పట్నవాసమా? పల్లె జీవనమా?


Thu,February 8, 2018 10:59 PM

Buddha-margam
పల్లెల కంటే పట్టణాల్లో సౌకర్యాలు ఎక్కువ అనుకుంటారు పల్లెవాసులు. పట్టణాల కంటే పల్లెల్లో సుఖం ఎక్కువ అనుకుంటారు పట్టణవాసులు. పట్టణాల్లో అవకాశాలు ఎలా ఎక్కువో, అవసరాలూ అలాగే ఎక్కువ. రాబడికి మించిన ఖర్చులు పట్టణాల్లో తప్పనిసరి. అలాగే పల్లెల్లో అవకాశాలూ తక్కువే, అవసరాలూ తక్కువే.
అనాదిగా మనుషులు ఈ రెండు రకాల జీవనగతుల మధ్య ఎంపిక విషయంలో తర్జన భర్జనలు పడుతూనే ఉంటారు. కొట్టుమిట్టాడుతూనే గడుపుతున్నారు.
మనిషి దైహిక అవసరాలు పట్టణాలూ, నగరాలూ తీర్చగలవు. కానీ మానసిక ప్రశాంతతని గ్రామాలే అందివ్వగలవు. ముఖ్యంగా ప్రకృతికి, ప్రశాంతతకి మనల్ని గ్రామాలు ముడిపెట్టగలవు.
ఎక్కడ జీవనం బాగుంటుంది? అనేది ఇప్పటి సమస్య కాదు.. ఎప్పటి నుండో వస్తున్న సమస్యే.
వైశాలి నగరం వజ్జి గణతంత్ర రాజధాని. ఆ నగరానికి దూరంగా ఒక బౌద్ధ సంఘ ఆరామం ఉంది. ఆ ఆరామంలో ఒక యువ భిక్షువు ఉన్నాడు. ఆరోజు కార్తీక పున్నమి. కృత్తికా నక్షత్ర ఉత్సవం వైశాలి నగరంలో జరుగుతోంది. నగరాన్నంతా అలంకరించారు. రాత్రివేళ ఆ నగరం దీపాలతో మిలమిలలాడుతోంది. ఆకాశానికి తారాజువ్వలు లేచి వెలుగులు విరజిమ్ముతున్నాయి. సంగీత ధ్వనులు, అరుపులు, కేరింతలు..
ఈ సందడి అంతా దూరంగా ఆరామంలో ఒక కొండ అంచున కూర్చొని తిలకిస్తున్నాడు ఆ యువ భిక్షువు. ఆ సంరంభానికి అతని మనస్సు చలించింది. ఈ మారుమూల ప్రాంతంలో ఈ కఠోర భిక్షు జీవనాన్ని సాగిస్తున్నాను. నియమ నిబంధనతో బ్రతకాల్సి వస్తుంది అని దిగులుపడ్డాడు. అతని నిర్వేదాన్ని అర్థం చేసుకున్న తోటి భిక్షువు.
మిత్రమా! ఆ జీవనం ఉత్తమమైందని ఎందుకు భావిస్తున్నావు? విందులూ, వినోదాలూ తృష్ణని పెంచుతాయి. పంచశీలను భగ్నం చేస్తాయి. చివరికి దుఃఖానికి కారణమవుతాయి. మనుషుల్లో ఇలాంటి ఊగిసలాట సహజం. మనకంటే అధోగతిలో బ్రతికేవారుంటారు. వారి జీవనం నరకం అనుకుంటాం. మనకంటే విలాసాలు సాగించేవారుంటారు. వారిది స్వర్గం అనీ భ్రమపడతాం. ఇలా ప్రతివారూ ఆలోచిస్తూనే ఉంటారు. వీటన్నింటి కంటే తృష్ణల్ని వదిలించుకున్న జీవనమే శ్రేయోదాయకం. శరీరాన్ని అతిగా కష్టపెట్టడం, అతిగా సుఖపెట్టడం రెండూ సరైన మార్గాలు కావు. మనం భిక్షువులం. మన ఏకాగ్రతకి ఈ ప్రశాంత వాతావరణమే మేలు అని చెప్పాడు.
ఆ యువ భిక్షువు తన ఆలోచనల్ని మానాడు. ఆ మరుసటి రోజు వారు బుద్ధుని దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. అప్పుడాయన -
సద్దోశీల్యే సంపన్నో - యసో భోగ సమప్పితో
యం యం పదేసం భజతి - తత్థ తత్థేవ పూజితో
శ్రద్ధ, శీల సంపన్నత, యశస్సు గలవారు భోగాల్ని వదిలినవారు ఎక్కడున్నా ఒక్కటే. వారికి ఎక్కడైనా గౌరవం దక్కుతుంది అని చెప్పాడు.
ఒకచోట నివసించడం గొప్ప. ఒకచోట జీవించడం అధమం కాదు. ఎక్కడైనా శీల సంపన్నతతో జీవించడమే గొప్ప అని చెప్పిన బుద్ధ ప్రబోధం ఆ ఇద్దరికీ జ్ఞానోదయం కలిగించింది.
...?బొర్రా గోవర్ధన్

1498
Tags

More News

VIRAL NEWS