కాలం సాక్షి


Thu,December 28, 2017 10:38 PM

MUSLIMS-MODERATE
కాలం అమూల్యమైంది. అది ఎవరికోసమూ ఆగదు. పరుగు దాని నైజం. నిరంతరం అది పరిగెడుతూనే ఉంటుంది. దాని వెనుక పరుగెత్తలేని వాళ్లు మరుగున పడిపోతారు. అనంతమైన ఈ కాల ప్రవాహంలో మలుపులే తప్ప మజిలీలు లేవు. కాలాన్ని మనం మన సౌకర్యార్థం ఎన్నో రకాలుగా విభజించుకున్నాం. సెకనులు, నిమిషాలు, గంటలు, ఘడియలు, విఘడియలు, ఝూములు. ప్రకృతిసిద్ధంగానూ ఈ విభజన ఉంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, అమావాస్య, పౌర్ణమి, పగలు, రాత్రి, రోజు, వారం, నెల, సంవత్సరం. ఈ ప్రకృతి నియమాన్నే అనాదిగా మానవుడు అనుసరిస్తూ ఉన్నాడు. కాలగతిలో క్యాలెండర్లు మారుతుంటాయి. కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటాయి. వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో రకరకాల పేర్లతో ఇవి ప్రాచుర్యం పొందాయి. తెలుగునాట ఉగాదితో కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టుగానే, ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం, హి.శ. మొదటి మాసం ముహర్రమ్‌తో కొత్త సంవత్సరాది ప్రారంభమవుతుంది. అలాగే క్రీ.శ. జనవరితో ఆంగ్ల సంవ్సరం ఆరంభమవుతుంది.

గత కాలానికి వీడ్కోలు పలికి కొత్త వత్సరానికి స్వాగతం పలికే సమయంలో ఎవరైనా ఆనందానుభూతులకు లోనుకావడం సహజం. సంతోషం మానవ నైజంలో ఉన్న సహజ గుణం. అయితే, ఆనంద పారవశ్యంలో హద్దుల్ని అతిక్రమించి, నిషిద్ధ కార్యాలకు పాల్పడడం ధార్మికంగానే కాకుండా, సామాజికపరంగా, నైతికపరంగా కూడా నేరమే. దీనికి దేవుని ముందు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అందుకే కాలాన్ని సాక్షిగా పెట్టి, అనేక యదార్థాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్లకు కనిపిస్తాయి. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటి నుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలా కాకుండా గత కాలాన్ని గాలికొదిలేసి, కొత్త సంవత్సరంలో చైతన్యరహిత చర్యలతో, అర్థం పర్థంలేని కార్యకలాపాలతో కొత్త కాలాన్ని ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. కాలం ఎవరికోసమూ ఆగదు. రాజులు, రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు అంతా కాలగర్భంలో కలిసిపోయినవారే.

కలిసిపోవాల్సినవారే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. గతం నుండి గుణపాఠం గ్రహిసస్తూ భవిష్యత్తు కాలానికి స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కాని ఆ సంతోషంలో హద్దుల అతిక్రమణ జరుగకుండా చూసుకోవాలి. గడిచిన కాలంలో ఏం చేశామన్నది కొత్త సంవత్సర ప్రారంభాన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మంచి పనులు చేసి ఉంటే ఈ కొత్త సంవత్సరంలో అవి ఇంకా ఇంకా ఎక్కువగా చెయ్యాలన్న దృఢ సంకల్పం చేసుకోవాలి. ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు జరిగివుంటే చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందుతూ, ఇకముందు అలాంటివాటన్నింటినీ ఖచ్చితంగా విసర్జిస్తామని ప్రతినబూనాలి. ఇకనుండి ఓ నూతన శకానికి నాంది అన్న ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. గతపాపాల పట్ల సిగ్గుపడి, పశ్చాత్తాపం చెంది, భవిష్యత్తులో ఇక వాటి జోలికి పోనని ప్రతిన బూనిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. వారి పాపాలను క్షమిస్తాడు. జీవితం చాలా చిన్నది. ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తమో ఎవరికీ తెలియదు. కనుక ఆనంద సమయమని హద్దుల్ని అతిక్రమించకుండా విలువలతో కూడిన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
...?మదీహా అర్జుమంద్

904
Tags

More News

VIRAL NEWS

Featured Articles