బాల భిక్షువు - బోడి గుండు!


Thu,January 25, 2018 10:54 PM

Buddhamargam
బౌద్ధ సాహిత్యంలో బుద్ధుణ్ణి శాస్త అని ఎక్కువగా సంబోధిస్తారు. శాస్త అంటే మహా గురువు అని అర్థం. స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఎవరెవరికి ఎలా చెప్పాలో అలా చెప్పే ప్రజ్ఞాశాలి బుద్ధుడు. పండితుల నుండి పామరుల వరకు, పెద్దల నుండి చిన్న పిల్లల వరకు ఎంత జటిలమైన విషయాన్నైనా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పేవాడు. ఒకనాడు ఒక బాల భిక్షువు విశాఖ మాత ఇంటికి వెళ్లాడు. శ్రావస్తి నగరంలోని బౌద్ధ పోషకుల్లో ఆమె కూడా ఒకరు. ఆమెకు ఒక మనుమరాలుంది. ఆ పిల్ల కూడా ఇంచుమించు బాల భిక్షువు వయస్సు గలదే. ఆమె అద్దంలో తన ముఖం చూసుకుని పకపకా నవ్వుకొంది. ఆమె నవ్వును చూసి బాల భిక్షువు కూడా పెద్దగా నవ్వాడు. ఆ అమ్మాయికి కోపం వచ్చింది. వెంటనే చిటపటలాడుతూ.. ఓయ్! బోడిగుండూ! ఎందుకు నవ్వావు? అని కసురుకుంది. నన్నెందుకు బోడిగుండు అన్నావు. నీవే బోడిగుండు. మీ నాన్న బోడిగుండు. మీ అమ్మ బోడిగుండు. మీ ఇంట్లో అందరూ బోడిగుళ్లే అన్నాడు కోపం పట్టలేక. దానితో ఆ పిల్ల ఏడుస్తూ ఇంట్లోకెళ్లి నానమ్మ విశాఖ మాతకు బాలభిక్షువు తిట్టాడు అని విషయం చెప్పింది. ఏడుస్తున్న మనుమరాలిని ఓదార్చుతూ.. ఓ బాల భిక్షూ! మా పిల్ల అన్నదాంట్లో తప్పేముంది! ఉన్నమాట అంటే కోపం ఎందుకు? అంది, దాంతో మనుమరాలు శాంతిస్తుందేమోనని. కానీ మనుమరాలు ఏడుపు మానలేదు. ఇంతలో ఆ బాలభిక్షువుకి శిక్షణ ఇచ్చే పెద్ద భిక్షువు వచ్చి, విషయం తెలుసుకుని, ఆయన కూడా బాల భిక్షువుకి సర్దిచెప్పాడు.

కానీ బాల భిక్షువు శాంతించలేదు. విశాఖమాతకు తిరుగు సమాధానం చెప్తూ ఉడుకుదనం వెళ్లగ్రక్కుతున్నాడు. విశాఖ, పెద్ద భిక్షువులు ఇద్దరూ ఇటు బాల భిక్షువుని శాంతింపచేయలేకపోయారు. అటు పిల్లనూ ఓదార్చలేకపోయారు. కొంతసేపటికి బుద్ధుడు వచ్చి, విషయం తెలుసుకుని చిరునవ్వుతో.. విశాఖ వైపు తిరిగి -ఉపాసికా! విశాఖ మాతా! ఈ బాల భిక్షువు బుద్ధ పుత్రుడు. నా పుత్రుణ్ణి బోడిగుండూ అని అనడం తప్పు కదా! అతను ఎందుకు బోడిగుండు చేయించుకున్నాడు? భిక్షువుగా జీవించడానికే కదా! మరోదానికి కాదు గదా! అతని బోడిగుండు గౌరవనీయమే! అంటూ బాల భిక్షువుని దగ్గరకు తీసుకున్నాడు. ఆ మాటలు బాల భిక్షువుని శాంతింపచేశాయి. చిరునవ్వుతో భగవాన్! మీరొక్కరే నన్ను అర్థం చేసుకున్నారు అంటూ నమస్కరించాడు. అతను శాంతించడంతో మెల్లగా ఆ అమ్మాయీ శాంతించింది. బాల భిక్షుల మీద గౌరవం కలిగింది. భిక్షువులకు నమస్కరించి, నానమ్మ వెనక్కి వెళ్లి నిలబడింది. బుద్ధుడు పెద్ద భిక్షువులతో భిక్షూ! అతని మనస్సు శాంతించింది. కుదుటపడింది. శ్రద్ధాళువు కాగలడు. నీవు అతనికి ధర్మం ప్రబోధించవచ్చు అని చెప్పాడు. బాల భిక్షువు పెద్ద భిక్షువు వైపు తిరిగి నమస్కరించాడు.
...?బొర్రా గోవర్ధన్

1195
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles