వర్తమానమే వాస్తవం!


Thu,January 25, 2018 10:55 PM

spiritual-hd
తనువుతో కూడి ఉన్నవన్నీ ఏదో ఒకనాడు ఊడిపోయేవే. వీడిపోయేవే. తనువుతో ఏర్పడే బాంధవ్యాలన్నీ తెల్లవారేవే. ఇదంతా వేదాంతమే. కేనోపనిషత్ బోధించేది ఇదే. జరుగుతున్నదంతా తనవల్లనేనన్న అహంకారంతో మనిసి తన మూలశక్తిని విస్మరిస్తుంటాడు. జరగనిదానికంతటికీ ఎవరినో బాధ్యులను చేస్తూ ఆత్మవంచన చేసుకుంటాడు. ఎదుగుతున్న కొద్దీ, ఎరుగుతున్న కొద్దీ జీవితానుభవాలు అంతరంగంలో తారాడుతున్నప్పుడల్లా తనను తాను విశ్లేషించుకునే దశలో, తాను నిమిత్తమాత్రుడనని, తనను ఏదో శక్తి నడిపిస్తున్నదని గ్రహిస్తాడు. మనసుకు లొంగకుండా ఆ స్పృహను విస్తృతం చేసుకుంటుంటే అభిజాత్యం నశించి, అహం స్ఫురణను అనుభవ పరిధిలోకి తెచ్చుకోగలుగుతాడు. ఆ సందర్భంలోనే మనిషికి రెండు మార్గాలు ఎదురవుతాయి. ఒకటి తరించే మార్గం. మరొకటి అంతరించే మార్గం. తరించే మార్గం సులభమైనది. అంతరించే మార్గం సంఘర్షణాత్మకం. జీవిత సంగ్రామ రంగం వైరుధ్య సంభరితం. అన్ని వైవిధ్య వైరుధ్యాల మధ్య మనిసి తనను తాను సహజంగా నిలబెట్లుకోవాలి. భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులను సమన్వయంగా సమపాళ్లలో వినియోగించగల నేర్పును మనిషి అలవరుచుకోవాలి. కర్తవ్య నిర్వహణాదక్షత, మనోలయం, ఆత్మ నిగ్రహం వంటి భౌతిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మికతలను వివరిస్తూ, ఇవన్నీ జయప్రదం కావడానికి ఆధార భూమిక నైతికత, శీల సంపద అవశ్యమని కేనోపనిషత్ బోధిస్తుంది.

విషయ వాంఛలను విష్ణు వాంఛగా, అరిషడ్వర్గాలను హరిషడ్వర్గాలుగా మార్చుకుంటూ మనిషి, చిత్తశుద్ధిని తన సహజ శక్తిగా, లక్షణంగా వినియోగించుకోవాలి. తద్వారా మోహక్షయాన్ని సాధించుకోవాలి. మోహక్షయమే మోక్షం. ఏతావాతా, మనిషి అన్నింటినీ అర్థం చేసుకుని ఆచరించవలసిన అధ్యాత్మ సాధనా రీతులను పునఃపునః స్మరించుకుంటుండాలి. జరుగుతున్న ప్రతి సంఘటనను సాక్షిగా చూడగలగడం, జరుగుతున్న ప్రతి విషయం వెనుక బలీయమైన ఏదో శక్తి ఉన్నదని గ్రహించగలగడం జీవితాన్ని అధ్యాత్మమయం చేసుకోగలగడం, జీవితాన్ని అధివాస్తవికంగా జీవించగలగడం, ఆశాభంగాలకు వేరెవరో కారణం కాదని, స్వీయ నిర్వహణా లోపమేనని గ్రహించి, అలసత్వం ఒదులుకోగలగడం.. వంటి ఆచరణీయ మార్గదర్శకాలను స్వీకరించగలిగితే ఆధునిక సమకాలీన సమాజం, భవ్య నవ్య దివ్య భవిష్యత్తును నిర్మించుకోగలదు. జరిగిపోయినదంతా స్ఫూర్తిప్రదం కావాలి. జరుగుతున్నదంతా ఆనందమయం కావాలి. అప్పుడు జరగబోయేదంతా ఆశావహమై జీవితాన్ని నడిపిస్తుంది. జరిగిపోయినదంతా స్ఫూర్తిప్రదం కావాలి. జరుగుతున్నదంతా ఆనందమయం కావాలి. అప్పుడు జరగబోయేదంతా ఆశావహమై జీవితాన్ని నడిపిస్తుంది.
...?వి. ఎస్. ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

1090
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles