వరుని ఎంపిక


Fri,January 5, 2018 01:01 AM

వారణాసి సమీప గ్రామంలోని ఒక పండిత కుటుంబానికి చెందినవాడు సుప్రబుద్ధి. పెద్దగా చదువుకోకపోయినా సంయమనం, సంస్కారం కలవాడు. ఆయనకు నలుగురు ఆడపిల్లలు. వారూ పెరిగి పెద్దవారయ్యారు. పెళ్ళీడుకొచ్చారు.
sambhogakayabuddha
ఒకరోజున వారి నలుగురినీ పిలిచి, అమ్మా! మీ నలుగురికీ పెళ్ళీడు వచ్చింది. మీకు ఎవరెవరికి ఎలాంటి యువకుడు కావాలో చెప్పండి అని అడిగాడు.
పెద్దమ్మాయి సుజాత, తండ్రీ! అనాకారివాడైతే అందరూ గేలి చేస్తారు. కాబట్టి నాకు మంచి రంగూ, రూపూ ఉన్న అందమైనవాడు కావాలి అంది. రెండో కుమార్తె సునీత, నాన్నా! అందం కంటే మనిషికి ఆరోగ్యం ముఖ్యం. ఆయుష్షు ముఖ్యం. కాబట్టి మంచి దీర్ఘాయుష్షు కలవాడితో నా వివాహం జరిపించు అని కోరింది. మూడో కూతురు సుభద్ర, తండ్రీ! అందం, ఆయుష్షులు కేవలం వ్యక్తిగతాలు. మనకి గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టేవి ధనం, వంశం మాత్రమే. కాబట్టి నాకు గొప్ప వంశం వాడు కావాలి అంది.
చివరికి నాలుగో అమ్మాయి సుగుణ, నాన్నా! నాకు అందం, ఆయుష్షు, ఐశ్వర్యం, వంశం కంటే గుణవంతుడు కావాలి. అతను ఎలా ఉన్నా, ఏ వంశం వాడైనా, పేదవాడైనా సరే గుణవంతుడైతే సరి అంది.

వారు చెప్పిన వాటిలో అన్నీ మంచిగానే అనిపించాయి ఆ తండ్రికి. నిజానికి అందం, ఆయుష్షు, ఐశ్వర్యం కలిగిన గుణవంతుడైన గొప్పవంశం కలవారు నలుగురు దొరికితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. మరలా అంతలోనే, ఇది దురాశే అని గ్రహించాడు. దుర్లభం అని తెలుసుకున్నాడు. అసలు ఎలాంటివాడు ఆడపిల్లకు తగినవాడో తేల్చుకోలేకపోయాడు. ఆ పట్టణానికి బోధిసత్తుడు (బుద్ధుడు) వచ్చాడని తెలుసుకుని వెళ్లి విషయం చెప్పాడు.
సుప్రబుద్ధీ! ఒక దొంగ చాలా అందంగా ఉన్నాడనుకో, నీవు అతణ్ణి మెచ్చుకుంటావా? లేదు భంతే! ఒక అనామకుడు, సోమరి, దుష్టబుద్ధి ఎక్కువ కాలం జీవించాడనుకో.. నీవు హర్షిస్తావా? లేదు భగవాన్! ఒక గొప్పవంశం వాడు, దురాచారి అనుకో. దుశ్శీలుడనుకో.. గౌరవిస్తావా? లేదు భగవాన్ కాబట్టి సుప్రబుద్ధీ..

అత్థో అత్థి సరీరస్మిం, వుడ్థబ్యస్స నమోకరే
అత్థో అత్థి సుజాతస్మిం, సీలం అస్మాక రుచ్చతీ
అందం, వంశం, ఆయుష్షులు అనేది కేవలం గొప్ప అని చెప్పుకోవడానికే. శీల గుణం కంటే మించినది ఏదీ ఈ లోకంలో లేదు. కాబట్టి శీలవంతుణ్ణి, గుణవంతుణ్ణే అల్లునిగా ఎంచుకో అని చెప్పాడు. ఆ తర్వాత సుప్రబుద్ధి నలుగురు కూతుళ్ళకూ గుణవంతులతోనే వివాహం జరిపించాడు.

552
Tags

More News

VIRAL NEWS