SUNDAY,    December 16, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Mahboobnagar News
1/6/2016 2:16:55 AM
మినీ ట్యాంక్‌బండ్‌గా.. కేసరి సముద్రం
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని పెద్దదైన చెరువుల్లో ఒకటైన నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం చెరువు ఉయ్యాలవాడ, చర్లతిర్మలాపూర్, ఎండబెట్ల, నాగర్‌కర్నూల్ ప్రాంతాల మధ్యలో సువిశాలంగా విస్తరించి ఉంది. సమైక్య పాలనలో దశాబ్దాలుగా నిరాదరణకు గురైంది. కాకతీయుల కాలం నాటి పురాతనమైన ఈ చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని ఏనాడో కోల్పోయింది. మొత్తం 1700ఎకరాలు ఆయకట్టు ఉన్న చెరువు నేడు కనీసం వందల ఎకరాలు కూడా సాగుకాని దుస్థితికి చెరువు చేరుకుంది. చాలా సార్లు చెరువు మొత్తం ఎండిపోయి క్రీడా స్థలంగా మారిన పరిస్థితికి చెరువు చేరుకుంది. ఇటీవలి మూడు దశాబ్దాల్లో కేవలం రెండేసార్లు అలుగు పారింది. ఈ మధ్యలో దాదాపు రెండు దశాబ్దాలు పూర్తిగా ఒట్టిపోయిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఈ చెరువు కింద ఓ పెద్ద గుట్ట ఉందని, దాని కింద వంటలు చేసుకొని, సేద తీరినట్లు గతంలో చూసిన పెద్దలు చెబుతుంటారు.

ఇప్పుడు అది పూర్తిగా మునిగిపోయి ఉంది. చెరువు కట్ట రక్షణ లేక ప్రమాదకరంగా మారింది. ఇప్పటి వరకూ పెద్దగా ప్రమాదాలేవీ జరగకున్నా కానీ కట్ట పరిస్థితి చూస్తే ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన మాత్రం తప్పడం లేదు. చెరువు కట్టపై చాలా వరకు రక్షణ రాతి రాళ్లు కూలిపోయాయి. ముఖ్యంగా మశమ్మ వద్ద రాళ్లే కనిపించడం లేదు. ఇక్కడ మలుపు కూడా ఉంది. అయితే మలుపు సూచిక మాత్రం ఏర్పాటు చేయలేదు. గతంలో ఇక్కడ చెరువు తూంను మొత్తం తొలగించి కొత్తగా నిర్మించారు. అయితే దానిపై మళ్లీ రోడ్డును బీటీ లేదా సీసీతోగానీ సరి చేయలేదు.

దీనివల్ల రోడ్డు ఇక్కడ గోతులమయంగా మారింది. ఇక చెరువు కట్టకు ఇరువైపులా కంపచెట్లు మొలిచాయి. దీనివల్ల చెరువు కట్ట కోతకు గురవుతోంది. అక్కడక్కడా కట్టపై గోతులు కూడా ఏర్పడ్డాయి. ఎండబెట్ల అలుగు వద్ద కూడా రక్షణ రాళ్లు లేవు. ఇక్కడ కల్వర్టు చిన్నగా ఉండటంతో వాహనాలు అతిజాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. అదే విధంగా చెరువు కట్టపై భారీ వాహనాల నిషేధం అమలు కావడం లేదు. ఏరియా ఆస్పత్రి ముందు కట్టకు వెళ్లే రోడ్డు వద్ద గతంలో భారీ వాహనాల నిషేధం పేరున హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బోర్డు సైతం లేకుండా పోయింది. అయితే సంబంధిత నీటి పారుదల శాఖాధికారులు ఏనాడో ఈ చెరువు రక్షణను పట్టించుకోవడం మానేశారు.

మినీ ట్యాంక్‌బండ్‌కు రూ.10 కోట్లు !
తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్య లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ చెరువు కూడా అభివృద్ధి కానుంది. ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో చెరువు అభివృద్ధి కానుంది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెరువు అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకట్రెండుసార్లు చెరువును, కట్టను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి రూ. 10కోట్లతో గతంలో ప్రతిపాదనలు పంపారు. దీనికి సంబంధిత మంత్రి హరీష్‌రావు ఆమోదం తెలిపారు. ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం త్వరలో జీఓ వెలువరించనుంది. తాజాగా చేపట్టే రెండో విడతలో ఈ పనులు ప్రారంభం కానున్నాయి.

జిల్లాలో ఏ చెరువుకూ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం. చెరువు ప్రాముఖ్యతను మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. అలాగే తొలి విడత మిషన్ కాకతీయలో నాగర్‌కర్నూల్ ఐబీ డివిజన్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ స్వయంగా మిషన్ కాకతీయ పనులకు భూమి పూజ చేసేందుకు రానున్నట్లు హామీ ఇచ్చారు. ఈనెల 11న నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం చెరువు వద్దకు చేరుకొని శంకుస్థాపన చేస్తారు. అలాగే అక్కడే రైతులు, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకోసం ఎమ్మెల్యే ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు.

అభివృద్ధికి మార్గం...!
ఈ నిధులతో చెరువు అభివృద్ధి కానుంది. కట్టను విస్తరించనున్నారు. పట్టణంలోని అలుగు నుంచి ఎండబెట్ల వరకు కట్ట ఒకటిన్నర కిలో మీటర్ల పొడవు ఉంది. కట్టపై మైసమ్మ, శమీ వేదిక, బాలెసాహెబ్ పీర్ దర్గాతో పాటు ముస్లింల స్మశాన వాటికలు ఉన్నాయి. మినీ ట్యాంక్‌బండ్‌గా మారితే కట్ట పెరగడంతో పాటు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, కూర్చునేందుకు పార్క్, బెంచీల్లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇక చెరువు పూడిక కూడా సాధ్యమైనంత మేర తొలగిస్తారు. త్వరలో కేఎల్‌ఐ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో వచ్చే నీటితో చెరువు నిరంతరం నిండి ఉంటుంది.

ఆయకట్టు సాగువిస్తీర్ణం పెరుగుతుంది. అప్పుడు తెలకపల్లి మండలంలోని దుందుభీ వాగు వరకూ నీరు పారే అవకాశం ఉంటుంది. సమీప గ్రామాలైన చర్లతిర్మలాపూర్, చర్లఇటిక్యాల, ఎండబెట్ల, ఉయ్యాలవాడ, గగ్గలపల్లి, మల్కాపూర్, పుల్జాల, నడిగడ్డలాంటి ప్రాంతాలకు నీటితో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ ఆయకట్టులో కుదించుకుపోయిన విస్తీర్ణం తిరిగి పెరుగుతుంది. దీంతో పాటు చెరువు నిండుగా ఉంటే బోటింగ్‌కూ అవకాశం ఉంటుం ది. దసరా రోజు వేలాది మందితో కట్ట జన సంద్రంగా మారుతుంది. వందలాది మంది మహిళలు బతుకమ్మలతో సందడిగా మారుతుంది.

దర్గా వద్ద తరచూ కందూరులు జరుగుతుంటాయి. దర్గా నుంచి చెరువు మొత్తం కనిపిస్తుంటుంది. ఉదయం, సాయంత్రం ప్రజలు వా కింగ్‌లు చేస్తుంటారు. పట్టణంలో ఇలాంటి ప్రదేశం మరోచోటా లేదు. త్వరలో జిల్లా కాబోతోంది. ట్యాంక్‌బండ్‌గా మారితే ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అయితే ముస్లింల స్మశాన వాటికలకు ఇబ్బందులు కలగకుండా మత పెద్దలతో చర్చించి విస్తరణ చేపట్టనున్నారు. మొత్తం మీద నాగర్‌కర్నూల్ చెరువు మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి కావడంతో పాటు మినీ ట్యాంక్‌బండ్‌గా మారడంపై పట్టణ, నియోజకవర్గ ప్రజ లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీష్, ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

చెరువులతోటే అభివృద్ధి : మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే
చెరువులే మన తెలంగాణలో అధికంగా సాగు,తాగునీటి వనరులు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ఇలాంటి చెరువులను ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు సీఎం, మంత్రిని కోరితే వెంటనే రూ.10కోట్లకు హామీ ఇచ్చారు. ఈనెల 11న పనులకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేస్తారు. చెరువును అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా.
832
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd