THURSDAY,    December 13, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Rangareddy News
1/14/2018 12:09:34 AM
మరో మూడు నైట్ షెల్టర్లు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:శనివారం మూడు వైద్యశాలల్లో నైట్ షెల్టర్లు అందుబాటులోకి రాగా, త్వరలో మరో మూడు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. దీంతో నగరంలోని ప్రధాన ధర్మాసుపత్రులకు రోగుల వెంట వచ్చే సహాయకులు ఆశ్రయం కోసం పడే కష్టాలు తీరిపోనున్నాయి. సాధ్యమైనంత తొందరలోనే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ముమ్మరంగా పనులు కొనసాగిస్తున్నది. నగరంలోని ఉస్మానియా, కోఠి మెటర్నిటీ, నీలోఫర్, నిమ్స్, ఫీవర్, మహావీర్ తదితర ఆరు వైద్యశాలల్లో ఏడాది కిందట జీహెచ్‌ఎంసీ సుమారు రూ. 12 కోట్ల వ్యయంతో నైట్ షెల్టర్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో నీలోఫర్, కోఠి, మహావీర్ వైద్యశాల్లోని షెల్టర్లను శనివారం ప్రారంభించారు. కాగా, మిగిలిన ప్రాంతాల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉస్మానియా వైద్యశాలలో పనులు దాదాపు తదిదశకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగుల వెంట వచ్చే సహాయకులు వీటిల్లో ఆశ్రయం పొందేందుకు వీలు కలుగుతుంది. మంచినీరు, విద్యుత్, టాయిలెట్లు, మంచాలు తదితర కనీస సౌకర్యాలు ఈ షెల్టర్లలో సమకూర్చుతున్నారు. ముందుగా ఉస్మానియాలో షెల్టర్ అందుబాటులోకి వస్తుందని, అక్కడ పనులు తుదిదశకు చేరుకున్నాయని ఓ అధికారి తెలిపారు. అనంతరం మిగిలిన రెండింటిని అందుబాటులోకి తెస్తామన్నారు.

పేదలకు ఉపశమనం.....
ధర్మాసుపత్రులుగా పేరొందిన ఈ వైద్యశాలలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. అయితే రోగులవెంట వచ్చే సహాయకులకు ఆశ్రయం లేకపోవడం, లాడ్జిల్లో ఉండే స్తోమత లేకపోవడంతో వైద్యశాల ఆవరణంలోనే, ఫుట్‌పాత్‌లపైనో కాలం వెళ్లదీస్తున్నారు. వారి కష్టాలను గుర్తించి జీహెచ్‌ఎంసీ ఏడు ధర్మాసుపత్రుల్లో షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించింది. కాగా, గాంధీ వైద్యశాలలో అనివార్య కారణాలవల్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

ఇప్పటికే కొనసాగుతున్న 12 షెల్టర్లు...
వివిధ పనుల కోసం నగరానికి వచ్చేవారి కోసం జీహెచ్‌ఎంసీ 12 ప్రాంతాల్లో నైట్ షెల్టర్లను నిర్వహిస్తున్నది. గోల్నాక, ఎల్బీనగర్, బేగంపేట్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నామాలగుండు, కాప్రా, శేరిలింగంపల్లి, బైబిల్‌హౌస్ తదితర ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. ఇందులో ఎనిమిది పురుషులవి కాగా, నాలుగు మహిళలకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. వీటిల్లో సైతం ఆశ్రయం పొందేందుకు కనీస సౌకర్యాలను కల్పించడంతో పాటు నామమాత్ర రుసుముపై భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఒక్కో షెల్టర్‌లో కనీసం 20మంది నుంచి 40 మంది వరకూ ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా వైద్యశాలల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తుండడం విశేషం.
101
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd