TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Medak News
8/30/2015 12:37:14 AM
సంస్కృతిని.. జానపద జాతర
-కవులు, కళాకారులకు పుట్టినిల్లు
--ఎం కేసీఆర్ పుట్టి నడిచిన గడ్డ
-మంత్రి హరీశన్న నేలగా కీర్తి ప్రతిష్ఠలు
-తెలంగాణ సాంస్కృతిక భాషా విభాగ డైరెక్టర్ మామిడి హరికృష్ణ
సిద్దిపేట ప్రతినిధి : కవులు.. కళాకారులకు పుట్టినిల్లుగా సిద్దిపేట మట్టిలో ఎంతో అద్భుతమున్నది.. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టి నడిచిన గడ్డ ఇది.. మంత్రి హరీశన్న నేలగా.. సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ గళమెత్తిన గడ్డగా.. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి సిద్ధించిన సిద్దిపేటగా.. కవి దేశపతి శ్రీనివాస్‌తో పాటు.. ఇక్కడ ఎంతో మంది కవులు, కళాకారులను తీర్చిదిద్దిన గడ్డగా కీర్తి ప్రతిష్ఠలను పొందుతుందని తెలంగాణ సాంస్కృతిక భాషా విభాగ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. శనివారం రాత్రి సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్‌లో జానపద జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 60ఏళ్ల సమైక్య రాష్ట్రంలో కవులు, కళాకారులకు గుర్తింపు రాలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఉద్యోగం వచ్చింది కళాకారులకే అన్నారు. ఇవాళ 550 కళాకారులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. వృద్ధ కళాకారులకు రూ.1500 పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. తంబాలంలా ఉన్న చెరువులను గంగాళంలా చెయ్యడానికి మంత్రి హరీశ్‌రావు మిషన్ కాకతీయతో ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ప్రతి జిల్లాలో జానపద కళాజాతరను నిర్వహించుకుంటూ సిద్దిపేటలో నిర్వహించుకున్న జానపద జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ముగింపు వేడుకలు జరుగుతాయన్నారు. ఆ రోజు 12గంటల పాటు ఏకధాటిగా కళాప్రదర్శనలు ఉంటాయన్నారు. అంతకు ముందు జిల్లా పౌర సంబంధాల శాఖ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆధ్వర్యంలో ఈ జానపద జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జానపద జాతరతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నన్నామన్నారు.

సాంస్కృతిక సారథి జిల్లా కో ఆర్డినేటర్ రాజేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పది జిల్లాల కళాకారులు, ఆటపాటలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారన్నారు. యక్షగాన రాష్ట్ర అధ్యక్షుడు పిల్లుట్ల ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కళాకారులకు మంచి గుర్తింపు లభించిందన్నారు. కళాకారుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట నియోజక వర్గ టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటపాటల ద్వారా ఉద్యమంలో కీలకపాత్ర పొషించింది కళాకారులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల కళాకారులు, సమాచార పౌర సంబంధాల శాఖ సిద్దిపేట అధికారులు కమాలోద్దీన్, రాములు, రాజు, మనోహర్, వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ శేషుకుమార్, సూరి, జువ్వన కనకరాజు పాల్గొన్నారు.

సిద్దిపేటలో జానపద జాతర
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల కలయిక జానపద జాతర సిద్దిపేటలో కొలువుదీరాయి. సిద్ధులు నడిచిన సిద్దిపేటలో జానపదం.. పల్లె సుద్దులు.. యక్షగానం.. పులివేషాలు.. బైండ్ల పోతరాజుల ఆటపాటలు.. బతుకమ్మ బోనాలు.. ఒగ్గు కళాకారులు తమ నృత్యాలతో సందడి చేశారు. రాష్ట్ర, భాషా సాంస్కతిక శాఖ ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని జానపద జాతర పేరిట జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, కళా సంఘాల సమన్వయంతో నిర్వహించిన కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పదిజిల్లాలో సాగిన జానపద జాతర శనివారం సిద్దిపేటకు చేరింది. ఈ సాంస్కృతిక శాఖ ర్యాలీని సిద్దిపేట వేంకటేశ్వర దేవాలయం వద్ద జిల్లా సమాచార శాఖ ఏడీ శ్రీనివాస్, కళా సంఘాలతో కలిసి ప్రారంభించారు.

ఈ ర్యాలీ పట్టణంలోని గాంధీరోడ్, సుభాష్ రోడ్ మీదుగా పాతబస్టాండ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన వేదిక వద్దకు చేరుకుంది. పట్టణ ప్రధాన వీధుల మీదుగా తెలంగాణ సంప్రదాయాలను కళ్లకుకట్టేలా కళాకారుల ప్రదర్శన ర్యాలీ ఆధ్యంతం కన్నుల పండువగా సాగింది. ర్యాలీ వేదిక వద్దకు చేరిన తర్వాత వేదికపై సాంస్కృతిక శాఖ ఏడీ, కళాకారులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై తెలంగాణ సంస్కృతి సంప్రదాయలు ప్రతిబింబించేలా వివిధ కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు, చిందు యక్షగానాలు, ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
218
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd