TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Rangareddy News
1/31/2016 12:20:01 AM
ఆనందాల గని మృగవని
మనసుకు హాయిని గొలుపుతున్న పచ్చందాలు
పక్షుల కిలకిలరావాలు.. జింకల ఉరుకుల పరుగులు
జీవచరాల సందడి.. సర్పాల సయ్యాటలు
వెదజల్లుతున్న ఔషధ మొక్కల సువాసనలు
ప్రశాంత వాతావరణానికి నిలయం
చిలుకూరు మృగవని

మొయినాబాద్ : హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో... జంట జలాశయాల చెంతన... వీసాల దేవుడు చికూరు బాలాజీ పరిసరాల్లో... అనంతపద్మనాభుడి దర్శానికి వెళ్లే దారిలోనే ఉంది ప్రకృతి అందాలకు నెలవైన జాతీయ మృగవని పార్కు. కట్టిపడేసే అడవి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకులను ఆకర్శిస్తోంది. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు గ్రామ పరిధిలో 9 వందల ఎకరాల్లో ఈ రక్షిత అడవి విస్తరించి ఉంది.రక్షిత అడవిగా ఉన్న ఈ పార్కుకు 1998లో మృగవని జాతీయ వనంగా నామకరణం చేశారు. ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో అటవీ శాఖ అభివృద్ధి సంస్థ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ పార్కు జీవవైవిద్యానికి నిలయంగా మారింది. పార్కులోనే సందర్శకుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

కాలు మోపగానే ప్రశాంత వాతావరణం.. ఏపుగా పెరిగిన చెట్లు.. పక్షుల కిలకిలలు.. జింకల పరుగులు.. ఉడుతల ఉరుకులు.. ఉరిమే ఉడుములు.. కుందేళ్ల కితకితలు.. ఔషధ మొక్కల సువాసనలు.. హాయిని గొలిపే నీటి కుంటలు.. విద్యార్థుల విజ్ఞాన భాండాగారం. ఇదంతా మొయినాబాద్ మండలలోని చిలుకూరు మృగవని జాతీయ వనం గురించి. 900 ఎకరాల్లో సువిశాలంగా విస్తరించిన ఈ వనంలో వివిధ రకాల పక్షిజాతులు, జంతు జాతులు, వృక్ష జాతులు, ఔషధ మొక్కలు, వివిధ రకాల సర్పాలున్నాయి. ఇందులో ఐదొందల చుక్కల జింకలు, 40 వరకు సాంబరు దుప్పిలు, 200పైగా నెమళ్లు, 100 జాతులకు పైగా పక్షులు, పదుల సంఖ్యలో జీవచరాలు నెలవై ఉన్నాయి. జంతువులు నీళ్లు తాగడానికి పార్కులో అక్కడక్కడ నీటి తొట్లను ఏర్పాటు చేశారు. విశేషమేమంటే పార్కు మధ్యలో ఉన్న చెరువు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. కొన్ని చెట్లు, ఔషధ మొక్కలను గుర్తించేలా శాస్త్రీయ పేర్లతో వాటికి బోర్డులు తగిలించారు. అనంతుడి మార్గంలో.. వీసాలస్వామి చెంతనే ఉన్న ఈ వనానికి వారాంతంలో సందర్శకుల తాకిడి అధికంగా ఉంటోంది. చిలుకూరులోని జాతీయ మృగవని పార్కు గురించి ఈ వారం సండే స్పెషల్.అరుదైన జాతులకు నిలయం
మృగవని పార్కులో వివిధ రకాల పక్షుజాతులు, జంతుజాతులు, వృక్షజాతులు, ఔషధ మొక్కలు, వివిధ రకాల సర్పాలు ఉన్నాయి. ఐదు వందల చుక్కల జింకలు, 40 సాంబరు దుప్పిలు, రెండు వందలకు పైగా నెమళ్లు, 100 జాతులకు పైగా వివిధ రకాల పక్షులు, అరుదైన సర్పజాతులు ఉన్నాయి. ఉడుములు, కుందేళ్లు, పునుగు పిల్లులు, అడవిపందులు లెక్కలేనన్ని ఉన్నాయి. అంతేకాకుండా ఆరు వందల జాతుల చెట్లు, 100 జాతుల ఔషధ మొక్కలు ఉన్నాయి. పార్కులో పెద్ద చెరువు కూడా ఉంది. కొన్ని చెట్లను, ఔషధ మొక్కలను గుర్తించి వాటి పేర్లు సందర్శకులకు తెలియడానికి శాస్త్రీయ నామాలతో బోర్డులు ఏర్పాటు చేశారు.

ఆహ్లాదకరమైన వాతావరణం
జాతీయ మృగవని పార్కులో వాతావరణం ఆహ్లాదకరరంగా ఉంటుంది. హైదరాబాద్-బీజాపూర్ రహదారి పక్కన, ఔటర్ రింగురోడ్డును ఆనుకొని ఉంది. పార్కుకు ఇరువైపులా నగర ప్రజలకు తాగునీరందిస్తున్న గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ జలాశయాలు ఉన్నాయి. తెలంగాణ తిరుపతిగా, వీసాల దేవుడిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం పార్కుకు కూతవేటు దూరంలోనే ఉంటుంది. అంతేకాకుండా జిల్లాలో పర్యాటక కేంద్రంగా నిలిచిన అనంతగిరి అడవులకు వెళ్లే పర్యాటకులు ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. మొయినాబాద్‌లో పదుల సంఖ్యలో కళాశాలలు ఉండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పార్కును సందర్శిస్తారు.

సందర్శకులకు సఫారీరైడ్
పార్కులో వివిధ రకాలు పక్షుల జాతులు, జంతువులు, వివిధ రకాల చెట్లు, ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటిని సందర్శకులకు చూపించడానికి అధికారులు ప్రత్యేకంగా సఫారీ రైడ్ ఏర్పాటు చేశారు. సందర్శకులను ప్రత్యేకమైన బస్సులో పార్కులో తిప్పుతూ జంతువులు, పక్షులు, ఔషద మొక్కలను చూపిస్తారు. సపారీలో వెళ్లిన సందర్శకులు జింకల గంతులు, పక్షుల కిలకిలరాగాలు, పాముల సయ్యాటలు, నెమలుల నాట్యాలను తిలకిస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తారు. వనం మధ్యలో ఏర్పాటు చేసిన ఎత్తైన వాచ్‌టవర్‌ను ఎక్కితే అడవీ అందాలను చూడడానికి రెండు కళ్లు చాలవు.

సందర్శకులకు సౌకర్యాలు
ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం కేవలం నామమాత్రపు చార్జిలు వసూలు చేస్తుండడం విశేషం. పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లలో కూర్చొని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం,తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా కాటేజీలను ఏర్పాటు చేయడం విశేషం. ఇక్కడ ఏర్పాటు చేసిన పర్యావరణ విద్యాకేంద్రంలో విద్యార్థులకు పర్యావరణం, జీవవైవిద్యంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం విశేషం.

ప్రంపంచ దేశాల ప్రతినిధుల కితాబు
హైదరాబాద్ మహా నగరంలో 2012లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ జీవవైవిద్య సదస్సుకు హాజరైన సుమారు వందకుపైగా దేశాలకు ప్రతినిధులు మృగవని పార్కును సందర్శించి ముగ్ధులయ్యారు. ఇక్కడ ఉన్న చెట్లు, అరుదైన జాతుల ఔషధ మొక్కలు, వివిధ రకాల పక్షి, జంతు సంపదను చూసి అబ్బురపడ్డారు. తెలంగాణలో ఉన్న జీవవైవిద్యాన్ని తెలుసుకోవడానికి ఈ పార్కు ఒక్కచోటు సందర్శిస్తే చాలని వారు కొనియాడారు.

ప్రకృతి సంపదపై అవగాహన శిబిరాలు
పార్కులో వారానికోసారి ప్రకృతి సంపదపై అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు పర్యావరణం, వన్యప్రాణులు గురించి అవగాహన కల్పించుట కోసం వివిధ అంశాలపై బోధిస్తారు. ఇందు కోసం పార్కులో పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఉంది. అందులో 40 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఆడిటోరియం ఉంది. ఇక్కడ విద్యార్థులకు వీడియో ప్రదర్శణ ద్వారా రాష్ట్రంలోని పార్కులు, అభయారణ్యాలు, వన్యప్రాణులు, పర్యావరణ వైవిద్యంపై అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా వివిధ రకాల జంతువుల నమూనాలతో మ్యూజియం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వన్యప్రాణులు, పర్యావరణంపై విజ్ఞానం పొందడానికి ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేశారు.

641
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd