సంపూర్ణ శరణాగతి


Thu,January 25, 2018 11:01 PM

భగవంతుని చేరడానికి ముఖ్యమైన అడ్డంకి అహంభావం. ఆ అహంకారాన్ని వీడి శరణు వేడితే ఆ భగవంతుడే దిగివచ్చి, భక్తుని వశమౌతాడు. సంపూర్ణ శరణాగతి పొందడమే ఆయన్ని చేరే సూటిమార్గం అని చెప్పే కథే గజేంద్రమోక్షం.
sharangati
పూర్వం ఒక మహారణ్యంలో మృగరాజైన సింహాన్ని తరిమేసి, అన్ని మృగాలకూ తానే రాజై, ఆ వనంలో ఒక బలిష్టమైన గజరాజు యథేచ్ఛగా విహరిస్తూ ఉండేవాడు. ఒకనాడు గజేంద్రుడు తన ప్రియురాళ్లతో కలిసి, ఆ వనంలోని ఒక సరస్సులో జలక్రీడలాడడానికి బయలుదేరాడు. ఆ ఏనుగుల గుంపును చూసి మిగిలిన జంతువులు భయంతో అటూ ఇటూ పరుగెత్తి పోయాయి. గజేంద్రుడు తన సఖులతో కలిసి జలక్రీడలాడుతుంటే సరస్సులోని జలచరాలు కూడా భయంతో దిక్కుతోచక, మాకెవరు దిక్కని బిక్కుబిక్కుమంటూ తిరుగసాగాయి. కొద్దిసేపటికి ఆ జలచరాలకు నేనున్నాను అన్నట్టుగా ఒక మొసలి రివ్వున నీటిలో నుంచి పైకి వచ్చి గజేంద్రుని కాలును ఒడిసి పట్టుకుంది. ఎంత ప్రయత్నించినా గజేంద్రుడు మొసలి దంతాల్లో చిక్కుకున్న తన కాలును కదల్చలేక, అడవి ప్రతిధ్వనించేట్టుగా ఘీంకారం చేశాడు. ఆడ ఏనుగులన్నీ నిస్సహాయంగా విచారిస్తూ ఉండిపోయాయి. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఇక తన ప్రాణవాయువులు అనంతంలో కలిసిపోయే సమయం దగ్గర పడిందని గ్రహించాడు గజేంద్రుడు. పూర్వజన్మ సుకృతం వల్ల కలిగిన స్థిత ప్రజ్ఞత వల్ల ఈశ్వర తత్వం గ్రహించి, విష్ణువును శరణు కోరాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తొండం పైకి చాచి, భక్తిపూరితమైన ఏకాగ్రతతో శ్రీమహావిష్ణువును పరిపరి విధాలుగా ప్రార్థించడం మొదలుపెట్టాడు.

నీ అహంభావమే నిన్ను ఏనుగు జన్మలో కూడా వెంటాడి, మొసలి రూపంలో బాధపెడ్తుంది. నీక జ్ఞానోదయమౌతుంది. ఆ మొసలి మరణమే నీకు శాపవిమోచనం అని చెప్పాడు భరధ్వాజుడు.

తన ప్రయత్నం అంతా హరించిన తరువాతనే పూర్తి శరణాగతితో గజరాజు ఏకాగ్రతతో చేస్తున్న దీనాలాపాలు వైకుంఠపురంలో లక్ష్మీసమేతుడై ఏకాంతవాసంలో ఉన్న మహావిష్ణువును చేరాయి. విష్ణువు వెంటనే ఉన్నపళంగా దిగ్గున లేచి, చేతిలో ఉన్న లక్ష్మీదేవి చీర చెంగుతో సహా భూలోకానికి పయనమయ్యాడు. ఏం జరిగిందో తెలియక ఆయన వెంట లక్ష్మీదేవి, గరుత్మంతుడు, శంఖుచక్రాలు, ఇతర దేవగణమంతా బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియదు ఒక్క ఆ ఆర్తత్రాణపరాయణునికి తప్ప. గజేంద్రుడు ఉన్న సరస్సు గట్టుకి వచ్చి, వెంటనే తన చక్రాయుధాన్ని స్మరించుకున్నాడు. భగవానుని ఆజ్ఞ కొరకే ఎదురుచూస్తున్న సుదర్శన చక్రం ఒక్కసారిగా నిప్పురవ్వలు వెదజల్లుతూ నీటిలోకి వెళ్లి, గజేంద్రుని కాలు పట్టుకున్న మొసలి శిరస్సును ఖండించివేసింది. బతుకుజీవుడా! అనుకుంటూ గజేంద్రుడు విభ్రమంగా చుట్టుపక్కల దృష్టి సారించాడు. మహావిష్ణువును చూస్తూనే నీటి నుండి బయటికి వచ్చి, తొండంతో నీరు తీసుకుని ఆ దేవదేవుని పాదాలు కడిగి, నీటిని శిరస్సుపై చల్లుకుంది. స్వామి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణాలు చేసింది. ఆడ ఏనుగులు కూడా భక్తితో మహావిష్ణువుకు నమస్కరించి, గజేంద్రుని పక్కన సంతోషంగా నిల్చున్నాయి.

విష్ణువు గజేంద్రుని శిరస్సు నిమురుతూ, గజరాజా! పూర్వజన్మలో ఏర్పడిన శాప కారణంగా నీవు ఈ మకరిచే పీడింపబడ్డావు. నీవు వెనకటి జన్మలో ఇంద్రద్యుమ్న మహారాజువు. అప్పుడు నా గురించి తపస్సు చేస్తూ ఉండగా వచ్చిన భరధ్వాజ మునిని నీవు లక్ష్యపెట్టలేదు. అందుకాయన నిన్ను ఏనుగువై జన్మించమని శాపం ఇచ్చాడు. నీవు ప్రార్థించగా ఆయన, నీ అహంభావమే నిన్ను ఏనుగు జన్మలో కూడా వెంటాడి, మొసలి రూపంలో బాధపెడ్తుంది. నీక జ్ఞానోదయమౌతుంది. ఆ మొసలి మరణమే నీకు శాపవిమోచనం అని చెప్పాడు భరధ్వాజుడు. ఇప్పుడు నీకు అహంభావ నాశం జరిగింది. ఇక నీవు ఇంద్రద్యుమ్నునిగా నీ రాజ్యమైన ద్రవిడ దేశానికి వెళ్లి, ధర్మబద్ధంగా రాజ్యపాలన సాగించు అని విష్ణువు ఆప్యాయంగా అన్నాడు.
ఇంద్రద్యుమ్నుడు తన భార్యలతో సహా శ్రీమహావిష్ణువును స్తోత్రం చేస్తూ ఉండగా వాళ్లను దీవించి మహావిష్ణువు అంతర్థానమయ్యాడు.
ఈ కథను నారదుడు పాండవులతో చెప్పాడు. అహంకార రాహిత్యంతో భగవంతుని సంపూర్ణ శరణాగతి పొందితే ఆయన ఎప్పుడూ వెన్నంటే ఉంటాడనడానికి నిదర్శనం ఈ కథ.
...?గండవరపు ప్రభాకర్

1062
Tags

More News

VIRAL NEWS