అంతరాన్వేషణ


Thu,January 11, 2018 11:34 PM

శ్రీరామకృష్ణ గురుదేవులు అంటారు, సముద్రం ఒడ్డున నిల్చుండి ఎంతకాలం ఎదురుచూసినా అది ఎదురుచూపుగానే మిగిలిపోతుంది. ఎన్నాళ్లున్నా చివరకు దొరికేవి గవ్వలు, గులకరాళ్లు మాత్రమే. ముత్యం కావాలంటే లోపలికి దూకాలి. ఈదాలి. వెదకాలి. ఆల్చిప్పలను పట్టాలి. అప్పుడే కొన్నైన ముత్యాలు లభిస్తాయి ఎంతటి మార్గదర్శనం!
Sunrise
అన్నిటికి మూలం ఆత్మే అని ఆగిపోకుండా, ఆ ఆత్మను, దాని మూలాలను వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకు వెతకాలి? అదే అసలు మనం కనుకా! లోచూపు కావాలి. లోనారసి అంటే లోపలకు వెళ్లి, చూచి, అనుభవించి, అనుభూతిని పొంది, విభూతి స్థాయిని అందుకోవాలి. నమ్మకమే లేని స్థితి, నమ్మీ నమ్మని స్థితి, నమ్మకమే నడిపించే స్థితి మానవ జీవితంలో అనివార్యమైన స్థితులు.

తెలియదంటున్నవాడు, తెలిసి తెలియనట్లు ఉన్నదన్నవాడు, తెలుసుకుంటున్నానన్న వాడు ఉన్నారు. తెలుసుకున్న వాడు మాత్రం ఏమీ అనటం లేదు. అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. మాటలను దాటి మౌనం ద్వారా ప్రసారం చేస్తున్నాడు. అన్నింటికీ అతీతంగా ఉన్నాడు. మనం ఉంటున్న ఇదే ప్రపంచంలో ఉన్నా, తనతో తాను ఉంటున్నాడు. కానీ ప్రపంచంలో జరుగుతున్న సమస్త కార్యకలాపాలను ఏ ప్రమేయం లేకుండా చూస్తున్నాడు. సర్వానందమయ స్థితిని అనుభవమయం చేసుకుంటున్నాడు. తామరాకుపై నీటిబొట్టు వలె అంటక ఉండగలుగుతున్నాడు. ప్రతి చర్యలోనూ చైతన్యాన్ని, చైతన్యం వెనుక ఉన్న ఆత్మశక్తిని నిత్యానుభవం చేసుకుంటున్నాడు.

వస్తువు వెనుక ఉన్న యదార్థాన్ని దర్శిస్తున్నాడు. ఆ కారణంగా పైపైన జరుగుతున్న విషయాలను, అవి కలిగించే ప్రభావాలను గుర్తించకుండా తత్తానుభూతిని పొందుతున్నాడు. ఆ అనుభవమే, ఈ అభ్యాసమే ప్రకృతి రహస్యాలను చూడగల, చూపించగల ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను చేస్తున్నది. ఆ కారణంగా జాతి, మత, వర్గ, వర్ణాతీతమైన మానవతావాదం, శాస్త్రంగా రూపుదిద్దుకొని ప్రకృతి మూలాలలో ఇమిడి ఉన్న సహజ సౌందర్యాన్ని బహిర్గతం చేస్తుంది. అప్పుడే జగత్తు సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది.

ఆత్మాన్వేషణను ముందుగా స్థూల శరీర పరిమితులను విశ్లేషించుకుంటూ ప్రారంభించి, ఆపై సూక్ష్మ శరీరాన్ని ఆపై కారణ శరీరాన్ని దాటుకొని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేబడే స్థితులను అధిగమించగలిగితే మిగిలేది ఆత్మే! ఇదంతా నిత్య పరిశీలన, అనుష్ఠానం, సాధన వల్ల సాధ్యమయ్యేదే. సర్వత్రా ఆత్మనీ దర్శించగల స్థితి కలిగిన తరువాత ద్వంద్వాలు లేవు. గుణగుణాలు లేవు. అనేకం లేవు.. ఏమీ లేవు.. ఉన్నదంతా ఆత్మే అన్న స్థిర భావన స్థిరమవుతుంది. ఆనందం స్వభావమవుతుంది. ఆనంద సాగరంలో తాను నిశ్చలుడై ఉంటాడు. ఎన్ని అలలు పుట్టనీ, ఎన్ని కెరటాలు ఎగిసిపడనీ, ఎన్ని తుంపరులు తాకనీ, తాను మాత్రం అచలుడై ఉంటాడు. కేనోపనిషత్ ప్రశ్నించుకుంటూ సమాధానం పొందమంటుంది. సాధ్యమైతే, నీ అంతట నీవే ప్రయత్నించమంటుంది. సాధ్యం కాకపోతే గురువును ఆశ్రయించమంటుంది. ఆత్మోన్నతి కలిగించే గురువును అనుసరించమంటుంది. ఆత్మను ఎరిగినవాడు మృత్యు భావనను జయిస్తాడు. భయం లేకుండా ఉంటాడు. ఎందరినో ఆ దారిని నడిపించగల నాయకుడు అవుతాడు, కర్తృత్వ భావన లేకుండా.

644
Tags

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles