పరిపూర్ణుడిని చేసే పరీక్షలు!


Thu,January 11, 2018 11:33 PM

jesus
పరీక్షకు గురికాకుండా ఏదీ రుజువు కాదు. కఠిన వ్యాయామం ద్వారా మన శరీర కండరాలు గట్టిపడుతాయి. ఉధృతంగా వీచే బలమైన గాలులను తట్టుకోవటం ద్వారా చెట్ల వేళ్లు బలపడుతాయి. భూగర్భంలో ఒత్తిడికి గురైన బొగ్గు వజ్రంగా మారుతుంది. కొలిమిలో కాలిస్తే ఉక్కు దృఢమవుతుంది. కానీ మానవులు కఠిన పరీక్షలు ఎదురవగానే వాటి నుంచి సాధ్యమైనంత త్వరగా తప్పుకొనే ప్రయత్నం చేస్తారు. ఇది మానవులకు ఉండే సహజమైన గుణం. దేవుడే మానవులకు కొన్నిసార్లు పరీక్షలు పెడుతుంటాడని పెద్దలు చెప్తుంటారు. ఆ సమస్యల నుండి బయటపడే మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాడు. ఈ పరీక్షా సమయం మానవులలో సహనాన్ని పెంపొందించి, ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును (యాకోబు 1:12) అని బైబిల్ చెప్తుంది. దేవుడు మానవులకు కీడు కలుగజేసేందుకు వారిని శోధించడు. వారిని మరింత బలపరచడానికే పరీక్షలు పెడుతాడు.

కొన్నిసార్లు మానవుల్లోని దురాశ, దుర్బుద్ధి వారికి కష్టాలనుతెచ్చి పెడుతాయి. మనలోని దురాశలే పాపము చేసే దుర్బుద్ధిని కలిగిస్తాయి. దురాశలను నెరవేర్చుకోవడానికి మోసాలకు పాల్పడుతాము. ఈ మోసం అవిధేయతకు దారి తీస్తుంది. ఈ అవిధేయత దేవునికి దూరంగా మానవుని పతనం వైపు నడిపిస్తుంది. దక్షిణ అమెరికాలో మెటడార్ (చంపునది లేక నాశనం చేయునది) అనే ఒక వింత తీగ ఉన్నది. ఆ తీగ ఏదైనా ఒక చెట్టు మొదలులో ప్రారంభమై క్రమంగా పైకి ఎగబాకుతుంది. ఈ తీగ క్రమంగా పెరుగుతూ తాను పాకుతున్న చెట్టును నాశనం చేసేస్తుంది. చివరి వరకూ పెరిగిన తరువాత ఒక పూవు పూస్తుంది. మానవుల్లో పుట్టే దురాశ కూడా వారిని పతనం వైపే నడిపిస్తుంది. ప్రతివాడు తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును అని బైబిల్ చెప్తుంది (యాకోబు 1:14-15). మన దురాశ వల్ల కలిగే సమస్యలు మనలను అంతమొందించకముందే ప్రారంభంలోనే వాటిని కూకటివేళ్లతో పెకిలించి వేయాలి. దురాశ, దురాలోచనల వల్ల పరీక్షలు ఎదురైనప్పుడు దేవునివైపుచూడాలి. డేగపై కాకులు మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు ఆ డేగ తిరిగి ప్రతిదాడి చేయదు. అది తెలివిగా అందనంత ఎత్తుకు ఆకాశం వైపు ఎగిరిపోతుంది. కాకులు అంత ఎత్తుకు ఎగురలేవు గనుక ఆ డేగను వెంటాడం మానేస్తాయి. దురాశలు, దురాలోచనలు మనలను చుట్టిముట్టినప్పుడు వాటికి దూరంగా, దేవునికి దగ్గరగా దైవ చింతనలో గడిపేందుకు ప్రయత్నించాలి.

625
Tags

More News

VIRAL NEWS