రెవెన్యూ శాఖ మారాల్సిందే

Wed,April 17, 2019 01:03 AM

-భూ సమస్యల పరిష్కారానికి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అవసరం
-నమస్తే తెలంగాణతో నల్సార్ లా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్

m-sunil-kumar
తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిది రైతుకు భూమికి ఉన్న సంబంధం.. కానీ రైతులకు ఇప్పటివరకు భూమిపై పూర్తిస్థాయి హక్కులను ఇవ్వలేదు. దీంతో ఏ చిన్న వివాదం ఏర్పడినా ఈ భూమి నాదని భూ యజమానులే నిరూపించుకోవాల్సిన దుస్థితి ఉన్నది. దీనిని పూర్తిగా నిర్మూలించి భూ యజమానుల భూములకు టైటిల్ గ్యారంటీ దిశగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు చేస్తున్న కృషి చారిత్రాత్మకం. భూమికి శిస్తులు కట్టే వ్యవస్థ నుంచి రైతులు భూమిని సాగు చేయడానికి రైతుబంధు పథకం, రైతుకు ధీమా కోసం రైతుబీమా పథకం అమలుచేసే స్థాయికి వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తప్పనిసరి.. అని భూమి సమస్యల పరిష్కారం కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ చెప్పారు. రెవెన్యూ విభాగం రైతులకు పూర్తిస్థాయిలో సంతృప్తికర సేవలందించడంలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారచర్యలపై ఆయన అభిప్రాయాలు క్లుప్తంగా..

భూమి సమస్యలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుందా?

రాజకీయ దృఢసంకల్పం ఉంటే సాధ్యమవుతుంది. ఈ దిశగా తెలంగాణ రాష్ట్రం శరవేగంగా పయనిస్తున్నది. భూ సమస్యల మీద పనిచేయడమనేది తేనెతుట్టెను కదిపినట్లే. కాబట్టి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు ఈ సమస్య పూర్తి పరిష్కారానికి కృషిచేయలేదు. ఈక్లిష్టమైన సమస్యకు స్పష్టమైన అంతిమ పరిష్కారం కనుగొనడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృషిచేస్తున్నారు. మొదటగా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యల పరిష్కారంలో భాగంగా సాదాబైనామా క్రమబద్ధీకరణ చేశారు. భూ సర్వే ప్రతిపాదనలు వచ్చాయి, ఆ తర్వాత రైతులకు వెంటనే మేలు జరిగే విధంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు.

ఈ కార్యక్రమాల ద్వారా స్పష్టమైన, సమగ్రమైన భూ రికార్డులు తయారుచేయగలిగాం. ఆ తర్వాత జరు గాల్సిన కార్యక్రమం భూ రికార్డులలో ఉన్న వివరాలకు ప్రభుత్వమే పూర్తి హామీ ఇవ్వడం. ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించడం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆ ప్రయత్నాన్ని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నది. ఈ ప్రయత్నాలు సఫలమై భూమి హక్కులకు పూర్తి హామీ ఇవ్వగలిగితే దేశంలోనే తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రం అవుతుంది. సీఎం కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. గత ముప్ఫై ఏండ్లుగా దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితం దక్కలేదు.

భూ పరిపాలన వ్యవస్థలో మార్పులు లేకుండా టైటిల్ గ్యారంటీ ఇవ్వలేమా?

సాధ్యం కాదు. సీఎం కేసీఆర్ భూ యజమానులకు, యావత్ రైతాంగానికి భూమిహక్కుకు పూర్తి భద్రత, భరోసా కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది నెరవేరాలంటే చట్టం మారాలి. వ్యవస్థలో మార్పులు రావాలి. ఇవి రెండు పార్శాలు. చట్టాలు కానీ, వ్యవస్థ కానీ ప్రజల అవసరాలకు అనుగుణంగా మారుతుండాలి. శాఖ ఉండాలా వద్దా అనేది చర్చనీయాంశం కాదు. ఎలాంటి మార్పులు ప్రజలకు మంచి చేస్తాయో వాటిని చర్చించాలి. ఒకప్పుడు భూమికి ఏ పన్నూ లేదు. ఆ వ్యవస్థలో కాగితాలే అవసరం రాలేదు. రెవెన్యూశాఖ లేదు. ఎప్పుడైతే భూమి శిస్తు వచ్చిందో అప్పుడు రెవెన్యూశాఖ పుట్టింది. తర్వాత రోజుల్లో ఆర్వోఆర్ వ్యవస్థను తెచ్చాం. కొద్దిరోజుల తర్వాత భూమి శిస్తును పూర్తిగా ఎత్తివేశాం. దీంతో భూ యజమానులకు భూమిపై లబ్ధి పొందుతన్న హక్కుపత్రం కావాలి. ఈ మేరకు పత్రాలు జారీ చేయడమే రెవెన్యూశాఖ ప్రధాన పని అయింది.

ఆ తర్వాత భూమి రికార్డుల ఆధునీకరణ మొదలుపెట్టాక భూ పరిపాలనలో కంప్యూటర్లు, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు వచ్చాయి. ఇప్పుడు భూమి రికార్డులను దాదాపు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా తయారుచేసుకున్నాం. జరుగాల్సింది ఆ భూములకు హక్కు హామీపత్రం ఇవ్వడమే. హక్కుకు హామీ ఇవ్వాలంటే ఒక టైటిల్ గ్యారంటీ అథారిటీ ఉండాలి. భూములను రిజిస్ట్రేషన్ చేసే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. భూ వివాదాలను సత్వరం పరిష్కరించడానికి ట్రిబ్యునల్ ఉండాలి. ఇన్స్యూరెన్స్ ఫం డ్ ఉండాలి. ఇప్పటికైనా రెవెన్యూశాఖ రాబోయే అవసరాలకు అనుగుణం గా మార్పులకు లోనుకావాల్సిందే. ఇప్పుడున్న రెవెన్యూ యంత్రాంగమే మరో రూపంలో భూసేవల్లో పాల్గొంటుంది. కొత్తవాళ్లు వస్తారు. ఉన్న వాళ్లు ఉంటారు. ఇది సహజ ప్రక్రియ.

రెవెన్యూశాఖ ఉద్యోగుల ఆందోళన ఎందుకు?

టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత రెవెన్యూశాఖ పవర్ పోతుంది. భూ పరిపాలనలో ఇప్పుడున్నంత అవసరం ఉండదు. ప్రజలు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లే అవసరం రాదు. భూమికి సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అంతర్జాలంలో అందుబాటులో ఉం టాయి. దీనివల్ల రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూశాఖ ఉద్యోగులంతా మరో పేరుతో ప్రజలకు సేవచేయాల్సిందే. అధికార దర్పం చూపించుకునే వీలుండదు. భూ వ్యవస్థ మార్పుల కోసం ఇప్పటివరకు

ఏమైనా ప్రయత్నాలు జరిగాయా?

టైటిల్ గ్యారంటీ వ్యవస్థలపై 1908 నుంచి కూడా చర్చ జరుగుతున్నది. ఆ కాలంలో రిజిస్ట్రేషన్ చట్టాన్ని రూపొందించే క్రమంలో టైటిల్ రిజిస్ట్రేషన్‌కు బదులుగా డీడ్ రిజిస్ట్రేషన్‌కు మొగ్గు చూపి, ఆ విధంగానే రిజిస్ట్రేషన్ చట్టాన్ని రూపొందించారు. ఆ తర్వాత స్వాతంత్య్రానంతరం రైతులకు పంట రుణాలు ఏ విధంగా అందించాలి? దీనికోసం ఎలాంటి భూమి రికార్డులు ఉండాలనేవాటిపై అధ్యయనం కోసం పలు రాష్ట్రాలలో కమిటీలు ఏర్పాటుచేశారు. ఆ కమిటీలన్నీ కూడా టైటిల్ గ్యారంటీకి బదులుగా ఇప్పుడు అమలులో ఉన్న ఆర్వోఆర్ వ్యవస్థకే మొగ్గు చూపాయి. 1987లో మొదటిసారిగా టైటిల్ గ్యారంటీ ఈదేశానికి అవసరమని ప్లానిం గ్ కమిషన్ ఏర్పాటుచేసిన కమిటీ సిఫారసు చేసింది. అప్పటి ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మన్మోహన్‌సింగ్, ప్రొఫెసర్ డీసీ వాద్వాల ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటుచేశారు. కానీ 2008 వరకు ఆ వైపుగా ఎలాంటి ప్రయత్నాలు జరుగలేదు.

మన్మోహన్‌సింగ్ ప్రధాని అయిన తరువాత 2008లో చొరవ చేసి మరో కమిటీని వేశారు. ఈ కమిటీ టైటిల్ గ్యారంటీ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. టైటిల్ గ్యారంటీ అమలుకోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టి, దేశం మొత్తం ఈ పథకం అమలుకోసం రోడ్‌మ్యాప్‌ను తయారుచేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ పథకానికి మార్పులు చేసి, రూ.11వేల కోట్లు కేటాయించి 2022నాటికి లక్ష్యాన్ని పూర్తిచేయాలని నిర్దేశించుకున్నారు. ఈ మేరకు రాజస్థాన్ కొత్త చట్టం చేసుకోగా, హర్యానా, మహారాష్ట్రలో పైలట్ కార్యక్రమం నిర్వహించారు. ఇలా ప్రయత్నాలు ఎన్నో జరిగాయి కానీ ఫలితాలే రాలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో దేశంలో టైటిల్ గ్యారంటీ ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ కాబోతున్నది.
- నమస్తే తెలంగాణ ప్రతినిధి

రెవెన్యూశాఖలో, భూ పరిపాలనలో ఎలాంటి మార్పులు రావాలి?

ఏ మార్పులకైనా భూ యజమానులు, రైతుల మేలే కొలమానం కావాలి. వారివైపు నుంచి ఆలోచించినట్లయితే భూమి రికార్డులన్నీ భద్రంగా పూర్తి హామీ ఇచ్చేవిధంగా ఉండాలి. సులభంగా అందుబాటులో ఉండాలి. హక్కుల చిక్కులు వస్తే సత్వరం తేల్చే యంత్రాంగం ఉండాలి. చట్టాలలో ఎలాంటి గందరగోళాలు లేకుండా ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలో స్పష్టత ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే భూ యజమాని ఏ కారణంతోనైనా తన భూమి కోల్పోతాననే భయం లేకుండా, ఆ భూమి నుంచి పూర్తి లబ్ధి పొందగలిగే పరిస్థితి ఉండాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడాలంటే రెండు కీలక మార్పులు జరగాలి. 1)వందకుపైగా ఉన్న రెవెన్యూ చట్టాలన్నింటిని పునఃసమీక్షించి ఒకే చట్టాన్ని రూపొందించాలి. ఇప్పుడున్న ఆర్వోఆర్ చట్టం స్థానంలో భూమి హక్కుకు పూర్తి భద్రత ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలి. ఈ రెండు మార్పులకు అనుగుణంగా ఇప్పుడు భూ పరిపాల న చేస్తున్న రెవెన్యూ శాఖను పునర్వ్యవస్థీకరించాలి. ఆ శాఖలో ఉన్న సిబ్బంది అందరికీ మెరుగైన శిక్షణ ఇవ్వాలి. సరైన అజమాయిషీ ఏర్పాటు చేయాలి.

m-sunil-kumar2

సీఎం కేసీఆర్ తీసుకొచ్చే మార్పులతో రైతులకు, యావత్ భూ యజమానులకు జరిగే మేలు ఏమిటి?

సీఎం కేసీఆర్ ఆశించిన మార్పులు అమలులోకి వస్తే భూ యజమానులు, రైతులు తమ భూములపై ఎలాంటి చిక్కులు లేకుండా సంపూర్ణంగా లబ్ధిని పొందగలుగుతారు. ఏటా పంట రుణం, పంటబీ మా, రైతుబంధు, రైతుబీమా.. ఇలా అన్నిరకాల ప్రయోజనాలు సక్రమంగా వారికి అందుతాయి. ఏటా ప్రతి రైతు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎకరానికి రూ.50 వేల నుంచి లక్ష వరకు లబ్ధి పొందడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. భూముల విలువలు పెరుగుతాయి. హక్కుల వివాదాలు ఏర్పడకుండా ఉంటాయి. ఒకవేళ వివాదం వచ్చినా సత్వర పరిష్కారం జరుగుతుంది. గ్యారంటీ వ్యవస్థ అమలులో ఉండటం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను కోల్పోయే అవకాశం లేదు. నష్టం జరిగినవారికి ఇన్స్యూరెన్స్ ద్వారా నష్ట పరిహారం లభిస్తుంది. ప్రభుత్వపరంగా ఆలోచిస్తే టైటిల్ గ్యారంటీ వల్ల ఏటా రాష్ట్ర ఆదాయంలో 1/3 శాతం వృద్ధి కనిపిస్తుంది. సివిల్ కోర్టులలో ఉన్న వివాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. నేరాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. అంతేకాదు.. భూములకు ప్రభుత్వ గ్యారంటీ ఉండటంతో పెట్టుబడులు పెరుగుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది.

m-sunil-kumar3

టైటిల్ గ్యారెంటీ వ్యవస్థను అమలుచేయడంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా?

భూమి హక్కుకు హామీ ఇచ్చే చట్టం వస్తే మొదట్లో వివాదాల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో రికార్డుల్లో తప్పులుంటే ఎన్నేండ్ల తర్వాతనైనా వాటి సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ రాబోయే వ్యవస్థలో నిర్ణీత కాలవ్యవధిలో దరఖాస్తు చేసుకోనట్లయితే రికార్డుల్లో ఏముందో అదే ఫైనల్ అవుతుంది. నిర్ణీత కాలవ్యవధి ఏడాదికంటే ఎక్కువగా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భూములు సర్వే చేయకుండా పూర్తి హామీ ఇవ్వడం సాధ్యంకాదు కాబట్టి మొదటగా ఇప్పుడున్న రికార్డుల వివరాలకు గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత భూ సర్వే పూర్తిచేసి భూమి హద్దులకు గ్యారంటీ ఇవ్వవచ్చు. ఈ విధానంలో టైటిల్ గ్యారంటీ ఇవ్వవచ్చునని కేంద్రం నియమించిన కమిటీ సూచించింది. ఇలా చేయడమే దేశానికి ఉత్తమమార్గమని చెప్పింది. ఈ ప్రకారం ధరణిలో ఉన్న వివరాలకు గ్యారంటీ ఇచ్చి, ఆ తర్వాత భూముల సర్వేచేసి, భూమి హద్దులకు గ్యారంటీ ఇస్తారు.

ఎలాంటి వ్యవస్థ వచ్చినా సిబ్బందికి సరైన తర్ఫీదు, వారి పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తా యి. చివరగా.. రైతాంగానికి వారి భూమి హక్కులకు పూర్తి హామీఇచ్చే క్రమంలో తెలంగాణ రాష్ట్రం మూడు మెట్లను ఒకేసారి ఎక్కే ప్రయత్నం చేస్తున్నది. ఆచితూచి బలమైన అడుగులు వేస్తేనే రైతాంగానికి తగిన న్యాయం జరుగుతుంది. టైటిల్ గ్యారంటీ చట్టంతో గ్రామాలలో, పట్టణాలలో, ఇంటి స్థలాలకు.. ఇలా అన్నిరకాల భూములకు చట్టబద్ధంగా హక్కుల హామీ లభిస్తుంది. టైటిల్ గ్యారంటీ ఉంది కాబట్టి పరిష్కారంకాని ఇనాం, టెనెన్సీ, భూదాన్, సర్ఫేఖాజ్, సీలింగ్ మిగులు, ఆసైన్డ్ భూముల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. టైటిల్ గ్యారంటీతో ప్రభుత్వ భూములకు గ్యారంటీ వస్తుంది. ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉందని ప్రభుత్వ భూములను కబ్జా చేయలేరు.

2493
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles