MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Nalgonda News
8/7/2015 2:33:11 AM
చేనేత పురిటిగడ్డ పోచంపల్లి
fiogf49gjkf0d
-11 డిజైన్లకు పేటెంట్
-పట్టుచీరకు ఇక్కడే జీవం
-ఖండాంతర ఖ్యాతి గడిస్తున్న పోచంపల్లి వస్ర్తాలు
భూదాన్ పోచంపల్లి : పోచంపల్లి గ్రామం 1965కు పూర్వం గాజుల, పూసలపల్లిగా గుర్తింపు పొందింది. నాడు ఈ గ్రామంలో గాజులు, పూసలను తయారు చేసి అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. కాలక్రమేణా ఈ వృత్తి అంతరించడంతో ఇక్కడ ఉన్న పద్మశాలీలు కొందరు తేలియా రుమాండ్లను, కాటన్ చీరలను నేయడం ఆరంభించారు. 1974లో పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములుతో పాటు మరికొందరు తమిళనాడులోని తంజావూరులో పట్టు వస్ర్తాల నేత శిక్షణ పొందడానికి వెళ్లారు. ఈ చీరలకు మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో గిరాకీ పెరగడంతో అనేక మంది చేనేత కార్మికులు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. ఆ తరువాత పోచంపల్లి పటోలా సారీస్‌గా మంచి గుర్తింపు పొందడంతోపాటు దేశవ్యాప్తంగా ఈ పోచంపల్లి పటోలా డిజైన్ చీరలకు మంచి గుర్తింపు లభించింది. తెలంగాణ గాంధీగా పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీ చొరవతో చేనేత సహకార సంఘాలు ఏర్పాటు కావడంతో పోచంపల్లి చేనేత పరిశ్రమ కేవలం పోచంపల్లికే పరిమితం కాకుండా జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుప్పల్, సిరిపురం, ఎల్లంకి, రామన్నపేట, నాగారం, బోగారం గ్రామాలకు విస్తరించడంతోపాటు వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా అనేక మంది కార్మికులకు పోచంపల్లి డిజైన్ చీరలు ఉపాధి కల్పించే పరిస్థితి నెలకొంది.

ప్రపంచాన్ని తాకిన పోచంపల్లి వస్త్ర అందాలు
పోచంపల్లిలో పురుడు పోసుకున్న పోచంపల్లి టై అండ్ డై వస్ర్తాలు నేడు ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వదేశీ మార్కెట్‌కు దీటుగా విదేశీ మార్కెట్ విపరీతంగా పుంజుకోవడంతో కార్మికులకు కాస్త పనిదొరికింది. ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన ఇంటర్‌నెట్ లాంటి అధునాతన సాధనాల వల్ల పోచంపల్లి వస్ర్తాలకు దేశ, విదేశాల్లోనూ డిమాండ్ పెరిగింది. దీంతో నిత్యం విదేశీయులు ఇక్కడికి రావడంతోపాటు పోచంపల్లి డిజైన్‌లో నేసిన పట్టు, కాటన్ వస్ర్తాలను కొనుగోలు చేస్తున్నారు.

పేటెంట్ హక్కు సాధించుకున్న 11డిజైన్లు...
కార్మికులు ఎంతో కష్టపడి తయారు చేసిన పోచంపల్లి డిజైన్‌ను మిల్లు వ్యాపారులు కాపీ కొట్టడంతో చేనేత పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఎలాగైనా గట్టెక్కించాలనే తపనతో ఇక్కడి చేనేత టైఅండ్‌డై అసోసియేషన్, చేనేత సహకార సంఘం ఎంతో కృషి చేసి 30రకాల డిజైన్లకు పేటెంట్ హక్కు కల్పించాలని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కి పలుమార్లు విన్నవించింది. కానీ, కేవలం 11రకాల డిజైన్లకు మాత్రమే పేటెంట్ హక్కును కల్పించేందుకుగాను 1999లో గుర్తించి 2000లో పేటెంట్ హక్కును కల్పించారు. దేశచరిత్రలో కార్మికుడు సాధించిన ఘన విజయంగా దీనిని పేర్కొనవచ్చు.

పోచంపల్లి కళాకారులకు జాతీయ స్థాయి గుర్తింపు
పోచంపల్లి డిజైన్‌లో అద్భుత కళాఖండాలకు జీవంపోస్తూ చేనేత వస్ర్తాలను తయారు చేసినందుకు గాను జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన గజం అంజయ్యకు, గోవర్ధన్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. గజం రాములు సంత్ కబీర్ జాతీయ పురస్కారం లభించింది.

అధ్యయన పాఠంగా చేనేత పరిశ్రమ
పోచంపల్లి చేనేత పరిశ్రమ కేవలం వస్త్ర ఉత్పత్తిలోనే కాదు... అనేక మందికి చేనేత అధ్యయన ప్రాంతంగా మారింది. చేనేత పరిశ్రమ తీరుతెన్నులను తెలుసుకోవడానికి అనేక మార్లు దేశ విదేశీయులతోపాటు నిఫ్ట్, ఎన్‌ఐఆర్‌డీ బృందాలతో పాటు ఐఎస్‌బీ, ఫ్యాషన్ టెక్నీలజీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్‌తో పాటు పాఠశాల విద్యార్థులు కూడా స్టడీ టూర్‌లో భాగంగా ఇక్కడికి వస్తూ పోతుంటారు.
936
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd