MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
5/28/2015 5:01:10 AM

జయజయహే.. వడ్డేపల్లి

fiogf49gjkf0d
సినిమా పాట రాయాలంటే కొంత సాహిత్యభిరుచి ఉంటే చాలు అనుకునే రోజులివి. కానీ, గతంలో సినిమా పాటకి కూడా పాండిత్యమూ, వ్యాకరణమూ, అన్నింటికి మించి భావప్రకటనకు అవసరమైన భాషపైన సాధికారమూ ఉండేది. తెలుగు సినిమా పాటలను తొలితరంలో పింగళి, సీనియర్ సముద్రాల, సదాశివబ్రహ్మం వంటి ప్రముఖులు రాణిస్తే.. రెండో తరంలో ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ, సినారె వంటి మహాకవులు సినిమా పాటకు పట్టం కట్టారు. ఆ తర్వాత వచ్చిన వారిలో వేటూరి ప్రసిద్ధులు. ఆ సమయంలోనే.. అంటే మూడో తరంలో వచ్చిన గేయ రచయితల్లో డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ ఒకరు.

సాహిత్యాభిరుచి..
భావాన్ని పాట చట్రంలో బిగించడం బాగా తెలిసినవాడు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ. సి.నారాయణరెడ్డి స్ఫూర్తితో నాలుగు దశాబ్దాలకు పూర్వమే గేయ రచన చేశారు. బాలసుబ్రహ్మణ్యం మొదలుకుని.. సుశీల వంటివారు ఆయన రాసిన పాటలు పాడినవారే. పాటలు ప్రేక్షకుల మదిని దోచేలా ఉండాలనేదే వడ్డేపల్లి కృష్ణ తపన. ఎన్నో సినిమా పాటలు రాసిన వడ్డేపల్లి ప్రస్థానం వెనుక నిరంతర కృషి దాగి ఉంది. స్వస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, లింగయ్య. చేనేతపై జీవనాధారం. చిన్నప్పటి నుంచే వడ్డేపల్లి కృష్ణకు సాహిత్యాభిరుచి ఎక్కువ. తెలుగు మాస్టార్ చెప్పిన పద్యాలను ఎంతో ఆసక్తిగా వినేవాడు.. పాడేవాడు. ఇలా పద్యాలు, సాహిత్యం, చందస్సుపై పట్టు సాధించాడు. 1970 నుంచే రేడియోలో సినారె పాటలు ఎక్కువగా వినేవారు. ఆ పాటలు విని సినారెకు ఉత్తరాలు రాసేవాడు. దానికి బదులుగా సినారె నుంచి ఉత్తరాలు తిరిగి రావడంతో వడ్డేపల్లికి సాహిత్యం ఆసక్తి పెంచుకున్నాడు. 1969లో స్రవంతి, కృష్ణ వంటి పత్రికల్లో పద్యాలు, గేయాలతో పాటు కవికల్యాణం, గడ్డిపువ్వు, గాంధీ, మూడుపూలు, ఆరుకాయలు, సంక్రాంతి లక్ష్మి అనే కథలు రాశారు. 1971లో భారత్-పాక్ యుద్ధం జరిగినప్పుడు దేశప్రేమను చాటుతూ.. కన్నారా నీదేశం.. వినరా నీ సందేశం అనే పాట రాసి ఎంతోమంది దృష్టిని ఆకర్షించాడు.

పాటల ప్రస్థానం..
సాహిత్యం, పద్యాలపై మంచి పట్టు ఉండడంతో కృష్ణ సినిమాలపై దృష్టి సారించారు. మొదటి ప్రయత్నంలోనే అక్కినేని నాగేశ్వర్‌రావు నటించిన పిల్లజమీందార్ సినిమాలో నీచూపులోన.. విరజాజివాన డ్యూయెట్ పాట రాసి సినిమా పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత అలనాటి అగ్రతార బాణుమతి నటించిన అమృత కలషంలో సిగ్గాయే.. సిగ్గాయేలా.. స్వామి.. బుగ్గంత. ఎరుపాయేలా.. అనే పాటతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. ఆ సమయంలోనే మహాకవులైన దాశరథి, సినారెల అభిమానం చూరగొన్నాడు వడ్డేపల్లి. సీనియర్ నిర్మాత రాఘవ సినిమా (యుగకర్తలు)కు తాగినోడి మాట..తందనాల వేదమట. న్యాయమున్నా.. ధర్మమున్నా..నరకమున్నా.. బతుకు బాట అనే పాట రాశాడు. ఆ తర్వాత వడ్డేపల్లి కృష్ణ ప్రతిభను గుర్తించిన భారీ చిత్రాల నిర్మాత ఏఎం.రత్నం పెద్దరికం సినిమాలో ఓ పాట రాసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో హీరోయిన్ పేరు జానకీ కావడంతో ఆమె పేరు మీద ముద్దుల జానకీ..పెళ్లికీ.. మబ్బుల పల్లకీ తెవలనే, ఆశల రెక్కల హంసలు పల్లకీ మోసుకుపోవలనే సందర్భానుసారంగా పెళ్లి పాట రాశాడు.

1992లో బాలకృష్ణ నటించిన హిట్‌మూవీ భైరవద్వీపంలో అంభా..శాంభవి అనే పాటతో తెలుగు సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆకాశ్ నటించిన పిలిస్తే పలుకుతా సినిమాకు సమత మమతల సాకారాం.. పిలిచిన పలికే ఓంకారం అనే పాట రాసి సాయి భక్తులను ఆకట్టుకున్నారు. తెలుగు సినిమాపై ఆసక్తితో ఓ సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. సాయికుమార్ హీరోగా ఎక్కడికెళ్తుందో మనస్సు (క్యాప్షన్ -ప్రేమకే తెలుసు) అనే సినిమాకు దర్శకత్వం వహించారు కృష్ణ. ఆ సమయంలో థియేటర్స్ దొరక్కపోవడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. అంతరించిపోతున్న గోవులపై గోభాగ్యం అనే డాక్యుమెంటరీ తీసి ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిల్మిం ఫెస్టివల్‌లో అవార్డులు అందుకున్నారు. బతుకమ్మ, ఆత్మహత్య నేతన్నలు వంటి డాక్యుమెంటరీలకు జాతీయస్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు.

బుల్లితెరపై సైతం..
వెండితెర మీదే కాకుండా బుల్లితెరపై ఆయన ముద్ర వేశారు. భక్త కవి పోతన, భారతీయ సంస్కృతీ శిఖరాలు సీరియల్స్‌ను డైరెక్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇవేకాకుండా కరీంనగర్ క్షేత్రాలు ఆడియో సీడీ తీసుకువచ్చారు. ఆయన సేవలను గుర్తించిన ఆలయ కమిటీ ప్రముఖ నటి జమున చేతుల మీదుగా గేయకిరిటీ బిరుదు అందజేశారు. తానా సభలకు సంగీత నృత్యరూపకాలు అందించడంతో లలితశ్రీ, కవనప్రజ్ఞ బిరుదులతో సత్కరించాయి.

లలిత గీతాలపై పరిశోధన
వడ్డేపల్లి కృష్ణ లలితగీతం, లక్షణం, నిర్వచనం నిర్దేశిస్తూ లలిత గీతాలపై మొట్టమొదటిసారిగా ప్రామాణిక పరిశోధన చేశారు. 1995 సెప్టెంబర్‌లో ఆయన లలిత గీతాలు (మనమంతా ఒక్కటనీ.. మంచి మనసు పెరగాలి, జగమంత ఒక్కటనీ.. జన జాగృతి కావాలి) ఆలిండియా రేడియో ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాధారణ పొందాయి. తెలంగాణపై అభిమానంతో తెలంగాణ భాష, యాసతో వెలుగచ్చింది నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయంలో మొదటి అవార్డు అందుకుంది. రచయితగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్‌గా, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్‌గా, పాడుతాతీయగా పాటల కార్యక్రమానికి జడ్జిగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు.

తెలంగాణ యాస.. భాష
తెలంగాణ గడ్డ, భాష, యాస అన్నా వడ్డేపల్లి కృష్ణ ఎంతగానో ఇష్టం. ఆరవై ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని అరవై నిమిషాల్లో జయజయహే తెలంగాణ సంగీత నృత్యరూపకం రచించాడు. కొమురంభీం, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, ఫ్రొఫెసర్ జయశంకర్ వంటి ఉద్యమకారుల జీవితాలను కళ్లకు కట్టినట్టుగా రూపకల్పన చేశారు. రవీంద్రభారతిలో ప్రదర్శించిన ఈ నృత్యరూపకాన్ని తిలకించిన స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ సలహాదారుడు కేవీ.రమణాచారి వడ్డేపల్లి కృష్ణను మెచ్చుకున్నారు. ఈ నృత్యరూపకం తెలంగాణ అంతటా ప్రదర్శించేందుకు ప్రోత్సాహం అందించారు. ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని జూన్ 2న మంచిర్యాల, 3న కరీంనగర్, 4న వరంగల్‌లో ప్రదర్శితం కానుంది.
- జిందగీడెస్క్
1824
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd