ఆరోగ్యం.. ఆధ్యాత్మికం.. సంక్రాంతి సంబురం


Thu,January 11, 2018 11:46 PM

పుష్యమాసంలో అన్ని రోజులూ పండుగ రోజులే. ముఖ్యంగా సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతిని పండుగగా జరుపుకొంటాం. అందుకే దీన్ని రవి సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి వస్తున్నదంటే ముందు నెల రోజుల నుంచే పండుగ హడావిడి మొదలవుతుంది. ఒకపక్క ధనుర్మాస వ్రతం, మరో పక్క రంగవల్లులతో ప్రతి ఇంటా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంది. సకల శోభలను తీసుకువచ్చే సంక్రాంతి పండుగ ఆరోగ్యాన్నీ తెస్తుందంటారు. ముగ్గుల్లో ఆరోగ్యం, ఇంటికొచ్చిన పంటల్లో కొత్త వాసనలు, ఆత్మీయుల సమ్మేళనం, అప్పాల ఘుమఘుమలు.. సంక్రాంతి వేడుకలు ఇంతింతని చెప్పలేం. దేశ వ్యాప్తంగా కూడా పలుచోట్ల సంక్రాంతి పండుగను రకరకాల సంప్రదాయాలతో జరుపుకొంటారు. ఈ సంక్రాంతి స్పెషల్‌గా పండుగ విశేషాలు...
sankranthi
ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర, పుష్యమాసాల్లో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమనీ, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయణమనీ అన్నారు. సంక్రమణ అంటే ఒకచోటి నుంచి మరో చోటికి జరిగే మార్పు అని అర్థం. సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ధనూరాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.

సంక్రాంతి పండుగలో ముందుగా వచ్చేది భోగి పండుగ. భోగం గలది కాబట్టి భోగి అంటారు. భోగిరోజున బాగా గుర్తుండేవి భోగి పళ్లు, భోగి మంటలు. ఈరోజు కొత్త బియ్యం, పెసర పప్పు కలబోసి కిచిడి తయారుచేసి భోగి పురుషునికి నైవేద్యం పెడుతారు. భోగి పండుగ నాడు తెల్లవారుజామున స్నానానంతరం ప్రతి ఇంటి ముంగిట మంటలు వేస్తారు. ఈ మంటలలో ధనుర్మాసం నెల రోజులూ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెడితే వచ్చే పిడకలను దండలుగా గుచ్చుతారు. వాటిని, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తని అక్కరకు రాని చెట్టు మొద్దుల్ని గుండంలో పడేసి భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటలతో పాతకు స్వస్తి చెప్పి, కొత్తకు స్వాగతం చెబుతారు.

ఇది భోగ వాంఛ గలవారు చేసే అగ్ని పూజ. దీన్ని చేస్తే యజ్ఞం చేసినట్లు. శ్రీయమిచ్ఛేత్ హుతాశనాత్ అనేది వైదిక మంత్రం. అగ్ని నుండి సిరి సంపదల్ని ఆశించాలని ఆ మంత్రానికర్థం. సాయంత్రం బొమ్మల కొలువు పెడుతారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. నానబెట్టిన శనగలు, పూలరేకులు, చిన్న రేగుపళ్లు, చిల్లర పైసలు, అక్షింతలు కలిపి చంటిపిల్లల తల చుట్టూ మూడుసార్లు తిప్పి తల మీద పోస్తారు. వీటితో పాటు చెరుకు ముక్కల్నీ పోస్తారు. ఈ కార్యక్రమం ఆహ్లాదకరాన్ని ఇవ్వడమే గాక భోగిపళ్లలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉంటాయి.

ముగ్గుల్లో సైన్స్!

ఈ రోజుల్లో తెలుగు వాకిళ్లలో కళాకాంతులు నింపే ముగ్గులు ఆత్మనివేదన రూపాలని భావిస్తారు. దీనిలో ఆరోగ్య, ఖగోళ, జ్యోతిష విజ్ఞాన రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. ఈ నెల రోజుల పాటు వాకిట్లో వేయాల్సిన ముగ్గులను గురించి పురాణాలు వర్ణించాయి. ఈ ముగ్గుల సంకేతాలలో సైన్స్ దాగివుందని అర్చనా శాస్త్రి అనే రచయిత్రి తన పరిశోధనలో నిరూపించారు. ఈ ముగ్గులలో పాము ముగ్గులు, చుక్కల ముగ్గులని ముఖ్యంగా రెండు రకాలుంటాయి. కేరళలో పాముల ముగ్గులకు పాశస్త్యం ఎక్కువ. తెలుగువాళ్లు చుక్కల ముగ్గులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చుక్కని సంస్కృతంలో బిందువు అంటారు. బిందువు అనేది రూపం కావొచ్చు, నాదం కావొచ్చు. అది కూడా సృష్టికి సంకేతమే. ముగ్గు వేయడం ఒక కళాత్మక విజ్ఞానమని దానిలో ప్రకృతి పరిశీలన, ఆత్మ నివేదన ఉన్నాయని తాత్తికులు అంటారు.
sankranthi2
మకర సంక్రాంతికి సాదరంగా రథంపై వీడ్కోలు చెప్పినట్లుగా ఉండే రథం ముగ్గును కనుమ రోజున వేస్తారు. భోగిరోజు బలి చక్రవర్తి భూలోకంలోకి వస్తాడని, సంక్రాంతి రోజు రాజ్యం ఏలి, కనుమనాడు వెళ్లిపోతాడని ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పేడ నీళ్లతో గృహ ప్రాంగణాన్ని అలికి, శుభ్రం చేసి, గుల్ల సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. పేడ, ముగ్గులలోని కాల్షియం క్రిమి కీటకాల సంహారానికి తోడ్పడుతుంది. శరీరంలోని అనేక రోగాలను నిగ్రహించే శక్తిని దీని వాసన ప్రసాదిస్తుంది. ముగ్గులలోని కళాత్మకత, కళ్లకు సంబంధించిన నరాలను ప్రేరేపించి, సంతోష భావాన్ని మెదడుకు అందిస్తుంది. మొత్తానికి రంగవల్లులను దిద్దడం అనేది ఒక కళయే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే మహత్తర సాధనం.

స్నేహం పెంచే పండుగ

సంక్రాంతి రోజు ఉదయం నువ్వులు, బెల్లం తింటారు. బెల్లం లాగా తియ్యగా మాట్లాడుతూ, సహృదయంతో, పరోపకార బుద్ధితో జీవించాలని అర్థం. నువ్వుల నుండి నూనె వస్తుంది. నూనెకు స్నేహం అనే పేరుంది. స్నేహంగా అందరూ కలిసి మెలిసి జీవించాలని నువ్వులు చెప్తున్నాయి. వైద్యశాస్త్రంలో కూడా చలిని అణచడానికి నువ్వులు, నూనె ప్రయోగం గురించి చెప్పబడింది. సంక్రాంతి సమయంలో ఏయే దానాలు చేస్తారో ఆ వస్తువులన్నీ సూర్యప్రసాదం వల్ల పై జన్మలో లభిస్తాయని నమ్మకం. సంక్రాంతి వెళ్లిన మరునాడు కనుమ పండుగ. ఇది పశువుల పండుగ. మనకు ఎంతో మేలు చేసే పశువులకు కృతజ్ఞతగా పశువుల కొమ్ములకు, బండ్లకు రంగులు వేస్తారు. పశువులను పూజిస్తారు. మరుసటి రోజు ముక్కనుము. సంక్రాంతి పండుగ మూడు రోజులు వెళ్లిన అనంతరం మహిళలు చేసే వ్రతం సావిత్రి గౌరీ వ్రతం. దీనినే బొమ్మల నోము అని కూడా అంటారు.
kites

దేశవ్యాప్తంగా సంక్రాంతి...

-మహారాష్ట్రలో తీల్‌గూల్ అనే పేరుతో నువ్వులతో హల్వా చేసి, ఇంటింటికీ పంచుతారు. నువ్వులు, బెల్లం, చక్కెర కలిపి ఆల్‌గుడ్, ఆల్‌లడ్డూలు అని చేస్తారు. వీటిని ఆల్‌గుళ్‌ఘ్యా, గోడ్ గోడ్ బోలా అని ఒకరికొకరు చెప్పుకుంటూ పంచుకుంటారు. పాత కోపాలు మరిచిపోయి స్నేహంగా ఉండాలని దీని అర్థం. పెళ్లయిన ఆడవాళ్లకు ఒక కొత్త పాత్రను బహుమతిగా ఇస్తారు. ఈ వేడుకను హల్డీ కుంకుమ్ అంటారు. మన దగ్గర పసుపుబొట్ల లాగ అన్నమాట.
-గుజరాతీలు కూడా నువ్వులు, మిఠాయిలు పంచిపెడతారు. పండుగ నాడు పెద్దలందరూ చిన్నవాళ్లకు బహుమతులు ఇవ్వడం ఇక్కడి ఆచారం. అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం కూడా జరుగుతుంది. రాత్రిపూట తుకల్ అనే దీపాల గాలిపటాలను ఎగరేస్తారు.
-పంజాబ్‌లో ఈరోజున మిఠాయిలతో గోపాల వ్రతం చేస్తారు. మకర సంక్రాంతికి ముందురోజున లోడి అనే ఉత్సవం జరుపుతారు. ఈరోజున వారు హోలి పండుగ లాగా ప్రతీచోట మంటలను వేసి, వాటిలో కాలుతున్న కట్టెలను నేలపై బాదుతూ ఆనందిస్తారు. భోగి పండుగను లోహరిగా జరుపుకొంటారు. పెద్ద పెద్ద మంటలు వేసి, వాటిలోకి మిఠాయిలు, చెరుకు గడలు, బియ్యం విసిరేస్తారు. అక్కడ మకర సంక్రాంతి ఉత్సవాన్ని మాఘీ అంటారు. చిన్నా పెద్దా అందరూ కలిసి భాగ్రా నృత్యం చేసి, విందు చేసుకుంటారు.
-ఉత్తర్ ప్రదేశ్‌లో సంక్రాంతిని పుణ్యదినంగా భావిస్తారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే ప్ర యాగలో స్నానం చేయడం అక్కడి ఆచారం. అలా చేయకపోతే వచ్చే జన్మలో గాడిదగా పుడతారని నమ్ముతారు. అక్కడి సంక్రాంతిని కిచెరి అంటారు.
-ఒరిస్సాలోని గిరిజనులకు సంక్రాంతితో కొత్త ఏడాది మొదలవుతుంది. పెద్ద పెద్ద మంటలు వేసి, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు.
-గంగానది సముద్రంలో కలిసే ప్రాంతమైన గంగాసాగర్‌లో స్నానం చేయడం బెంగాల్ వాళ్ల ఆచారం. సగరుని కొడుకులను బూడిదగా మార్చిన కపిల మహర్షి ఆశ్రమం ఇక్కడికి దగ్గర్లోనే ఉంది. అందుకనే ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
-తమిళనాడులో సంక్రాంతిని పొంగల్ పేరుతో నాలుగు రోజుల పాటు జరుపుకొంటారు. భోగి రోజున కొత్త బియ్యం, పాలతో పాయసం చేసి, ఇంద్రునికి నైవేద్యం పెడతారు. మరుసటి రోజు సూర్య పొంగల రోజున సూర్యుడిని పూజిస్తారు. మట్టు పొంగల్ నాడు పశువులను అలంకరిస్తే కన్యా పొంగల రోజున పొంగల్ నైవేద్యం ముద్దలను పక్షులకు ఆహారంగా పెడతారు. సంక్రాంతి రోజున ఎడ్ల కొమ్ములను డబ్బులు కట్టి పరిగెత్తించి, వాటిని విప్పుకుని వచ్చే పోటీలు పెడుతారు.

1742
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles