పాప హరణం అయ్యప్ప నామం


Fri,January 5, 2018 01:12 AM

కల్మషం పెరిగిపోయి ఎటు చూసినా ఈర్ష్యా ద్వేషాలతో కూడిన కలహాలు, పగప్రతీకారాలతో కూడిన అరాచకాలతో దర్శనమిస్తున్నదీ కలికాలం. ఇటువంటి కాలంలో జన్మించిన మానవులు జీవితంలో ఒక్కసారైనా ధరించవలసినది అయ్యప్ప దీక్ష. స్వామియే శరణమయ్యప్ప అను తారకమాత్రం పలికితే చాలు.. సకల పాపాలు హరించిపోతాయి. ఈ మంత్రమే మానసిక, శారీరక బాధలను తీర్చి, మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. శరణాగతులను తన చెంతకు చేర్చుకొని అభయమిచ్చే హరిహరాత్మజుడు అయ్యప్ప. అటువంటి అయ్యప్ప దీక్షను ఆచరించడమే కాదు, దాని గురించి తెలుసుకోవడమూ, తెలుపడమూ మహా పుణ్యకార్యంలో భాగమవుతాయి.
Iyapa

కారణజన్ముడు మణికంఠుడు

మహిషి అనే రాక్షసి కఠోరమైన తపస్సుతో దేవ, యక్ష, కిన్నెర, కింపురుష, మానవ, దానవులెవ్వరితోనూ మరణము లేకుండా వరం పొందింది. ముల్లోకాలను పీడిస్తున్న ఆ రాక్షసిని అంతం చేసేందుకు, మోహినీ అవతారుడైన శ్రీమహావిష్ణువుకు, పరమశివుడికి జన్మించినవాడే అయ్యప్ప. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అని అర్థం. ఆ ఇద్దరి కలయికతో ఉద్భవించిన వాడు కాబట్టే ఆ స్వామి అయ్యప్పగా అవతరించాడు.

పందళ దేశంలో అయ్యప్ప

కేరళలోని పందళ దేశపు రాజు రాజశేఖరుడు గొప్ప శివభక్తుడు. అయితే సంతానలేమి అతనిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. అయితే తన ఆవేదనను తన ఇష్టదైవంతో చెప్పుకొని బాధపడేవాడు. ఒకనాడు కలలో పరమశివుడు కనిపించి.. వేటకు వెళ్లమని, అంతా మంచే జరుగుతుందని ఆశీర్వదించాడట. మర్నాడు అలాగే వేటకు వెళ్లిన రాజశేఖరుడికి.. అలసటతో ఒక చెట్టుకింద సేదతీరుతుండగా ఆ అభయారణ్యంలో శిశువు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అటు వెళ్లగా కోటిసూర్యుల వెలుగుతో సమానమైన తేజస్సు కలిగి తామరపూవులో ఉన్న శిశువు ఏడు పడగల సర్పం నీడలో ఉండడం గమనించాడు. అతణ్ని చూడగానే సర్పం అక్కణ్నుంచి వెళ్లిపోయింది. ఏడుపు ఆపేసి చిరునవ్వులు చిందిస్తున్న ఆ బాలుణ్ని తన చేతుల్లోకి తీసుకొన్నాడు రాజశేఖరుడు. ఇంతలో వృద్ధుడి రూపంలో సాక్షాత్కారమైన పరమేశ్వరుడు.. కంఠంలో మణిహారంతో ఉన్న బాలకుడికి మణికంఠుడిగా నామకరణం చేశాడు. ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి, బాలుణ్ని పెంచుకోవాలని రాజశేఖరుడికి చెప్పి అదృశ్యమయ్యాడు. శిశువును చూసిన రాజశేఖరుడి భార్య, పందళ దేశపు రాణి ఎంతో ఆనందించింది. కన్నబిడ్డలా చూసుకొన్నది. మణికంఠుడి రాకతో పందళ దేశపు రాజ్యం సిరిసంపదలతో, భోగభాగ్యాలతో తులతూగింది. అతను వచ్చాక రాజ దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. అతనే రాజరాజు. మణికంఠుడు, రాజరాజులిద్దరూ గురువు దగ్గర అస్త్ర,శస్త్ర విద్యలలో ఆరితేరారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న రాజశేఖరుడు మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలనుకొంటాడు. అందరూ సంతోషించినా, రాజశేఖరుడి భార్య మాత్రం సొంత బిడ్డ కాకుండా, పెంచిన కొడుకు పట్టాభిషిక్తుడు కావడం సహించలేకపోయింది. అందుకే అంతుచిక్కని తలనొప్పి వచ్చిందనే నాటకంతో.. ఆ నొప్పి పులిపాలు పూయడంతోనే తగ్గుతుందని వైద్యులతో చెప్పించింది. తల్లి బాధను చూడలేక తాను అడవికి వెళ్లి పులిపాలను తెస్తానని బయలుదేరుతాడు మణికంఠుడు.

అడవిలో ఆలయం

తాను వచ్చిన దైవకార్యం పూర్తయిందని, సెలవు ఇప్పించాలని పెంచిన తండ్రి రాజశేఖరుణ్ణి కోరుతాడు మణికంఠుడు. పందళ దేశం నుంచి తాను విసిరిన బాణం ఎక్కడ పడితే..అక్కడే తనకు ఆలయం నిర్మించి ఇవ్వాలని కోరుతాడు. అయ్యప్ప సంధించిన బాణం సరిగ్గా అక్కణ్నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అరణ్యంలో పడుతుంది. అక్కడే ఒక కొండపై అయ్యప్పకు రాజశేఖరుడు ఆలయాన్ని నిర్మించి ఇచ్చాడు. ఆ క్షేత్రమే శబరిమళై దివ్యక్షేత్రంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకొన్నది.

దీక్షాకాలం

అయ్యప్ప దీక్ష చాలా నిష్టతో కూడుకున్నది. ఈ మాలధారణకు కార్తీకమాసం తొలిరోజు శ్రేష్ఠమైనది. ఆనాటి నుంచి.. నలభై ఒక్క రోజుల పాటు నియమ నిష్టలతో స్వామిని పూజించాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం చేసి.. శుభ్రమైన నలుపు బట్టలు ధరించి స్వామి పూజ చేసుకోవాలి. అష్టోత్తర, శరణుఘోష, లోకవీరంతో స్వామిని స్తుతించాలి. స్వామికి అటుకులు, బెల్లం ఫలహారంగా సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించాలి. ఏక భుక్తం.. అనగా ఒంటిపూట భోజనం మాత్రమే చేయాలి. అది కూడాస్వయంగా వండుకొని.. మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల లోపు పూర్తిచేయాలి. సూర్యాస్తమయం అనంతరం మరోసారి చన్నీటి స్నానం చేసి సన్నిధిలో స్వామి పూజ చేసుకొని ఫలహారం తీసుకోవాలి. ఎప్పుడూ అయ్యప్ప శరణుఘోషను పలుకుతూ ఉండాలి. దీక్షాకాలమంతా ఇదే నియమాన్ని కొనసాగించాలి.

అయ్యప్పకు ప్రతిరూపం గురుస్వామి

అయ్యప్పమాలను గురుస్వామి ఆధ్వర్యంలోనే ధరించాలి. దీక్షలో అయ్యప్పను సేవించేందుకు ఆయనే మార్గదర్శకుడు. గురుస్వామిని అయ్యప్పకు ప్రతిరూపంగా తలవాలి. తొలిసారి అయ్యప్పమాలను ధరించేవాళ్లను కన్యస్వాములనీ, రెండోసారి ధరించేవాళ్లను కత్తిస్వాములనీ, మూడోసారి ధరించేవాళ్లను గంటస్వాములనీ, నాలుగోసారి మాలధారణ చేసేవాళ్లను గదా స్వాములనీ, ఐదోసారి మాల వేసుకొనేవాళ్లను పెరు స్వాములనీ, ఆరోసారి మాలధారణ చేయువారిని గురుస్వాములనీ అంటారు. అయ్యప్ప స్వాములందరూ గురుస్వాములు చెప్పిన పూజానియమాలను పాటిస్తూ దీక్షను భక్తితో కొనసాగించాలి.

మండల దీక్షే అసలైన దీక్ష

ఇటీవల కాలంలో నలభై ఒక్క రోజులు (మండలం), అందులో సగం రోజులు (అర్ధమండలం) దీక్షలు చేస్తున్నారు. తొలుత అయ్యప్ప దీక్ష అరువై రోజుల పాటు చేసేవారట. అసలీ దీక్షలో అర్ధమండలం అనే మాటకు తావులేదని చెబుతున్నారు గురుస్వాములు. 41 దినములు భక్తి ప్రపత్తులతో స్వామిచింతనలో తరిస్తూ దీక్షను కొనసాగిస్తేనే సార్థకత ఉంటుందంటున్నారు.

పడిపూజ మహత్మ్యం

మండల దీక్షలో భాగంగా కొందరు అయ్యప్పస్వాములు.. తోటి స్వాములందరినీ పిలిచి భిక్ష (ఏక భుక్త ఆహారం)ను ఏర్పాటు చేస్తారు. స్వామి సన్నిధిని తలపించేలా అలంకరించి పద్దెనిమిది మెట్లపై అయ్యప్పను నిలిపి.. ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఇదే పడిపూజా కార్యక్రమం. ఈ పూజల్లో స్వాములంతా పాటలు, భజనలు, అష్టోత్తరాలు, శరణుఘోష, లోకవీరంలతో స్వామిని స్తుతిస్తూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు. ఆ శరణుఘోషను పలుకడం మధురానుభూతినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

స్వామియే శరణం అయ్యప్ప

ఈ శరణుఘోషే నన్ను ముప్పై ఐదేళ్లుగా అయ్యప్ప మాల ధరించేలా చేసింది. దీక్షలో ఉన్నా, లేకపోయినా ఆయన నామస్మరణలోనే ఉంటా. ఒకప్పుడు అరవై రోజులు దీక్ష చేసేవాళ్లం. కానీ అదిప్పుడు 41 రోజుల మండల దీక్ష అయ్యింది. గురుస్వామిగా ఎంతో మంది స్వాములకు మాలధారణ చేయించాను. వేల పడిపూజల్లో పాల్గొన్నాను. అయ్యప్ప దీక్ష కఠినమైన నియమనిష్టలతో కూడుకున్నది. భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తే.. తప్పక అనుగ్రహిస్తాడు.
- ప్రకాశ్, గురుస్వామి

మహిషి సంహారం పందళకు తిరుగు పయనం

తల్లి తలనొప్పి నివారణ కోసం పులిపాలు తెచ్చేందుకు అడవికి వెళ్లిన అయ్యప్పకు.. నారద మహర్షి ఎదురై దైవకార్యాన్ని (మహిషి) గుర్తు చేసి, కర్తవ్య బోధ చేస్తాడు. అరణ్య మార్గంలోనే అలుసా నదీతీరాన ఎదురుపడిన మహిషితో ఘోర యుద్ధం చేస్తాడు మణికంఠుడు. శాప విముక్తురాలైన మహిషి కళ్ల వెంట కారిన ఆనందబాష్పాలు కలిసి అలుసానదియే అలుదా నది ఏర్పడిందన్నది చరిత్ర. మహిషి సంహారం అనంతరం అయ్యప్పపై దేవలోకం పూలవర్షం కురిపించింది. దేవేంద్రుడు సహా పలువురు దేవతలు పులులుగా మారి అయ్యప్ప చెంత నిలిచారు. పులిగా మారిన ఇంద్రుడిపై అధిరోహించి.. పందళదేశానికి బయల్దేరాడు అయ్యప్ప.

నలుపు బట్టలే ఎందుకు?

అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి ఇచ్చిన వరమిది. ఒకానొక సందర్భంలో తనతో తలపడి ఓడిపోయిన శనీశ్వరుడిని ఇలా అనుగ్రహించాడట మణికంఠుడు. నా దీక్షను స్వీకరించే భక్తులు నీ కిష్టమైన నలుపు రంగు దుస్తులనే ధరిస్తార ని వరమిచ్చాడు. అయ్యప్ప స్వాములు నలుపు రంగు ధరించడానికి కారణంగా ఈ ఇతివృత్తాన్ని చెబుతుంటారు. లుంగీ, చొక్కా, కండువా ధరించాలి. చాలామంది ఇప్పుడు అనువుగా ఉండేందుకు నల్లని ప్యాంట్లు ధరిస్తున్నారు. కానీ లుంగీ ధరించడమే ఈ దీక్షలో శ్రేష్ఠమని చెబుతున్నారు గురుస్వాములు.

ఇరుముడి ప్రాశస్త్యమిది..

అయ్యప్ప మాలలో ఇరుముడి చాలా పవిత్రమైనది, ప్రాముఖ్యమైనది. ఓం ఆకారంలో కుట్టించిన నల్లని సంచికి మధ్యలో ఒక తాడులాంటిది కట్టి రెండు భాగాలుగా విభజిస్తారు. ముందు భాగంలో బియ్యం, ఆవునెయ్యి, జుట్టు తీసిన కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, జాకెట్లు, విభూతి, పన్నీరు, అగర్‌బత్తీ, కర్పూరం, తేనె, ఖర్జూరం, బెల్లం, మిరియాలు, జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు, పేలాలు ఉంచుతారు. వెనుక ముడిలో పప్పులు, ఉప్పు, చింతపండు, మిరప్పొడి, ఆవాలు, ఇంగువ, తినే పదార్థాలను ఉంచి.. ఇరుముడిని కడుతారు. దీక్షాకాలాన్ని ముగించుకొని శబరికి తరలి వెళ్లేటప్పుడు అయ్యప్ప స్వాములు తలపై పెట్టుకొంటారు. తన తల్లి తలనొప్పికి పులిపాలు తీసుకొచ్చేందుకు అడవికి వెళ్లే సమయంలోఅయ్యప్పస్వామి.. ఇలాంటి ఇరుముడిలోనే తనకు అవసరమైన సామాగ్రినంతా కట్టుకొని తలపై పెట్టుకొని, భుజాలకు బాణాలు, విల్లును ధరించాడట. ఆ పద్ధతే నేటికీ అయ్యప్పస్వాములు కొనసాగిస్తున్నారు. అయితే నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తయిన తర్వాతే ఇరుముడి కట్టాలన్నది నియమం. కానీ నేటి కాలంలో చాలామంది దీక్షాసమయం ముగియకముందే.. ఇరుముడి కట్టుకొని బయలుదేరి మిగతా దీక్షకాలాన్ని ప్రయాణంలో కొనసాగిస్తున్నారు.

పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది సూత్రాలు

స్వామి సన్నిధిలో ఉండే పద్దెనిమిది మెట్లకు ఎంతో విశిష్టత ఉన్నది. అవి ఒక్కో దేవతా స్వరూపమని చెబుతారు. స్వామివారు కొండపైకి చేరుకొనేందుకు ఒక్కో దేవుడు ఒక్కో మెట్టులా మారాడని అంటారు. అంతేకాదు, పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది ధర్మసూత్రాలను సూచిస్తాయనే నమ్మకమూ ఉన్నది. మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలకు సంబంధించినవి. కళ్లు, ముక్కు, చెవులు, జిహ్వ, స్పర్శలకు ప్రతీకలుగా నిలుస్తాయి. తర్వాతి ఎనిమిది మెట్లు కామం, క్రోధం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, డాంబికాలు పలుకడం వంటి గుణాలను సూచిస్తాయి. ఆ తర్వాత ఉన్న మూడు మెట్లు సత్వ, తమో, రజో గుణాలకు ప్రతీకలు. చివరి రెండు మెట్లు విద్య, అవిద్య(అజ్ఞానం)ను సూచిస్తాయి. ఎవరైతే ఈ మెట్లను భక్తిభావంతో ఎక్కి స్వామిని దర్శించుకుంటారో అలాంటివారు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణులవుతారని భక్తుల నమ్మకం.

1384
Tags

More News

VIRAL NEWS

Featured Articles