MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Nalgonda News
5/15/2015 5:00:46 AM
జానపదాలకు ప్రాణం పోసిన పొలిశెట్టి
- పాటల రచయితగా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి
- రాజీవ్, పివి, ఎన్టీఆర్‌పై పాటలు రాసిన కవి
- నేడు పొలిశెట్టి లింగయ్య వర్ధంతి
పల్లె సుద్దులు ఒడిసిపట్టి వాటిని ప్రపంచానికి పరిచయం చేసిన అక్షరకెరటం ఆయన... తన కలంతో ప్రాణం పోసుకున్న ప్రతి జానపదం ఓ ఆణిముత్యం... రచయితగా, గాయకుడిగా, కళాకారుడిగా తెలంగాణ మట్టిలో మాణిక్యం ఆయన. హృదయాలు కదిలించే సాహిత్యం అందరికీ తెలిసిందే. ఆయనొక పాటల పొలికేక. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఎందరో కళాకారులు తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన వారసత్వంలో అనేక మంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో గజ్జెకట్టి ఆడిపాడి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. నేడు మన మధ్యలేకపోయినా ఆయన పాటలు నేటికి జనం హృదయాలలో మోగుతూనే ఉన్నాయి. ఆయనే పాటల మాంత్రికుడు పొలిశెట్టి లింగయ్య.
- వేములపల్లి
పొలిశెట్టి లింగయ్య వేములపల్లి మండలం, సల్కునూరు గ్రామంలో 1970లో పొలిశెట్టి నారాయణ, లింగమ్మ, దంపతులకు జన్మించాడు. పేద కుటుంబంలో పుట్టడం వల్ల సమాజంలో రుగ్మతలపై అవగాహన పెంచుకున్నాడు. వాటిని రూపుమాపాలని నిర్ణయించుకొని పాటను ఆయుధంగా మలుచుకున్నాడు. 8వ తరగతి మధ్యలోనే చదువు మానేసి ప్రజానాట్యమండలిలో చేరి ప్రజా పాటలు ఆలకిస్తూ పల్లె సుద్దులను సృష్టించి పల్లె సుద్దుల బ్రహ్మగా పేరు తెచ్చుకొని ప్రజల పాటలు పేరుతో పుస్తకాన్ని వెలువరించాడు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ మరణానంతరం రాజీవ్‌కు జోహర్లు అనే పాటల క్యాసెట్‌ను 14భాషల్లో విడుదల చేయడం పొలిశెట్టికి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చింది. జాన పదాల్లో మరదలు పిల్లా బాలమ్మ బాగున్నవా- ఈ బావ నీకు యాదున్నడా అంటూ బావ మరదళ్ల మధ్య ఆటపట్టించే పాటలు, లవ్‌ర్యాప్, గజ్జెల గంగోళి, కోటమైసమ్మ, దండు మైసమ్మ పాటలు గీత ఆడియో రికార్డింగ్ ద్వారా సారంగపాణి, వరంగల్ శంకరన్నచే పాడించారు. సారా ఉద్యమంలో భాగంగా మరో దండోరా పేరుతో అబ్బబ్బ సారాయి పోతే పోయిందిరో అంటు ఉర్రూతలూగించాడు. క్రమేణా సినీరంగానికి చేరువై స్వర్ణక్క సినిమాలో ఆ నవ్వులేమాయేనే స్వర్ణక్క, ఆల్ రౌండర్‌లో అత్తరు సాయబు మంచోడమ్మ పిట్టలదొరలో గింత కూరుంటెయ్యమ్మో.. గింత బువ్వుంటేయమ్మో, 20వ శతాబ్దంలో అమ్మను మించి దైవమున్నడా ఆత్మను మించి అర్థమున్నదా, శ్రీదేవి నర్సింగ్ హోంలో అణా, బేడా, చారాణా, ఆఠాణా రేటు కాదు అన్న పాటలు ప్రజల గుండెల్లో నిలిచాయి.
పోలీసు అమరవీరులను స్మరిస్తూ రూపొందించిన శ్రద్ధాంజలి ఆల్బమ్ ఉన్నతాధికారుల ప్రశంశలు పొందింది. తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ వీర తెలంగాణ, పోరు తెలంగాణ, వచ్చెర తెలంగాణ లాంటి పాటలు కట్టాడు. సహజ కవి అయిన పొలిశెట్టి లింగయ్య 2012 మే15న ఆనారోగ్యంతో కన్నుమూశారు. పాటలతో సామాజిక స్ఫ్రుహ, స్ఫూర్తి నింపిన పొలిశెట్టిని స్మరించుకోవడం మనందరి భాద్యత.

పొలిశెట్టి మా అందరికీ స్ఫూర్తి
మా గ్రామంలోని ప్రతి కళాకారుడికి పొలిశెట్టి లింగయ్య స్ఫూర్తి. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకెళ్తున్నాం. పొలిశెట్టి క్షణంలోనే పాట రాయగలడు. అందుకు అనుగుణంగా స్వరాలను కట్టేవాడు. అతనందించిన అద్భుత స్వరాలు నేటికి జనంలో నానుతున్నాయి. రాజీవ్, ఎన్టీఆర్, పి.వి.నర్సింహారావులాంటి వారిపై ట్యూన్‌లు కట్టి రాసిన పాటలు నేటికీ విన్పిస్తుంటాయి.
- కుందుకూరి సుదర్శన్, సల్కునూరు
649
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd