TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Khammam News
5/29/2016 1:17:40 AM
మిషన్ భగీరధ..!
-ప్రతిష్టాత్మక పథకంతో తాగునీటి కష్టాలకు చెక్
-స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం
-జిల్లాలో 2658 గ్రామాలకు రక్షిత మంచినీరు
-వచ్చే డిసెంబర్ నాటికే 704 గ్రామాలకు నీటి సరఫరా
-రూ. 4, 126 కోట్లు మంజూరు చేసిన సర్కార్
-2018 నాటికి మూడు సెగ్మెంట్లలో పనులన్నీ పూర్తి
సీమాంధ్ర పాలకుల ఏలుబడిలో..
ప్రజలు తాగేందుకు నీళ్లు లేకున్నా పట్టించుకున్న వారు లేరు..!
ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని రోడ్లెక్కినా ఆదుకున్న వారు లేరు..!
మంచినీళ్లు మహాప్రభో అని వేడుకున్నా కనికరించిన వారు లేరు..!
వ్యవసాయ భూములు బీళ్లుగా మారినా ఆదుకున్న వారు లేరు..!!
రాజులు మారారు..! రాజ్యాలు మారాయి..! తెలంగాణ వచ్చింది..!
ఖమ్మం, నమస్తేతెలంగాణ:ఉద్యమపార్టీ పగ్గాలు చేపట్టింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన మొదలైంది..! దేశంలో ఎక్కడా లేని విధంగా నవ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే అపర భగీరథ ప్రయత్నానికి నాంది పలికారు. మిషన్ భగీరథను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు రూ. 4, 217 కోట్లు మంజూరు చేశారు. వచ్చే డిసెంబర్ నాటికి తొలివిడతగా 704 గ్రామాలకు మంచినీరు సరఫరా చేసేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

ఖమ్మం, నమస్తేతెలంగాణ: రాజులు మారారు.. రాజ్యాలు పోయాయి.. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డాక ఆంధ్రా ప్రభుత్వాలు వచ్చాయి. తెలుగు ప్రజలంతా ఒక్కటేనని తెలంగాణను ఆక్రమించుకున్నారు. హైటెక్ సిటీని చూపించి అభివృద్ధి అన్నారు.. గత అరవై ఏండ్లుగా బంధుప్రీతి, సామాజిక సమీకరణల్లో మునిగి తేలారు.. కనీసం తాగేందుకు నీళ్లులేక సామా న్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.. గుక్కెడు మంచినీటి కోసం తెలంగాణ బిడ్డలు అల్లాడిపోయారు. బిందెడు నీటికోసం పల్లె ప్రజలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి.. ఏజెన్సీ వాసులకు ఊట చెలిమెలే పెద్ద దిక్కయ్యాయి.. సమైక్య పాలనలో ఆద్యంతం దోచుకోవటం, దాచుకోవటం అనే రెండు కార్యక్రమాలు మూడుపు వ్వులు ఆరు కాయలుగా సాగాయి.

కానీ పద్నాలుగు సంవత్సరాల పోరాటం అనంతరం అధికారంలోకి వచ్చిన ఉద్యమపార్టీ ప్రజాకాంక్ష పాలనకు శ్రీకారం చుట్టింది.. దేశంలోనే ఎక్కడాలేని విధంగా నవ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటుచేసి, రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని అపర భగీరథ ప్రయ త్నానికి నాంది పలికారు.దీనిలో భాగంగానే జిల్లాకు రూ. 4,217 కోట్లు మంజూరు చేశారు.. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.. వచ్చే డిసెంబర్ నాటికి తొలివిడతగా 704 గ్రామాలకు మంచినీరు సరఫరా చేయబోతున్న బృహత్తర పథకంపై నమస్తే తెలంగాణ కథనం..
తెలంగాణ ఆడబిడ్డలు బిందెడు నీటికోసం బజారున పడవద్దన్నదే సీఎం కేసీఆర్ ఆశయం.

వచ్చే 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటుచేసి, సురక్షిత మంచినీటిని అందించాలనే ఆశయంతో కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల ఆత్మగౌరవంతో ముడిపడిన ఈ అంశంలో ఎక్కడా రాజీపడకుండా అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు అంగీకారం తెలిపిన సీఎం బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలు, 40 మండలాల పరిధి లోని 2658 గ్రామాలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. దీనికిగాను సర్కార్ జిల్లాకు రూ. 4,126 కోట్లను మంజూరు చేసింది. ఆయా నిధులతో జిల్లాలోని పాలేరు, వైరా, గోదావరి మూడు సెగ్మెంట్లలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఖమ్మం నగరంతో పాటు 40 మండలాలు, 6 మున్సిపాలిటీలలోని 2658 గ్రామా లకు గాను 25.08 లక్షల మందికి తాగునీటిని అందించేలక్ష్యంగా భగీరథ పథకాన్ని నిర్మాణం చేయబోతున్నారు.

పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
కూసుమంచి మండలం జీళ్లచెర్వు గ్రామంలో మిషన్ భగీరథ పనులను మంత్రులు కేటీఆర్, తుమ్మల శంకుస్థాపన చేశారు. ఆరోజు నుంచి నేటి వరకు జిల్లాలో మిషన్ భగీరథ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. పాలేరు, వైరా, గోదావరి సెగ్మెంట్‌లో ఇన్‌టేక్‌వెల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కాంక్రీట్ పనులు పూర్తికాగా, ట్యాంక్ నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాలకు పైప్‌లైన్ నిర్మాణపు పనులు సైతం ఆగమేఘాల మీద పూర్తికావస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం అహో రాత్రులు శ్రమిస్తున్నది. ప్రాజెక్టు పనులను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రానున్న రెండేళ్లలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు రూపొందించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం పనులను పూర్తిచేస్తామని సంబంధిత అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

పాలేరు సెగ్మెంట్‌లో ఇలా..
మిషన్ భగీరథ పథకం పనుల్లో భాగంగా పాలేరు సెగ్మెంట్‌లో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలతోపాటు మధిర నియోజకవర్గం పరిధిలోని చింతకాని, ముదిగొండ మండలాలకు మంచినీరు అందించనున్నారు. దీనికిగాను ప్రభుత్వం పాలేరు సెగ్మెంట్‌కు రూ.671 కోట్లు మంజూరు చేసింది. ఇన్‌టెక్‌వెల్‌కు రూ.93 కోట్లు, హెడ్‌వర్క్స్, సబ్‌స్టేషన్, ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ల నిర్మాణం, స్థల కొనుగోలు కోసం రూ. 578 కోట్లు వచ్చాయి. ఖమ్మం నగరంతో పాటు 7 మండలాల్లోని మొత్తం 370 గ్రామాలు, 7. 22 లక్షల మందికి రక్షిత మంచినీటిని సరఫరా చేయనున్నారు. రూరల్ ప్రాంతంలో 4.17 లక్షల మందికి, అర్బన్(పట్టణ) ప్రాంతంలోని 3.05 లక్షల మందికి, ఒక్కో వ్యక్తికి 100 నుంచి 130 లీటర్ల చొప్పున 90 ఎంఎల్‌డీ నీటిని అందిస్తారు. పాలేరు జలాశయం పక్కనే 80 ఎంఎల్‌డీ ( 40 రూరల్, 40 పట్టణ ప్రాంతాలకు) లీటర్ల కేపాసిటీతో కూడిన ఇన్‌టెక్‌వెల్‌ను నిర్మాణం చేస్తుండగా, జీళ్ళచెరువు గుట్టపై 90 ఎంఎల్‌డీ కేపాసీటితో కూడిన హెడ్‌వర్క్స్‌ను నిర్మి స్తున్నారు. 9 వోహెచ్‌బీఆర్ ట్యాంక్‌లు, 8 సంప్‌లు, 222 వోహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటికి అనుసంధానంగా 15.94 కిలోమీటర్లు, మరో 615.62 కిలోమీటర్ల దూరం సెకండరీ పైపులను వేస్తున్నారు.

వైరాలో ఇలా..
వైరా సెగ్మెంట్‌లో నిర్మితమవుతున్న ప్రాజెక్టు నుంచి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, 11 మండలాల పరిధిలోని 462 గ్రామాలకు చెందిన 5.64 లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందించబోతున్నారు. దీనికిగాను వైరా సెగ్మెంట్‌కు రూ.855 కోట్లు మంజూరు చేయగా, ఇన్‌టేక్‌వెల్, హెడ్‌వర్క్స్, సబ్‌స్టేషన్, ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ల నిర్మాణం, స్థల కొనుగోలు విషయంలో ఈ నిధులను ఖర్చుచేయనున్నారు. రూరల్ ప్రాంతంలో 5.35 లక్షల మందికి, అర్బన్ ప్రాంతంలోని 0.29 లక్షల మందికి, ఒక్కో వ్యక్తికి 100 నుంచి 130 లీటర్ల చొప్పున 100 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయనున్నారు. 17 వోహెచ్‌బీఆర్ ట్యాంక్‌లు, 5 సంప్‌లు నిర్మాణం చేస్తున్నారు. తొలిదశలో 42 కిలోమీటర్లు, రెండవదఫాలో 1096కిలో మీటర్ల పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

గోదావరి సెగ్మెంట్‌లో ఇలా..
గోదావరి సెగ్మెంట్ పరిధిలో మూడు ప్రాంతాల్లో నీటిని శుద్ధిచేసి ప్రజలకు అందించబోతున్నారు. వాజేడు మండలం పూసూరు వద్ద 9 ఎంఎల్‌డీ, అశ్వాపురం మండలం రథంగుట్ట వద్ద 40 ఎంఎల్‌డీ, పాల్వంచ దగ్గర 145 ఎంఎల్‌డీ సామర్థ్యమున్న ట్యాంకులను నిర్మిస్తున్నారు. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 22 మండలాలు, 1862 గ్రామాలకు చెందిన 12.95 లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందించబోతున్నారు. దీనికిగాను ప్రభుత్వం గోదావరి సెగ్మెంట్‌కు రూ.2600 కోట్లు మం జూరు చేయగా, ఇన్‌టేక్‌వెల్, హెడ్‌వర్క్స్, సబ్‌స్టేషన్, ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ల నిర్మాణం, స్థల కొనుగోలు వంటి ప్రక్రియ చేపట్టారు. రూరల్ ప్రాంతంలో 9.97లక్షల మందికి, అర్బన్(పట్టణ) ప్రాంతంలోని 2.98 లక్షల మందికి, ఒక్కో వ్యక్తికి 100 నుంచి 130 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 1270 కెఎల్ కెపాసీటీతో వోహెచ్‌బీఆర్ ట్యాంక్‌లు, 11550 కెఎల్ కెపాసిటీతో జీఎల్‌బీఆర్ ట్యాంకులను, 57300 కెఎల్ కెపాసీటితో సంప్‌ను నిర్మాణం చేస్తున్నారు. తొలివిడతగా 125.50 కిలో మీటర్లు, రెండవదశలో 3253 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ వేస్తున్నారు.

తొలగిన అడ్డంకులు..
సమైక్య ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో ఎటువంటి పనిమొదలు పెట్టినా అనేక రకాల అడ్డంకులు. సాగునీటి ప్రాజెక్టుల దగ్గర్నుంచి మొదలు పెడితే మంచినీటి వరకు ఉద్దేశపూర్వకమైన ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి జిల్లాలోని అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు 33 రైల్వే అనుమతులు రావాల్సి ఉండగా 22 వచ్చాయి. అటవీశాఖ నుంచి 21కి 19 వచ్చాయి. మిగిలినవి కూడా అన్నిరకాల పరిశీలనలు పూర్తిచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారులు, ఇరిగేషన్ కాలువలు, వంతెనల నిర్మాణం వంటివన్నీ అధికారులకు ముందే అందటంతో జిల్లాలో మిషన్ భగీరథ పథకం నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.

వచ్చే జూలై నుంచే నీటి సరఫరా..
రానున్న మూడేళ్లలో ఇంటింటికీ నల్లాను ఏర్పాటుచేసి, రక్షిత మంచినీటిని అందించిన తర్వాతనే మరోసారి ఓటు అడుగుతానని చెప్పిన సీఎం దేశంలోనే కేసీఆర్ ఒక్కరే అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు జిల్లా అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈక్రమంలో జిల్లాలో చేపట్టిన మూడు సెగ్మెంట్లలో ప్రధాన పనులన్నీ పూర్తికావచ్చాయి. గ్రామాలకు పైప్‌లైన్‌లను అత్యంత వేగంగా వేస్తున్నారు. కాగా ప్రభుత్వం ఆదేశానుసారం విడతల వారీగా మంచినీటిని అందించేందుకు యంత్రాంగం సమాయత్తం అవుతున్నది. దీనిలో భాగంగానే తొలిదఫాగా వచ్చే జులై నాటికి 90 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించబోతున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్‌లో 614 గ్రామాలకు, వచ్చే ఏడాది జూన్ వరకు 362 గ్రామాలకు, డిసెంబర్ నాటికి 681 గ్రామాలకు, 2018 జూన్ నాటికి 911 మొత్తం 2658 గ్రామాలకు మంచినీటిని అందివ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు..
దశాబ్దాల తరబడి గుక్కెడు మంచినీటి కోసం అల్లాడిన జనం. ఎండుతున్న గొంతులను తడుపుకునేందుకు కిలోమీటర్ల దూరం నడుస్తున్న మహిళలు సీఎం కేసీఆర్ ఆశయమైన ఇంటింటికీ నల్లా కొద్దిరోజుల్లో నెరవేరబోతున్నందుకు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మరో ఏడాదిలోపు శుద్ధి చేసిన మంచినీరు తమ ఇంటికి సరఫరా అయ్యేరోజు ఎంతో దూరంలో లేనందుకు ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో మురిసిపోతున్నారు. తెలంగాణ రావటంతోనే, ఉద్యమనేతగా పద్నాలుగు సంవత్సరాలు ప్రస్తానం సాగించిన కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం వల్లనే ఇంతటి మహాత్కార్యం సాక్షాత్కారం అవుతున్నదని గర్వపడుతున్నారు. తామంతా తెలంగాణ ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని అడ బిడ్డలు అంటున్నారు.
3429
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd