పల్లెలకు పూర్వ వైభవం


Tue,January 15, 2019 01:02 AM

గ్రామాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుకానిదే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి అర్థం ఉండదన్నారు మహాత్మా గాంధీ. దేశ భవిష్యత్తు గ్రామీణ ఆర్థిక పురోగమనంపై ఆధారపడి ఉందని చాలా సందర్భాల్లో ఉటంకించారు. దేశంలో పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చి అరువై ఏండ్లు అవుతున్నా.. బాపు కలలుగన్న గ్రామ స్వరాజ్యం వైపు సమైక్య రాష్ట్రంలో అడుగులు పడలేదు. కానీ ఎన్నో వినూత్న, విప్లవాత్మక పథకాలకు అంకురార్పరణ చేసి యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వంకుట్ల చంద్రశేఖర్‌రావు మహాత్మా గాంధీ ఆశయాలకు ఊపిరిపోయడమే కాదు, గ్రామ స్వరాజ్య సాధన దిశగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బల్వం తరాయ్ మెహతా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొట్టమొదట రాజస్థాన్ రాష్ట్రంలోని నౌగర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2న ప్రవేశపెట్టారు. ఆ తదుపరి పంచాయతీరాజ్ వ్యవస్థను అమలుచేసిన రెండవ రాష్ట్రం మన సమైక్య ఆంధ్రప్రదేశ్. 1959 నవంబర్1న నాటి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో అమలుకు శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చి సుమారు అరువై ఏండ్లు అవుతున్నది. ఈ కాలగమనంలో పల్లె ప్రజల జీవన పరిస్థితులు మార్చేందుకు, పంచాయతీలను ఆర్థిక పరిపుష్టి చేసేందుకు, గ్రామ స్వరాజ్యం స్థాపించేందుకు వేసిన ఎన్నో కమిటీలు అనేక సూచనలు చేశాయి. ఆ మేరకు పలు చట్టాలు చేశారే తప్ప ఆచరణలో సదరు కమిటీల సూచనలను అమలు చేయలేకపోయారు. దీంతో పల్లె స్వరూపం మారకపోగా గ్రామాలు, పం చాయతీ వ్యవస్థలు నిర్వీర్యమవుతూ వచ్చాయి. కానీ ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టి యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తాను అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై దృష్టిపెట్టారు.

పల్లె ప్రజల కష్టాలు దూరం చేయడానికి, ఒక్కమాటలో చెప్పాలంటే సకల సమస్యలు తొలిగి పోవడానికి ప్రణాళికలు రచించారు. పథకాలు రూపొందించారు. పల్లె వృత్తులకు తిరిగి ప్రాణం పోయడానికి నీరే ప్రధాన వనరు అని గుర్తించిన కేసీఆర్ ఇందుకోసం మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టులను నిర్మాణంచేస్తూ వివిధ లిప్టుల ద్వారా చెరువులను నింపేందుకు చేసిన ప్రణాళిక లు ఇప్పటికే సత్ఫలితాలిస్తున్నాయి. ఇదే తరుణంలో నీలి విప్లవాన్ని తీసుకొచ్చి ఆ వృత్తిపై ఆధారపడిన వారిని అర్థికంగా బలోపేతం చేస్తున్నారు. గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలను ఇచ్చి వారికి ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. వ్యవసాయరంగానికి ఊతమిచ్చి అన్నదాతలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు వినూత్న అలోచనలతో ముందుకుసాగుతున్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు యావత్తు దేశాన్నే కాదు, ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు. ఇదే కోణంలో పంచాయతీలను పరిపుష్టి చేసేందుకు ప్రణాళికాబద్ధమైన కార్యచరణతో ముందుకు సాగుతున్నారు. 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ పంచాయతీ వ్యవస్థలో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నది. ఇందులో భాగంగానే పంచాయతీరాజ్ వ్యవస్థకు బలమైన పునాదులు వేసేందుకు, నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చింది. నిజానికి 1959లోనే పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చినా 1993-94 వరకు వాటికి రాజ్యంగ పరంగా గుర్తింపు లేకుండాపోయింది. పంచాయతీలకు నిర్దిష్ట గడువులో పు ఎన్నికలు నిర్వహించకపోగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుత్తాధిపత్యం చెలాయించాయి. ఎన్నో ప్రతిబంధకాలు సృష్టించి స్థానిక సంస్థల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నాలు చేశాయి. రాజీవ్‌గాంధీ హయాంలో 1989లో 64వ రాజ్యంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేక వీగిపోయింది.

తిరిగి 1990 జూన్‌లో నాటి ప్రధాని వీపీ సింగ్ ఆధ్వర్యం లో నాటి కేంద్ర క్యాబినెట్ 73వ రాజ్యంగ సవరణ బిల్లును సెప్టెంబర్ 1990లో లోక్‌సభకు సమర్పించినా నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బిల్లు ఆమోదం పొందలేదు. 1991 జూన్‌లో పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యంగ ప్రతిపత్తిని కల్పించే లక్ష్యం తో 1991 సెప్టెంబర్‌లో ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు మెజార్టీ రాష్ర్టాలు తమ ఆమోదాన్ని తెలుపడం తో 1992లో 73వ రాజ్యంగ సవరణ జరుగగా 1994 ఏప్రిల్ 1 నుంచి 73వ రాజ్యంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా 1994 వరకు నాటి సమైక్య రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1964, మండల పరిషత్, జిల్లా పరిషత్తు, జిల్లా ప్రణాళిక, సమీక్ష మండలాల చట్టం-1986, స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల చట్టం-1989 ఈ మూడు చట్టాల స్థానంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం1994ను అమల్లోకి తెచ్చారు. అయితే రాజ్యాంగపరం గా గుర్తింపు లభించినా పంచాయతీలను పరిపుష్టం చేయడం, ఆర్థికంగా చేయూతనివ్వడం, రాజ్యంగపరంగా సంక్రమించిన హక్కులను పంచాయతీలకు కట్టబెట్టడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవం పోయడం వంటి అనేక అంశాల్లో నాటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. 73వ రాజ్యంగ సవరణ ద్వారా 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చి నా పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12,751 గ్రామాలుండగా ఇందులో 12,732 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నా యి. తెలంగాణ సర్కార్ తెచ్చిన కొత్త చట్టం ప్రకారమే ప్రస్తుతం ఏర్పడబోయే కొత్త పాలక వర్గాలు నడుచుకోవాల్సి ఉంటుంది.

కొత్త చట్టంలో పంచాయతీ వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు అనేక అధికారాలను కట్టబెట్టడమేకాదు, బాధ్యతలను విస్మరించిన వారిపై చర్యలు తీసుకునే విధం గా చట్టం రూపొందించారు. ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న పంచాయతీ పాలకవర్గానికి పూర్తి అధికారాలను ఈ కొత్త చట్టం కట్టబెట్టింది. సర్పంచ్‌కు పూర్తి కార్యనిర్వహణ అధికారాలను ఇవ్వడమేకాదు, సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటుగా పంచాయతీ పాలకవర్గ సభ్యులు కూడా ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యతను చట్టంలో పొందుపరిచారు. సర్పంచ్ ప్రతి నెల పాలకవర్గ సమావేశం ఏర్పాటుచేయాలి. పంచాయతీ విస్తరణాధికారి ప్రతి మూడు నెలలకోసారి ప్రతి పంచాయతీని, జిల్లా పంచాయతీ అధికారి ప్రతి నెలలో కనీసం ఐదు పంచాయతీలను విధిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి పంచాయతీలోనూ నాలుగురకాల స్టాడింగ్ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పారిశుధ్యం, డంపింగ్‌యార్డ్, వీధి దీపాల నిర్వహ ణ, మొక్కలు నాటడం వంటి అంశాలపై ఈ స్టాండింగ్ కమిటీలు పనిచేస్తాయి. లే ఔట్, భవన నిర్మాణ అనుమతులకు కూడా ఒక నిర్దిష్ట కాలాన్ని కొత్త చట్టం విధించింది. ఆర్థిక సంఘం నిధులతో పాటుగా పంచాయతీలకు బడ్జెట్‌లోనే నిధులు కేటాయించే విషయాన్ని కొత్త చట్టంలో పేర్కొన్నది. కొత్త చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ప్రతి పంచాయతీకి కనీసం రూ.5 లక్షలు ఏటా రాష్ట్ర బడ్జెట్ నుంచి అందే అవకాశం ఏర్పడనుంది. అంతేకాదు ఏడాదిలో రెండు సభలు మహిళలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి సంబంధించి నిర్వహించాలి. అలాగే వరుసగా మూడు సార్లు గ్రామసభ నిర్వహించకపోతే సర్పంచ్‌ను విధుల నుంచి తొలిగించేలా చట్టంలో పొందుపరిచారు. గ్రామసభ నిర్వహణను వీడియో, ఫొటోలు తీసి సమర్పించాలని చట్టంలో పేర్కొన్నారు.
k-prakash-rao
అలాగే ప్రస్తుతం కొత్తగా ఎన్నికైనా సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఫిబ్రవరిలోనే కొత్త పంచాయతీరాజ్ చట్టం, పాలన, ప్రజలకు అందించాల్సిన సేవలపై శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ నిశిత పరిశీలన చేసి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారు. కొత్త పాలవకర్గాలు నూతన చట్టం ప్రకారం బాధ్యతాయుతంగా పనిచేస్తే పంచాయతీలకు కొత్త జవసత్వాలు వస్తాయి. పల్లెలు పరిశుభ్రతతో పాటుగా పచ్చదనంతో కళకళలాడుతాయి.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ, కరీంనగర్ ప్రధాన ప్రతినిధి)

629
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles