చారిత్రక ఖిల్లా..

Fri,October 14, 2016 01:02 AM

-నాలుగువేల ఏండ్ల చరిత్రకు సాక్ష్యం
-మకుటాయమానాలుగా ఆలయాలు
-రాజసమొలకించే కోటలు.. శత్రుదుర్భేద్య గడులు
-శైవ, వైష్ణవ, జైన, బౌద్ధమతాలకు నెలవు
-రమణీయతకు అద్దంపట్టే వాగులు, వంకలు

(జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ);గలగలపారే గోదావరి తీరం వెంట.. నాలుగువేల ఏండ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది జగిత్యాల జిల్లా. రాజసమొలికించే కోటలు, శత్రుదుర్భేద్య గడులు, దట్టమైన అటవీప్రాంతాలు, కనువిందు చేసే రాఖీ గుట్టలు, వాగులు, వంకలతో అలరారుతున్నది. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కొండగట్టు అంజన్న, ధర్మపురి నర్సన్న, పొలాస పౌలస్తేశ్వర, రాయికల్ త్రికూటాలయాలు మకుటాయమానాలుగా మారాయి. వేల ఏండ్ల పరిణామ క్రమంలో శైవ, వైష్ణవ, జైన, బౌద్ధమతాలకూ అలవాలమై అత్యంత ప్రాచీన నగరమైన కోటి లింగాలను కడుపున దాచుకున్నది.

చారిత్రక నేపథ్యమున్న గుట్టలు, రాజసమొలకించిన కోటలు, శత్రుదుర్భేద్యమైన గడులు, ఆధ్యాత్మికతను పంచే ఆలయాలతో జగిత్యాల జిల్లా నాలుగువేల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ని లిచింది. నాడు శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ మతాలకు ఆలవాలంగా ఉండి రాఖీ గుట్టలు, వాగులు, వంకలతో ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నది.

జగ్గదేవుడి పేరిట జగిత్యాల
వెయేళ్ల క్రితం పొలాసను రాజధానిగా చేసుకొని పాలించిన మేడరాజు కొడుకు జగ్గదేవుడి పేరిట జగిత్యాల గ్రామం ఏర్పాటైన ట్లు చరిత్ర చెబుతున్నది. వందల ఏళ్లనుంచీ ఈ ప్రాంతం పరి పాలనా కేంద్రంగా విలసిల్లింది. జగిత్యాలలో క్రీస్తు శకం 1747 లో దాదాపు 20 ఎకరాల స్థలంలో నిజాం పాలకులు ప్రెంచి ఇంజినీర్ల పర్యవేక్షణలో కోటను నిర్మించారు. నక్షత్రాకారంలో కట్టిన ఈ కోట అత్యంత అద్భుతమైన కట్టడంగా పేరుగాంచింది. కోట చుట్టూ పెద్ద అఘాతాలను నిర్మించారు. కోటపై శత్రువులు దాడి చేస్తే తిప్పికొట్టేందుకు వీలుగా దాదాపు 90ఫిరంగులను అ మర్చారు. నేడు ఈ ఖిల్లాను పట్టించుకునే నాథుడు లేక క్రమంగా ఫిరంగులు సైతం చోరుల బారిన పడ్డాయి.

నాటి రాజధాని నేటి కుగ్రామం
ఒకనాటి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా కాకతీ యులతో సమానమైన చరిత్ర గలిగిన పట్టణం నేడు ఓ మామూ లు కుగ్రామంగా మారింది. దాదాపు ఐదువేల సంవత్సరాల చ రిత్ర కలిగిన నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. జైన మత తీర్థంకరుల ప్రతిమలు, పార్శనాథుడి విగ్రహం, 36 స్తంభాలతో నిర్మితమైన పౌలస్తేశ్వరాలయం, కన్నడ శాసనాలు, వేణుగోపాలస్వామి ఆలయం, అన్నపూర్ణ విగ్రహం, కాకతి విగ్రహం, శిథిలమైన కోట భాగాలు ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తాయి. మేడరాజు, జగ్గదేవు డు, రెండో మేడరాజు, రెండో జగ్గదేవుడు ఇల్లా వరుసగా పలువు రు రాజులు రాజధానిగా చేసుకున్న పొలాస, సమ్మక్క దేవత పుట్టినిల్లు అని కూడా చరిత్ర చెబుతున్నది.

కాకతీయుల కళావైభవం త్రికూటాలయం
వరంగల్‌లోని వెయి స్తంబాల గుడి, రామప్ప ఆలయం, నగునూర్ త్రికూటాలయం ఇలా పేరెనికగన్న నిర్మాణాల శైలిని తలపించే అద్భుత చారిత్రక కేంద్రంగా రాయికల్ నిలిస్తున్నది. కాకతీయుల కాలంలో రాయికల్ లో నిర్మించిన త్రికూటాల యాన్ని చూస్తే నాటి కళా వైభవం కళ్లకు కట్టిన ట్లుంటుంది. క్రీస్తు శకం 1305లో ప్రతాపరుద్ర చక్రవర్తి పరిపాలన సమయంలో ఈ ఆలయం నిర్మితమైంది. మూడు గర్భగుడులు, ఒకే మండపంతో కట్టిన ఈ ఆలయంలో దేవనాగర లిపిలో వేసిన శాసనం ఉంది. పంచముఖ లింగం, కేశవనాథుడు, సూర్య విగ్రహాలు నిలిపి ఉన్నాయి.

ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే వాల్గొండ
మల్లాపూర్ మండలంలోని వాల్గొండలో గోదావరి ఒడ్డున ఉన్న కొండపై నిర్మించిన త్రికూటాలయం అత్యంత ప్రాచీణ ఆలయంగా గుర్తింపు పొందింది. క్రీస్తు పూర్వం శాతవాహనులలో 17వ చక్రవర్తి, కవివత్సలుడు అని కీర్తికెక్కికన హాలసార్వభౌముడు, తన పట్టపురాణి లీలావతిని ఈ క్షేత్ర సమీపంలోని భీమేశ్వరాలయంలో వివాహం చేసుకున్నట్లు గాథాసప్తశతి చెబుతున్నది. తదుపరి కాలంలో ఇక్కడి కొండపై త్రికూటాలయం నిర్మించారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఈ ఆలయం అత్యంత ఆహ్లాదం పంచుతున్నది.

బౌద్ధమత కేంద్రం పాశిగాం
బౌద్ధమతానికి ఒకనాటి కేంద్రం పాశిగాం కాగా దేశంలోనే అత్యంత ప్రాచీనమైన బౌద్ధ స్తూపం ఈ గ్రామంలోనే ఉన్నది. గుంటూరు సమీపంలోని అమరావతిలోని బౌద్ధ స్తూపం కంటే రెండు శతాబ్దాల ముందు పెద్దపల్లి జిల్లాలోని దూళికట్ట బౌద్ధ స్తూపం నిర్మితం కాగా, ఇది హీనయానానికి సంబంధించిందని చరిత్రకారులు చెబుతుంటారు. దూళికట్ట కంటే ప్రాచీనమైన బౌద్ద స్తూపంగా పాశిగాం గుర్తింపు పొందింది. బుద్ధుడి దంతాన్ని పెట్టెలో ఉంచి పాశిగాం స్తూపాన్ని నిర్మించినట్లు చెబుతారు. కాగా రోడ్డు వెడల్పులో భాగంగా పాశిగాం స్తూపం పూర్తిగా కనపించకుండా పోయింది.

పడిలేచిన కెరటం.. ధర్మపురి క్షేత్రం
పశ్చిమ కొండల్లో పుట్టి, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ర్టాలను సస్యశ్యామలం చేస్తూ, కోట్లాది జీవులకు ఆధారభూతమైన గోదావరినది ఉత్తర, దక్షిణాలుగా ప్రవహించే అత్యంత పవిత్ర స్థలంలో రూపుదిద్దుకున్న పుణ్యక్షేత్రం ధర్మపురి. దాదాపు 400ఏళ్ల క్రితం ఏర్పడిన అగ్రహారమిది. ఇక్కడి నృసింహ క్షేత్రం రోహిలాల దండయాత్రలో చిన్నాభిన్నమై, తిరిగి ఊపిరిపోసుకొని సగర్వంగా నిలిచింది. గోదావరినదితో పాటు, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలు, రామలింగేశ్వరాలయం, శ్రీమఠం, అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయం, సత్యవతిగుండాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

వనమూలికలతో కొండగట్టు
మల్యాల మండల కేంద్రానికి అత్యంత సమీపంలో గుట్టల మధ్య ఏర్పడిన క్షేత్రం కొండగట్టు. పూర్తిగా వనమూలికలతో నిండిన దండకారణ్యంలోని కొండల నడుమ 1700 ఏళ్ల క్రితం ఈ ఆలయం ఏర్పడింది. రాష్ట్రంలోనే అతిపెద్ద అంజన్న క్షేత్రంగా విలసిల్లుతున్నది. ఆషాఢ, శ్రావణ మాసాల్లో లక్షలాది మంది భక్తులు దర్శించుకొని తరించే కొండగట్టు ఆలయం ప్రకృతి రమణీయతకు నెలవుగా ఉన్నది. కొండలరాయుడి గుట్ట, సీతమ్మ కన్నీటి దార, మునీశ్వరులు తపస్సు చేసుకున్న గుహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి.

మట్టికింద మహానగరం కోటిలింగాల
దక్షిణ భారత దేశాన్ని తొలిసారిగా పరిపాలించిన శాతవాహ నుల తొలి రాజధాని కోటిలింగాల. వెల్గటూర్ మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో వెలసిన అత్యంత ప్రాచీన నగరమిది. కాలగర్భంలో కలిసిన చరిత్రను వెలికి తీసి పురావస్తు శాస్త్రవేత్తలు కోటిలింగాల ప్రాధాన్యతను ప్రపంచం ముందు ఆవిష్కరించారు. అనేక శాసనాలు, నాణేలు లభ్యమైన ఈ నగరం లో అత్యంత ప్రాచీనమైన కోటేశ్వరస్వామి ఆలయం ఉంది.

అడుగడుగునా గుడి
అత్యంత ప్రాశస్త్య ఆలయాలతో పాటు జగిత్యాల జిల్లాలో అడుగడుగనా గుడి దర్శనమిస్తుంది. పూర్వం నిర్మితమైన మహావీర, రామాలయాలు కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో ఉన్నాయి. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరులో వాగు ఒడ్డున నిర్మితమైన చాళుక్యుల కాలం నాటి త్రికూటాలయం, మల్లన్నపేటలో ఉన్న శివాలయం, పెగడపల్లి మండలం ఆరవెల్లిలో కొలువుదీరిన అతి ప్రాచీనమైన వేణుగోపాలాస్వామి ఆలయం, ఏటా శివరాత్రిరోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకొని తరించే దుబ్బరాజన్న ఆలయం, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ రేచపల్లి జగన్నాథాలయం, బీర్‌పూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయాలు భక్తుల కొంగుబంగారాలుగా నిలుస్తున్నాయి. వీటితో పాటు కోరుట్ల సాయిబాబా ఆలయం, కృష్ణ మందిరం, రాయికల్ మండలం ఇటిక్యాలలోని సాయిబాబా ఆలయం, రాయికల్‌లోని అయ్యప్ప ఆలయం, మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో నిర్మించిన బ్రహ్మేంద్రస్వామి ఆలయం, జగిత్యాలలోని సాయి నిలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి.

738
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles