దీర్ఘకాలిక వ్యూహం అవసరం

Tue,February 19, 2019 01:04 AM

దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల దాడి తర్వాత దేశంలో ప్రతీకార జ్వాల రగులుకొంటున్నది. రాజకీయపార్టీల తీరుతో అది సోషల్ మీడియా నుంచి వీధిలోకి వచ్చి ప్రతీకారాన్ని రెచ్చగొడుతున్నది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ మొదలు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. అతివాద జాతీయవాదం దాడులతో అనేక అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పుల్వామా దాడి జరిగిందన్న వార్తలు వెలువడిన మరుసటిరోజు ఉదయం నుంచి దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు జరుగుతున్నాయి. అనేక చోట్ల కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరిగాయి. డెహ్రాడూన్‌లో బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఓ మహిళా హాస్టల్‌పై దాడికి దిగారు. అనేకమంది విద్యార్థినులను నిర్బంధించి భయబ్రాంతులకు గురిచేశారు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లాంటి కశ్మీర్ నేతలు కశ్మీరీ యువత, విద్యార్థులు తగు జాగ్రత్తలతో మెలగాలని సూచించాల్సి వచ్చింది. పుల్వామా దాడి తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవటమే గాక, పుల్వామా దాడికి కారకులైన ఉగ్రవాదులకు తగు గుణపాఠం చెప్పాలనే డిమాండు ఊపందుకున్నది. మరోవైపు పెరుగుతున్న ఉద్రిక్తతలను అదుపులో పెట్టేందుకు అధికారులు జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఫిబ్రవరి 14 పుల్వామా దాడిలో నలభై మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోవటం పట్ల పార్టీలకతీతంగా ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని, ఈ విషయంలో కేంద్రానికి అన్నివిధాలా మద్దతుగా నిలుస్తామని పార్టీలు అంటున్నాయి.

నిజానికి ఉగ్రవాద దాడికి సమాధానంగా రాజకీయ, సైనిక, దౌత్యపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ టీవీ, మీడియాలో వ్యక్తమవుతున్న ప్రతీకారేచ్ఛ సత్ఫలితాలను ఇవ్వదు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవానుల అమరత్వం ప్రతీకారాన్ని మాత్రమే కోరదు. అలాగే ఇదొక సామాజిక సమస్యగా మారటం కూడా ఆహ్వానించదగిన పరిణామం కూడా కాదు. దీనిపై జాతి యావత్తూ తగురీతిగా ప్రతిస్పందిస్తూ ఉగ్రవాదుల దాడుల నిరోధానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పుల్వామా దాడి జరిగిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూనే, వారికి తగినవిధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ ప్రకటనతో ప్రజల ప్రతిస్పందనలో తీవ్రమైన మార్పునకు కారణంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత, టీవీ సెలబ్రిటీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యల పట్ల స్పందనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సిద్ధూ టీవీ షో తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఎవరో కొందరు ముష్కరులు చేసిన దాడికి మొత్తం దేశాన్ని బాధ్యతగా చేయటం సరికాదు. ఉగ్రవాదానికి మతం, కులం లేదు. మతంలో మంచి, చెడూ వికృతాలున్నాయి. ప్రతి వ్యవస్థ ఇది కలిగి ఉన్నది. అలాగే ప్రతి దేశం కూడా. వికృతానికి పాల్పడే వారిని శిక్షించాల్సిందే. కానీ ఉగ్రవాద దాడులకు ఎవరో ఒకరిని వ్యక్తిగతంగా బాధ్యులుగా చేసి చెప్పటం అలాంటి చర్యను తప్పుదోవ పట్టించటమే..అని తెలిపారు. అంతటితో ఆగకుండా పాకిస్థాన్‌తో చర్చలు కొనసాగించాలని కోరారు. అలాగే.. ఎక్కడైనా, ఎప్పుడైనా యుద్ధం జరుగుతున్నప్పుడు, చర్చలు కూడా సమాంతరంగా జరుగుతుంటాయి.

ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యల గురించి ఆలోచించాలి. ఉగ్రవాదులకు కులం, మతం, దేశం లేదు. పాము కరిస్తే, దానికి విరుగుడుగా పాము విషాన్నే నివారణ ఔషధంగా ఇస్తారు. ఈ మాటలు ఉగ్రవాద దాడుల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వ్యక్తమవటం అనేది ప్రపంచంలో ఎక్కడైనా సాధారణంగా జరుగుతుంది. కానీ సిద్ధూ మాటలతో సామాజిక మాధ్యమాల్లో మూక దాడి రూపంలో దాడికి దిగటం, నిందించటం సమంజసం కాదు. అలాగే సిద్ధూ భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడి సందర్భంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. జవాన్లను వారి క్యాంపులకు తరలించేటప్పుడు రోడ్డుమార్గం ద్వారానే ఎందుకు తరలించాలి? వారికి విమానాలను ఉపయోగించవచ్చు కదా అని ప్రశ్నించారు. ఉగ్రవాదుల దాడిలో నిఘా విభాగం వైఫల్యం కూడా కానవస్తున్నది. కానీ మీడియా అంతా వీటినేమీ పట్టించుకోకపోవటం గమనార్హం. సిద్ధూ మాటల పట్ల వ్యతిరేతను వ్యక్తం చేయాలనుకునే వారు.. ఏకంగా సిద్ధూను, కపిల్ శర్మ టీవీ షోను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత దూషణలు, మాటలతో దాడి చేశారు. ఇందులో బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్‌సింగ్ బగ్గా కూడా ఉండటం గమనార్హం. సిద్ధూ మాటల పట్ల వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని సోనీ టీవీ యాజమాన్యం ఆయనను వెంటనే టీవీ షో నుంచి తప్పించింది. సిద్ధూ స్థానంలో అర్చనా పూరణ్‌సింగ్‌ను షోలో కూర్చోబెట్టారు. ఆ విధంగా టీవీ యాజమాన్యం తగు న్యాయం చేశామని భావిస్తుండటం విశేషం. ఈ ఉదంతం గురించి చెబుతూ.. సిద్ధూ మాటలు చాలామందికి రుచించకపోవచ్చు. అలాగే టీవీ ఛానెల్ కూడా అనవసర వివాదంలోకి లాగబడింది. దీంతో నిర్వహణాబృందం సమస్య పరిష్కారానికి సిద్ధూను తప్పించి మరో యాంకర్‌ను తీసుకొచ్చారు. అర్చనతో షోలు కూడా ప్రారంభమవుతున్నాయని చెప్పుకొచ్చింది.

పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో దేశంలో అనేకవిధాలుగా ప్రతిస్పందనలు ఉంటున్నాయి. సాధారణ ప్రజల స్పందనలు అటుంచితే సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్న వారు దాడి పట్ల తమ కృత్రిమ వ్యతిరేకతను వ్యక్తపర్చటం జోరుగా సాగుతున్నది. సోనూ నిగం అనే బాలీవుడ్ గాయకుడు తెచ్చిపెట్టుకున్న కోపంతో సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. తన వ్యంగ్యాన్నంతా కూడదీసుకొని.. లౌకికవాదులమని చెప్పుకుంటున్న వారికి దేశ భద్రత పట్టకపోవటం వింత అని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా చరిత్రలోంచి జాతీయవాద ఆకాంక్షలను గురించి వివాదమైన తీరును వివరించారు. ఈయన మాటలను బీజేపీ నేతలు ఎత్తిపట్టారు. నటుడు పరేశ్ రావల్ కూడా ఇదే తీరున స్పందించారు. మీడియా, టీవీ ఛానళ్లు పాకిస్థాన్, ఉగ్రవాద సానుభూతిపరులను టీవీ షోలకు పిలువవద్దని చెప్పుకొచ్చారు. అలాంటి వారు దేశంపై కక్కే విషాన్ని వినిపించవద్దని అన్నారు. ఉగ్రవాద మద్దతుదారులైన కుక్కలు, అవి తోడుకున్న బొందలోనే వాటిని చావనివ్వండని చెప్పారు. మాటల తీరు ఇలా సాగుతుండగానే దేశవ్యాప్తంగా జవాన్ల అమరత్వాన్ని కీర్తిస్తూ కొవ్వొత్తు ర్యాలీల సమాచారం మెస్సేజ్‌ల రూపంలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో అమర జవాన్లకు జోహార్లు అర్పించే కార్యక్రమం సాగుతున్నది. రాత్రి 6నుంచి 8గంటల మధ్య ఉత్తర భారతంలో అనేక పట్టణాలు, నగరాల్లో క్యాండిల్ ప్రదర్శనలు జరిగాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ కొవ్వొత్తులను పట్టుకుని పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు ఇస్తూ ప్రతీకారం తీర్చుకుంటామని నినదించారు.
Ajoy--ashirwad
దేశ రాజధాని ఢిల్లీ మొదలు నోయిడా, గోరేగాం, ఘజియాబాద్, ఫరిదాబాద్‌లలోని సినిమా హాళ్లు, మాల్స్‌లో తక్షణ స్పందనగా పెద్ద ఎత్తున సభలు, ప్రదర్శనలు జరిగాయి. వీటన్నింటికీ బీజేపీ నేతలు అగ్రభాగాన ఉండటం యాదృచ్ఛికం కాదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించటం గాకుండా, ఉగ్రవాద సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక వ్యూహంతో ఏం చేయాలో ఆలోచించాలి, ఆచరణలో పెట్టాలి. అంతే కానీ దురదృష్టకర, విషాదకరమైన ఘటనను రాజకీయాల కోసం వాడుకోవటం ఎవరు చేసినా తీవ్రంగా గర్హించవలసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న క్యాండిల్ ర్యాలీ సందర్భంగా ఓ దిగువ మధ్యతరగతి వాడలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ గమనించదగింది. ఒక వ్యక్తి.. మీరు క్యాండిల్ ర్యాలీలో పాల్గొనలేదు ఎందుకు? అని అడిగితే.., ఇప్పుడు ఉగ్రవాద దాడి పేరుతో రాజకీయం నడుస్తున్నది. అందుకే పాల్గొనలేదని జవాబిచ్చారు. అలా ఎందుకంటున్నారూ.. అంటే, మోదీ ఏం కావాలని కోరుకుంటున్నారో అదే జరుగుతున్నది. అదే నాకు అనిపిస్తున్నది.. అని మన రాజకీయ నేతల తీరునూ, వ్యవహారాన్ని చెప్పకనే చెప్పారు!
(ది వైర్ సౌజన్యంతో..)

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles