MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
6/8/2015 1:27:57 AM

నేడే చేప ప్రసాదం పంపిణీ

fiogf49gjkf0d
-సిద్ధమైన ఎగ్జిబిషన్ గ్రౌండ్
-అందుబాటులో లక్ష కొర్రమీన్లు
-ఒక్క కొర్రమీను ధర రూ.15
-కొనుగోలుకు 40 కౌంటర్లు
-ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నిర్మల
-5 లక్షల మంది వస్తారని బత్తిని సోదరుల అంచనా
నమస్తేతెలంగాణ, సిటీబ్యూరో: చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమైంది. బత్తిని సోదరులు సోమవారం రాత్రి 11.50 గంటలకు ప్రసాదం పంపిణీ మొదలుపెట్టి మంగళవారం రాత్రి 11.50కు ముగించనున్నారు. రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో సుమారు లక్ష కొర్రమీన్లు ఆస్తమా వ్యాధిగ్రస్తులకు అందుబాటులో ఉంచారు. కొర్రమీన్ల కొనుగోలుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 40 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కొర్రమీనును రూ.15కు విక్రయించనున్నారు. వ్యాధి గ్రస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చేపప్రసాదం అందని వారికి దూద్‌బౌలిలోని బత్తిని సోదరుల ఇంటి వద్ద పంపిణీ చేయనున్నారు.

దశాబ్దాల చరిత్ర
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నాలుగో నిజాం నాసిరుద్దౌలా కాలంలో పాతబస్తీ దూద్‌బౌలికి చెందిన బత్తిని వీరన్న గౌడ్ బేగంబజార్ ప్రాంతంలో కల్లు కాపౌండ్ నిర్వహించేవాడు. ఒక రోజు భారీగా వర్షం పడుతుండగా తడిచిన ఓ సాధువు అక్కడికి రావడం గమనించిన వీరన్న గౌడ్ అతన్ని ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశాడు. సంతృప్తి చెందిన ఆ సాధువు తాను వెళ్లే సమయంలో ఆస్తమా వ్యాధిని నయం చేసే వనమూలికలను బత్తిని వీరన్న గౌడ్‌కు చెప్పాడు. నగరంలో లభించే వనమూలికలతో ప్రసాదం తయారు చేసి, ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన తొలినాడే ఎలాంటి లాభాపేక్షలేకుండా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తే నీకు, నీ కుటుంబానికి మేలు జరుగుతుందని ఆ సాధువు వీరన్న గౌడ్‌కు తెలిపాడు. అప్పటి నుంచి వీరన్న గౌడ్ ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా వీరన్న గౌడ్ తన ఇంటి వద్ద 1847లో చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించాడు. తదనంతరం తన కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శంకర్‌గౌడ్, సత్యమ్మ దంపతులకు కలిగిన ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.

తొలుత పూజలు
బత్తిని సోదరులు వనమూలికలను సేకరించి పూజలు, సత్యనారాయణ వ్రతం చేస్తారు. అనంతరం బావినీటితో వన మూలికలను శుద్ధి చేసి మర్ధన చేసి మందుగా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన మందును మృగశిర కార్తె ప్రవేశించే రోజున చిన్న చిన్న కొర్రమీను పిల్లల నోట్లో పెట్టి అస్తమా వ్యాధి గ్రస్తుల గొంతులో వేస్తారు.

మూడు రకాల మందు పంపిణీ
ఆస్తమా రోగులకు చేప ప్రసాదం, బెల్లం ప్రసాదం, కార్తీ ప్రసాదం అనే మూడు రకాల ప్రసాదాలను బత్తిని సోదరులు సిద్ధం చేశారు. మాంసాహారులకు చేప ప్రసాదం, శాఖాహరులకు బెల్లం ప్రసాదం, 45 రోజుల పాటు వాడే కార్తె ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఈ మందును వేసుకున్న వారు 45 రోజుల పాటు పత్యం పాటించాలి. మృగశీర, ఆరుద్ర, పునార్‌వాస్, పుష్యమి కార్తె వరకు చేప ప్రసాదాన్ని అందజేస్తారు.

దూద్‌బౌలి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు
చేప ప్రసాదం పంపిణీ మొదట దూద్‌బౌలిలోని బత్తిని సోదరుల నివాసంలో 1847 నుంచి 1996 వరకు సాగింది. అనంతరం పాతబస్తీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం 1997లో నిజాం కళాశాల గ్రౌండ్‌కు మార్చింది. నాటి నుంచి 2011 వరకు దాదాపుగా 13 ఏళ్లు అక్కడే నిరాటంకంగా సాగింది. అనంతరం ఒక ఏడాది కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. అయితే అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. దీంతో చేప ప్రసాదం పంపిణీ వేదిక 2013లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి మారింది. కొన్ని హేతువాద సంస్థలు చేప ప్రసాదం ఉత్తదేనని ప్రచారం చేసినా ఇక్కడి వచ్చే ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేసిన ఏర్పాట్లను కలెక్టర్ నిర్మల ఆదివారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు అడిషనల్ డీఎంహెచ్‌వో పద్మజా, మత్స్యశాఖ డీడీ సరళ, ఎగ్జిబిషన్ సొసైటీ ఇన్‌చార్జి కార్యదర్శి అశ్విన్ మార్గమ్, తదితర అధికారులు ఉన్నారు.

1500 మంది పోలీసులతో బందోబస్తు
అబిడ్స్(నమస్తేతెలంగాణ): చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ కమల్‌హాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 1500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు బేగంబజార్ ఇన్‌స్పెక్టర్ గంగసాని శ్రీధర్ తెలిపారు. మైదానం ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
702
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd