దయ, జాలి, కరుణ, సానుభూతి అన్నవి మనుషులకు తప్పనిసరిగా ఉండవలసిన సుగుణాలు. ఇవి లేనివారిని మనం సాధారణంగా శిలా హృదయులు అంటూ ఉంటాం. మానవ హృదయంలో ఏ మేరకు ఈ గుణాల ప్రభావం ఉంటుందో ఆ మేరకైనా వారు శుభకరులే. ఎవరిలోనైతే ఈ సుగుణాలు ఉండవో వారు దైవకారుణ్యానికి దూరంగా ఉంటారు. ఎవరి హృదయంలోనైనా సాటి మనుషుల పట్ల జాలి, కరుణ, సానుభూతి ఉండదో అలాంటివారిని అల్లాహ్ తన ప్రత్యేక కారుణ్యానికి దూరంగా ఉంచుతాడు. అందుకే కారుణ్య హృదయులు, దయాగుణం కలవారిపై కరుణామయుడైన అల్లాహ్ కరుణ చూపుతాడు. కనుక భూలోక జీవజాలంపై మీరు దయజూపండి. పైవాడు మిమ్మల్ని కరుణిస్తాడు అన్నారు ముహమ్మద్ ప్రవక్త (స).
ఒక వ్యక్తి కాలినడకన ఎటో వెళ్తున్నాడు. మార్గమధ్యలో అతనికి బాగా దాహం వేసింది. అలా కొంతదూరం వెళ్లిన తరువాత అతనికో బావి కనిపించింది. బావిని చూడగానే అతనికి ప్రాణం లేచొచ్చింది. తీరా చూస్తే నీళ్లు తోడుకోవడానికి అక్కడ ఎలాంటి సాధనమూ లేదు. బాగా అలసిపోయి ఉన్నాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. మరికాసేపాగితే ఊపిరిపోయేలా ఉంది. శక్తినంతా కూడాదీసుకుని ఎలాగోలా బావిలోకి దిగాడు. కడుపారా నీళ్లు తాగి పైకొచ్చేశాడు.
పైకి రాగానే, తీవ్రమైన దాహంతో నాలుక బయటకు చాచి, భయంకరంగా ఒగురుస్తూ కనిపించిందో కుక్క. దాహానికి తాళలేక కాస్తంత తడితడిగా ఉన్న బురద నాకుతోంది. దాన్ని ఆ స్థితిలో చూడగానే కొన్ని క్షణాల ముందు తన పరిస్థితి గుర్తుకొచ్చిందతనికి. అది కూడా తనకులాగే తీవ్రమైన దప్పికతో బాధపడుతోందని మనసులో అనుకున్నాడు. అతనికి కుక్కపై జాలి కలిగింది.చేతకాకున్నప్పటికీ శ్రమకోర్చి మళ్లీ బావిలోకి దిగాడు. తన మేజోళ్లలో నీళ్లు నింపుకొని వాటిని నోటకరచిపట్టుకొని పైకెక్కాడు. ఆ నీటిని దాహంతో తల్లడిల్లుతున్న ఆ కుక్కకు తాగించాడు. ఈ ఆచరణ దైవానికి అమితంగా నచ్చింది. అతని జీవకారుణ్యాన్ని, అతని శ్రమను దేవుడు గుర్తించి, ఆ సదాచరణకు బదులుగా అతణ్ణి క్షమించివేస్తున్నట్టు ప్రకటించాడు.
అల్లాహ్ మానవుల బాహ్య ఆచరణల కన్నా అంతరంగాన్ని తరచి చూస్తాడు. కేవలం కుక్కకు నీళ్లు తాగించినంత మాత్రాన అతడు దేవుని మన్నింపునకు పాత్రుడయ్యాడని అనుకోకూడదు. ఒక మూగజీవిపై అతని మనసులో పెల్లుబికిన దయ, కరుణ, సానుభూతి, సంకల్ప శుద్ధి.. ఇవి దైవానికి నచ్చాయి. అతని తపనను దేవుడు మెచ్చుకొని అతణ్ణి క్షమించివేశాడు. తన కారుణ్యానికి పాత్రునిగా చేశాడు.
...?మదీహా అర్జుమంద్