శివోహం..!


Thu,February 8, 2018 11:03 PM

మహేశాత్ నా పరోదేవః మహేశ్వరుడిని మించిన దేవుడు లేడు. శివ పంచాక్షరీ మంత్రంలోని న-మ-శి-వ-య అనే పంచ బీజాక్షరాల నుండి పంచ భూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం. ఓం నమశ్శివాయ పంచాక్షరీ మంత్రాన్ని పఠించినంత మాత్రానే సర్వ పాపహరణ జరుగుతుంది. శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని అర్థాలు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయ తత్త్వమే శివుడు. సమస్తాన్ని ప్రకాశవంతం చేసే మూల చైతన్యమే శివతత్తం. ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే. ఈ నెల 13న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
Shiva-god
సృష్టి సమస్తాన్నీ తన వశంలో ఉంచుకొన్న సదాశివుడు, సర్వేశ్వరుడు. అతడే ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తులతో కూడిన ఈశ్వరుడు. దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని దూరం చేసేవాడు శివుడు. ఈ కలికాలంలో మానవులు త్రివిధములైన ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, అధి దైవిక అనే దుఃఖాలకు లోనైపోతున్నారు. ఇట్టి ఈతి బాధలను తీర్చేవాడు ఈశ్వరుడొక్కడే. పార్వతీ మాత స్వామిని గురించి వర్ణిస్తూ ఈశ్వరుడొక్కడే సత్యం, మిగతావన్నీ మిథ్య అంటుంది. లోకంలో ప్రతి ఒక్కరు కీడును పోగొట్టుకోవడానికి, సంపదలు పొందడానికి మంగళపదార్థాలైన చందనం మొదలైనవి ధరిస్తారు. కానీ వీటికన్నా ఈశ్వర విభూతి అనంతమైన శక్తి గలదని గ్రహించాలి.

భక్త వరదుడు...

శివుడు భక్త సులభుడు. స్వామిని కలవడం చాలా సులభం. సంపూర్ణ భక్తితో కొలిచిన ప్రతి భక్తుని తనంతట తానుగా వెళ్లి అనుగ్రహించే పెద్ద మనసు స్వామిది. దేవతలకు మానవులకే కాకుండా రాక్షసులకు కూడా తన అనుగ్రహాన్ని పంచిన మనసు ఆయనది. లోకక్షేమం కోసం తాను దేన్నయినా స్వీకరించే తత్వం శివునిది. అందుకే క్షీరసాగర మథనం జరిగినప్పుడు పుట్టిన హాలాహలాన్ని లోక క్షేమం కోసం తన గళంలో బంధించాడు. దేవ మానవ రాక్షసుల క్షేమం కోరి, సృష్టిని దహించే శక్తి కలిగిన విషాన్ని తాను త్రాగాడు. అంతటి ఓపిక, భరించే శక్తి తండ్రికి గాక ఎవరికి ఉంటుంది? అది ఈశ్వర తత్వం అంటే అది పితర భావన. అందుకే ఎంతోమంది భక్తులను అనుగ్రహించి అక్కున చేర్చుకున్నాడు.

రావణాసురుడు స్వామి కోసం తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందగలిగాడు. మూషికాసురునికి తాను కడుపులో జన్మిస్తానని వరమిచ్చాడు స్వామి. భస్మాసురుడికి వరమిచ్చి తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారికి అడిగిన వరాలు ఇచ్చాడు. అదేవిధంగా తనని నమ్మిన భక్తులకు మోక్షాన్ని ప్రసాదించాడు. అక్క మహాదేవి, బెజ్జ మహాదేవి తదితర భక్తురాళ్ళు స్వామిని కొలిచి ఆనంద పరవశంతో తమ జీవితకాలం స్వామిని సేవించి లింగైక్యం పొందారు.

శంకరోతి ఇది శంకరః అంటే శాంతిని కలిగించేవాడు శంకరుడు అని అర్థం. రుద్రుడు అనే శబ్దంలో రౌద్ర అని భావన కనిపిస్తున్నా రౌద్రమంతా ఆధ్యాత్మిక పరిభాషలో అహంకారాన్ని చంపేది అని అర్థం. అహంకారాన్ని చంపి, చిదానందాన్ని కలిగివుండేవాడు శంకరుడు. తన దగ్గరున్న చిదానందాన్ని కోరుకున్నవారికి ఇవ్వడమే స్వామి ఆరాధన ఆంతర్యం. అందుకే అద్వైత సిద్ధిని కోరే మోక్షసాధకులు, భిక్షువులు శివుని ఆరాధిస్తారు. జీవాత్మ పరమాత్మలో కలిసే ప్రక్రియలో సహాయం చేసేవాడు త్రిమూర్తులలో ఈశ్వరుడు ఒక్కడే.

నిరాడంబర తత్వం

ప్రతి జీవి పరమేశ్వరాంశమే. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నదే దీనికి ఆధారం. ఈ సమస్త చరాచర జగత్తు ఆయన అధీనంలోనే ఉంటుంది. సమస్త దేవతల్లో అత్యంత శక్తిమంతుడు, భక్త వల్లభుడు, సులభ ప్రసన్నుడు అయిన శివుడు సృష్టికి ఆధారభూతమైనవాడు. అలాంటి శివుడిని ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో ప్రసన్నుడవుతాడు. లింగాకారంలో, వేటగానిగా, జంగమయ్యగా, భక్తులు కోరుకున్న రూపాల్లో వారి కోర్కెలు తీరుస్తాడు. అంగుష్ట ప్రమాణమగు తేజోరూపం (జ్యోతిర్లింగం) మానవుని హృదయం, సహస్రారం మొదలగు స్థానాల్లో వెలుగుతుందని భారతీయ వేదాంత గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి శివుడు శ్మశానంలో ఉంటూ, అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు స్వామి. మెడలో పాములు ధరించి అందరికి సర్వాభరణాలు ప్రసాదిస్తాడు.

తనను తాను జయించి ప్రపంచానికి మార్గదర్శకుడైనవాడు స్వామి. ఎలాంటి కోరికలు లేనివాడు కనుక స్వామి దిక్కులే అంబరాలుగా కలిగినవాడయ్యాడు. దిగంబరుడు అంటే సకల చరాచర ప్రకృతికి తాను పురుషుడై విరాజిల్లినవాడు. ఆయన సర్వాంతర్యామి. ఒక రూపం గాని, స్థానం గాని లేకుండా ప్రతి జీవిలో తానే ఉన్న స్వామికి ఏ వస్ర్తాన్ని కట్టగలం. దిక్కులు తప్ప ఆయనకు ఏ వస్ర్తాలూ సరిపోవు. పాములను ధరించి నాగాభరణుడై, చంద్రుడిని తలపై ధరించి చంద్రశేఖరుడైనాడు. అందుకే ఎలాంటి కోరికలు లేనివారు. కోరికలను జయించినవారు స్వామి సన్నిధికి త్వరగా చేరుకోగలుగుతారు. నిరాడంబరతే శివతత్వం అన్న విషయాన్ని మనం గ్రహిస్తే ఆ పరమ శివుని చేరినట్లే. ఈ శివరాత్రి పర్వదినాన శివనామస్మరణ చేసుకొంటూ జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని ఆ సదాశివుణ్ణి సర్వదా ప్రార్థిద్దాం.
...?తపోఋషి రాజశేఖర శర్మ
Shiva-Lingam

బుద్ధినిచ్చే విభూతి

ఒంటికి చితాభస్మాన్ని రాసుకుని కోరినవారికి సకల సంపదలను అనుగ్రహిస్తాడు. అందుకే విభూతి భూతిరైశ్వర్యం అంటారు. విభూతిధారణ చేసి ఎవరైతే శివలింగ దర్శనం చేస్తారో వారి సర్వ పాపాలు నశిస్తాయి. ఒక బిల్వ దళాన్ని చేత పట్టుకుని శివ నామాన్ని తలిస్తే ఆ శివలింగ దర్శన భాగ్య ఫలం దక్కుతుందని శివపురాణోక్తి. అభిషేక ప్రియుడైన శివుడి తలపైన కాసిన్ని నీళ్లు పోసి, మారేడు దళంతో అలంకరించి ఇంత విభూతి రుద్దితే అలాంటి భక్తుని ఇంట కల్పవృక్షాన్ని, ఇంటిముందు కామ ధేనువును ప్రసాదించే చల్లటి మనసున్న దేవుడు. ఆయన ధరించే విభూది అంతరార్థం ప్రతి జీవి మరణానంతరం పొందేది బూడిద అన్న సత్యం తెలుపుతుంది. తెల్లని విభూతి జ్ఞానానికి చిహ్నం పరమ శివుడు. జీవుల సంసారిక దుఃఖాలను పోగొట్టేవాడు, రోగ, దరిద్రాలను పోగొట్టే వాడు శివుడు. గ్రహదోషాలు, ఈతి బాధలు శివారాధన తోనే తీరుతాయనేది నిస్సందేహం. పంచ భూతాలకు అధిపతియైన శివుడిని ఆరాధించడం ద్వారా పంచభూతాత్మకమైన దేహచాపల్యం వదిలి, జన్మ సాఫల్యం కలిగే అవకాశం ఆ దేవదేవుడు కల్పించాడు.
shivratri

జాగరణ అంటే?

శివలింగం ఓంకార స్వరూపం. ఓంకారమున ఉండే శివలింగమందే శివార్చన జరుపబడుతుంది. ఈ సంసార సాగరాన్ని తరింపజేసే ఓంకార స్వరూపుడైన రుద్రునికి నమస్కారమంటుంది యజుర్వేదం. దుఃఖభూయిష్టమైన మానవ జీవితానికి తరుణోపాయానికై లింగంపై నీళ్లు పోస్తే చాలు మన కష్టాలు కడతేరుస్తాడట. శివుణ్ణి నిత్యం ఆరాధిస్తే భోగభాగ్యాలు సిద్ధిస్తాయని, దీర్ఘరోగాలు అనుభవించేవారు రుద్రపాఠయుక్తంగా అభిషేకం చేసినట్లయితే దీర్ఘవ్యాధి నుండి విముక్తులవుతారు. శివరాత్రి లింగార్చన, జాగరణ, ఉపవాసం ఎంతో ఉత్కృష్టమైనవి. మానవులు అల్ప విషయ సుఖాల కొరకై జీవితాన్ని ధారపోయక శాశ్వతమైన, పరిపూర్ణమైనట్టి ఆత్మానందాన్ని పొందడానికి సాంసారిక క్లేశాలను అధిగమించడానికి కలియుగంలో శివారాధన ఒక్కటే శ్రేష్ఠమైన మార్గం. ఈ ప్రపంచం అశాశ్వతమనీ, బ్రహ్మమొక్కటే శాశ్వతమనీ గ్రహించి, మన బుద్ధిని మేల్కొల్పడమే జాగరణం.
jay-shree-ram

శివరాత్రి మహత్యం

శివరాత్రి ప్రతియేటా మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నాడు వస్తుంది. ఆరోజున భక్తులు పగలంతా ఉపవాసముండి, రాత్రి జాగారము చేస్తారు. ఆరోజున శివకథలు వినడంతోనూ, కీర్తనలు, భజనలతోనూ, రుద్రాభిషేకంతోనూ జాగరణ చేస్తే శివసాన్నిధ్యాన్ని చేరుకోవచ్చు. పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. మృత్యుంజయుడు. అపమృత్యు నివారణకు శివాభిషేకంలో ఈ శ్లోకం పఠించాలి.
శ్లో : త్య్రంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్!
మాఘ బహుళ చతుర్దశి నాడు జ్వాలా స్తంభంలో తేజోలింగంగా మహాశివుడు ఆవిర్భవిస్తాడు. అందువల్ల ఈరోజున మహాశివరాత్రిగా లోకంలో ప్రసిద్ధి పొందింది.
శ్లో : శివరాత్రి మహారాత్రం నిరాహారో జితేంద్రియః
అర్చయే ద్వా యథాన్యాయం యథా బలమవంచకః
యత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్శనాత్.
శివరాత్రి పర్వదినాన దివారాత్రాలు ఉపవాసముండి, ఇంద్రియ నిగ్రహంతో విధి విధానంగా శివుని అర్చించేవారు ఒక సంవత్సర కాలం శివుని పూజిస్తే వచ్చే ఉత్తమ ఫలాన్ని శివరాత్రినాడు ఒక్కరోజే పొందగలరు. శివసాన్నిధ్యం చేరుకోగలరు.

ఓం నమశ్శివాయ!

శ్రీరాముడు త్రేతాయుగంలో, శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో శివుని పూజించి, తమ కోరికలను నెరవేర్చుకున్నారు. ఓం నమశ్శివాయః అనే పంచాక్షరీ మంత్రంలో శివునికి పంచభూతాత్మకమైన సర్వవ్యాపకత్వం కలదని తెలియుచున్నది. అక్షరాల్లో ఓం పరమశివుడు, న - నభము (ఆకాశం), మ - మరుత్తు (గాలి), శి- శిఖ (అగ్ని), వ - నీరు, య - పృథ్వి అనే అర్థాలు కలవు.
లింగ పురాణంలో ఈ పర్వదినాన్ని గూర్చి శివుడు ఇలా చెప్పాడు, ఈ పర్వదినం రోజున ఎవ్వడైనను తెలిగాని, తెలియక గాని పరమేశ్వరుని ఆరాధించినచో వాడెంత పాపాత్ముడైనను సరే సర్వ పాపాల నుండి విముక్తుడై మోక్షాన్ని పొందగలడు. వ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో శివపురాణం ఒకటి. అందులో -
శ్లో : పఠనాచ్ఛ శ్రవణా దస్య భక్తి మాన్నద సత్తమః
సద్య శివప్రద ప్రాప్తిం లభ్యతే సర్వసాధనాత్
అంటే, శివపురాణాన్ని భక్తి శ్రద్ధలతో పఠించేవారు, ఆలకించేవారు, శివుని ఆరాధించేవారు మానవుల్లో ఉత్తములై ఈ లోకంలో అన్ని సుఖాలు పొంది, మరణానంతరం శివ పదాన్ని చేరుకుంటారు.
శ్లో : శ్రుతి స్మృతి పురాణా నామాలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం.
అంటే, వేదాల్లో, స్మృతుల్లో, పురాణాల్లో మూల స్వరూపుడిగా కీర్తింపబడి, శుభాలను ఇచ్చే శంకర భగవానుని పాదారవిందాలకు మ్రొక్కుచున్నాను.
...?డా. రాపాక ఏకాంబరాచార్యులు

1303
Tags

More News

VIRAL NEWS