రామయ్య పెళ్లి కొడుకాయనే..

Mon,March 13, 2017 01:57 AM

-కల్యాణ తలంబ్రాలు కలుపే తంతు ప్రారంభం
-సంప్రదాయబద్దంగా పసుపు కొమ్ముల దంపుడు
-పెళ్లి కొడుకుగా భద్రాద్రి రామయ్య ముస్తాబు
-రాములోరిని వీక్షించి తరించిన భక్తజనులు
-స్వామివారికి ఘనంగా వసంతోత్సవం
-జోల, లాలతో రామయ్యకు డోలోత్సవం

(భద్రాచలం, నమస్తే తెలంగాణ): భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో మార్చి 29 నుంచి ఏప్రిల్ 11 వరకు వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 5న శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవం, ఏప్రిల్ 6న రామయ్య మహా పట్టాభిషేకం జరగనుంది. ఈ క్రమంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమానికి అంకురార్పణ జరగగా ఆదివారం భద్రాద్రి రామయ్య కల్యాణ రాముడిగా ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రాకార మండపంలో 6 గంటలకు ఉత్సవ మూర్తులను వేంచేయింప చేశారు. చిత్రకూట మండపం వేదిక వద్ద 9 మంది వైష్ణవ స్త్రీలతో రోలు, రోకలిలో లక్ష్మీదేవిని, సరస్వతిదేవిని ఆవాహన గావించి రోకలికి రక్షాబంధన జరిపారు. సంప్రదాయబద్ధంగా ఈ తంతు నిర్వహించారు. పసుపు కొమ్ములు దంచి అర్చకులు పెళ్లి పనులను ముమ్మరం చేశారు. అనంతరం స్వామివారి కల్యాణ తలంబ్రాలను కలిపే తంతును నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాళ్లూరి రమేష్‌బాబు, భద్రాచలం ఆర్డీవో శివనారాయణరెడ్డిలు తలపై తలంబ్రాలను తీసుకొని రామాలయం వరకు చేరుకున్నారు.

ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం గావించారు. యాగశాలలో అభిషేక హోమం, మహాపూర్ణాహుతి జరిపారు. బంగారు ఊయలలో స్వామివారిని వేంచేయింప చేసి ఆస్థాన హరిదాసులతో లాలలు, జోలలు నిర్వహించి కీర్తనలు ఆలపించారు. శుభ ముహూర్తాన ఒక్కొక్క కలశాలలో వసంతాలన్ని ఆవాహనం గావించి 9 పసుపు ముద్దలు, గుక్కా, గులాలు, అత్తరు, పన్నీరు, సుగంధ ద్రవ్యాలు కలిపి అంతరాలయానికి వెళ్లి స్వామివారిని పెళ్లి కుమారుడిగా అలంకరించారు. మహా కుంభప్రోక్షణ జరిపి స్వామివారిపై వసంతాలు జల్లారు.

అనంతరం వసంత తీర్థాన్ని ప్రోక్షించిన పిదప భక్తులపై చల్లారు. అత్యంత అంగరంగవైభవంగా నిర్వహించిన ఈ కల్యాణ తలంబ్రాలు కలుపు వేడుక, వసంతోత్సవం, డోలోత్సవంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో భద్రాద్రి రామాలయం ఆదివారం కిటకిటలాడింది. ఓ వైపు హోలీ వేడుక, మరోవైపు స్వామివారి వసంతోత్సవం, డోలోత్సవం వేడుకతో భద్రాద్రి పరిసరాలు భక్తులతో కళకళలాడాయి. భద్రాచలం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బులికృష్ణ, తహసీల్దార్ రామకృష్ణ, దేవస్థానం ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యులు, వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలసాయి, దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్, డీఈ రవిందర్, సూపరింటెండెంట్ భవానీ రామకృష్ణ, ఈవో సీసీ అనిల్‌బాబు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దుమ్ముగూడెంలో ఘనంగా స్వామివారి డోలోత్సవం


దుమ్ముగూడెం: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఆదివారం స్వామివారికి డోలోత్సవం నిర్వహించారు. ముందుగా స్వామివారికి సుప్రభాతసేవ, నిశాచూర్ణోత్సవం, పసుపుతో అభిషేకం తదితర పూజలు గావించారు. అనంతరం తలంబ్రాలు కలిపి స్వామివారికి వసంతోత్సవం జరిపారు. అదేవిధంగా మహిళలు పసుపు కొమ్ములు దంచారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవ, పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కిరణ్‌కుమారాచార్యులు, భార్గవాచార్యులు, ఆలయ ఇన్‌చార్జ్ నిరంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం


భద్రాచలం, మార్చి 12 (నమస్తే తెలంగాణ): భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందాయి. మల్కీపురానికి చెందిన ఎస్‌వీ రామకృష్ణ రూ.లక్ష, హైదరాబాద్‌కు చెందిన ఎస్.పణిబాబు, హరిప్రియదేవి దంపతులు మరో రూ.లక్ష విరాళంగా ఆదివారం అందజేశారు. భద్రాచలం వచ్చిన వారు శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులకు ఈ విరాళాలు అందజేశారు.

258
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles