WEDNESDAY,    December 19, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Rangareddy News
11/25/2015 12:47:02 AM
మహిమాన్వితు బుగ్గ రామలింగేశ్వరుడు
-పూజలందుకుంటున్న పరమేశ్వరుడు
-నేటి నుంచి బుగ్గ జాతర
-పదిహేను రోజులు కొనసాగనున్న ఉత్సవాలు
-సర్వం సిద్ధం చేసిన ఆలయ కమిటీ
మంచాల:మహిమాన్వితమైన బుగ్గ రామలింగేశ్వరుడికి కోరిన కోర్కెలు తీర్చు ఇలవేల్పుగా పేరుంది. నిరంతరం పారే సెలయేటి చెంతన వెలసిన స్వయంభూ లింగేశ్వరుడిని భక్తులు శ్రద్ధతో కొలుస్తారు. పవిత్రమైన బుగ్గ జలాలలో పుణ్య స్నానాలు ఆచరించి, మొక్కులు తీర్చుకుంటారు. కొండ కోనలు, ఆకట్టుకునే అటవీ అందాల మధ్యన కొలువైన బుగ్గక్షేత్రంలో శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి పదిహేను రోజులు జాతర జరుగుతుంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరిలివస్తారు. మంచాల మండలంలోని ఆరుట్ల సమీపంలో వెలసిన ఈ క్షేత్రంలో నేటి నుంచి జాతర ప్రారంభమవనుంది.

మంచాల మండలంలోని ఆరుట్ల సమీపంలోగల బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర కార్తీక పౌర్ణమి సందర్భంగా నేటి నుంచి ప్రారంభమై డిసెంబర్ 11 వరకు కొనసాగనుంది. కార్తిక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు సుమారు పదిహేను రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

పరమ పవిత్రమైన క్షేత్రం
ఇక్కడ వెలిసిన రామలింగేశ్వర స్వామికి ఎంతో పవిత్రత ఉంది. అరణ్యవాసంలో ఉన్న రాముడికి శివుడు ప్రత్యక్షమైన చోటు కాబట్టే ఇక్కడ స్వావి రామలింగేశ్వరుడిగా వెలిసాడని ప్రతీతి. పవిత్రమైన సెలయేటి చెంతన వెలసినందున బుగ్గ రామలింగేశ్వరుడిగా పేరొచ్చింది. అడవిలో పుట్టే ఈ ప్రవాహం శివుడిని అభిషేకించడానికే పుట్టిందా అన్నట్లు తూర్పు నుంచి పడమరకు ప్రవహించి తిరిగి అడవిలో ప్రవేశించి అదృశ్యమవుతుంది. కార్తిక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఇక్కడ ప్రవహించే నీటిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సకల పాపాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులు స్వామి చెంతన కార్తీకమాసం వ్రతాలు ఆచరిస్తారు. కాశీకి వెళ్లలేనివారు కార్తిక పౌర్ణమి నాడు ఇక్కడ రామలింగేశ్వరుడిని దర్శించుకుంటే కాశీకి వెళ్లి వచ్చిన ఫలం దక్కుతుందని విశ్వసిస్తారు.

భక్త జన కోటి సందోహం
భక్తుల కొంగు బంగారంగా వెలిసిన బుగ్గరామలింగేశ్వరస్వామిని దర్శించుకోవటానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడే వంట చేసుకుని వనభోజనాలు చేస్తారు. ఆలయం చుట్టూ ఉన్న అలరించే అటవీ ప్రాంతం పదిహేను రోజుల పాటు భక్తులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా ఆదివారం, సెలవు దినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కొండలు, కోనలు, సెలయేర్లతో ప్రకృతి అందాలు ఆస్వాధిస్తారు.

నాగన్నపుట్ట.. కబీర్‌దాస్ మందిరం
బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయానికి చెంతనే గుట్టపై కబీర్‌దాస్ మందిరం ఉంది. కాశీలో ఉపదేశం పొందిన నర్సింహ బాబా అనే సాధువు 1975లో ఇక్కడ కబీర్‌దాస్ మందిరాన్ని నిర్మించారు. ఆలయానికి వచ్చే భక్తులంతా పక్కనే ఉన్న కబీర్‌దాస్ మందిరాన్ని దర్శించుకోవటం ఆనవాయితీ. ఈ ఆలయంలోనే నాగన్నపుట్ట, శివపార్వతుల సన్నిధి ఉంది. కార్తీకమాసం సందర్భంగా నాగన్నపుట్టకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కార్తీకమాసంలో పుట్టలో నుంచి నాగరాజు బయటికి వచ్చి కనిపిస్తాడని ప్రజల నమ్మకం. ఈ మందిరంలోనే చాలా కాలంపాటు ధ్యానం చేసిన నర్సింహబాబా ఇక్కడే సజీవంగా సమాధి అయినట్లు చెబుతారు.

కార్తీకమాస వ్రతాలకు ప్రతీతి
కార్తీక మాసంలో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో వ్రతాలు చేస్తే అనుకున్న కోర్కెలు తీరుతాయని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. కార్తీక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు వందలాది మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. కోరిన కోర్కెలు తీరితే వ్రతాలు నిర్వహిస్తామని భక్తులు మొక్కుకుంటారు. తమ కోరికలు తీరిన తరువాత వ్రతాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. వందల సంఖ్యలో తరలివచ్చే భక్తులు పదిహేను రోజుల పాటు ఆలయప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు.

ఏర్పాట్లు పూర్తి
పదిహేను రోజుల పాటు జరుగనున్న బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధిక నిధులు తీసుకువచ్చి బుగ్గరామలింగేశ్వర ఆలయం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేశారు. ఈ సంవత్సరం జాతరకు మూడురోజుల ముందే ఏర్పాట్లను పూర్తిచేశారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి రూ.88 లక్షలతో ఆరుట్ల నుంచి దేవాలయం వరకు బీటీరోడ్డు, రూ.1.50లక్షలతో సీసీరోడ్డు, రూ.5లక్షలతో భక్తులకు విశ్రాంతి షెడ్ నిర్మాణాన్ని పూర్తిచేయించారు. ప్రత్యేక విద్యుత్‌దీపాల అలంకరణ కోసం స్తంభాలను సైతం ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి జాతర ప్రారంభం కానుండటంతో జాతర కోసం వివిధ దుకాణాలు కూడా ఏర్పాటు అయ్యాయి. నిర్వాహకులు మొదటి రోజు ఇక్కడికి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ప్రారంభోత్సవానికి మంత్రుల రాక
మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వర జాతర ప్రారంభోత్సవాలకు దేవదాయ, రవాణా శాఖ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి హాజరవుతారని ఎంపీపీ గుండ్లమోని జయమ్మ, ఎంపీడీవో నాగమణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ఆరుట్ల నుంచి ఆలయం వరకు బీటీ రోడ్డు, విశ్రాంతి గదులను వారు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఆలయానికి చేరుకునే మార్గం
మంచాల మండలంలోని ఆరుట్లకు ఐదు కిలోమీటర్ల దూరంలో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే సాగర్ రింగ్‌రోడ్డు నుంచి 277 నెంబర్ బస్సుల ద్వారా ఇబ్రహీంపట్నం చేరుకుని అక్కడి నుంచి పదిహేను రోజుల వరకు బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం వరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. అలాగే ఇబ్రహీంపట్నం నుంచి ఆరుట్లకు చేరుకుంటే అక్కడి నుంచి ఆటోలు, ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. నల్గొండ జిల్లా నారాయణపూర్, మునుగోడు, చౌటుప్పల్ నుంచి వచ్చేవారు నారాయణపూర్ నుంచి ఆరుట్లకు బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ నుంచి వచ్చేవారు ఇబ్రహీంపట్నం నుంచి ఆరుట్లకు వెళ్లే బస్సులో బుగ్గజాతరకు చేరుకోవచ్చు.
691
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd