుంది. ఆ అనుభవం ఉన్నవాళ్లే విశ్వవిద్యాలయాలను ప్రతిష్ఠాత్మకంగా మార్చగలరు. పీహెచ్‌డీ విద్యారంగంలో అత్యుత్తమైనది. కాబట్టి కేవలం పేపర్ మీద ఉం డటం కాకుండా ఆ డిగ్రీ హోల్డర్ అత్యంత చైతన్యవంతమైన బోధకుడిగా, ప్రతిభావంతమైన పరిశోధకుడిగా, అత్యున్నత నైపుణ్యాలు కలిగి ఉండాలి. వాటిని తన విద్యార్థులకు అందించాలి. ఈ విధంగా విద్యారంగం ప్రతి పరిశోధక విద్యార్థిని తయారుచేయాలి.

152
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles