వేప సందేశం


Thu,December 28, 2017 10:36 PM

Buddha-margam
చెడు గుణాలు మనలోకి వచ్చినప్పుడు వాటిని వెంటనే పసిగట్టి బైటకు పంపేయాలి. లేకపోతే మన మనస్సును కలుషితం చేస్తాయి. వాటివల్ల మనకు తీవ్రమైన హాని కలుగుతుంది. అందుకే వాటిని కనిపెట్టి మన మనస్సు నుండి తరిమెయ్యాలి. అప్పుడే మనం కుశల కర్మలు చేయగలం.
సారనాథ్ సమీపంలో ఒక మహా వనం ఉంది. దానిలో ఒక తటాకం తీరంలో ఒక పెద్ద వేపచెట్టు ఉంది. దాని దాపులోనే మరో రావిచెట్టు ఉంది. ఒకనాటి రాత్రి ఒక దొంగ రాజవీధిలోని ఇళ్లకు కన్నం వేసి విలువైన వస్తువులు దొంగిలించి వచ్చి, మహావనంలోని ఈ వేపచెట్టు కిందికి చేరాడు. వస్తువులన్నీ చెట్టు మొదట్లో ఉంచి, తటాకంలోని నీరు త్రాగి వచ్చి,చెట్టు కిందే పడుకున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి దొంగ అని వేపచెట్టు గుర్తించింది. వీడు ఇక్కడే ఉంటే తనకే ప్రమాదం అని శంకించింది.

వెంటనే, ఓరీ! దొంగా! నీవు ఇక్కడ దాగావు. ఈ పక్కనే రాదారి ఉంది. నిన్ను వెతుక్కుంటూ రాజభటులు ఇక్కడికే రావొచ్చు. నిన్ను పట్టి బంధించి, ఉరితీయవచ్చు. ఎవరైనా నిన్ను చూసినా సరే.. నీ విషయం భటులకు తెలుపవచ్చు.. అని వేపచెట్టు అతణ్ణి భయపెట్టింది. ఆ మాటలు విన్న దొంగ అక్కడి నుండి పారిపోయాడు. ఈ తతంగం అంతా చూసిన రావిచెట్టు - ఓ వేపచెట్టా! ఇదెక్కడి చోద్యం! ఆ దొంగను పట్టుకోవడం, శిక్షించడం రాజభటుల విధి. వాణ్ణి ఉరితీస్తే నీకొచ్చే బాధ ఏమిటి. అని అడిగింది. ఓ రావిచెట్టా! అంతేనా నీకు తెలిసింది. మన రాజ్యంలో ఉరితీసే వ్యక్తిని ఎలా ఉరితీస్తారు? పొడవైన వేప కొమ్మను పాతి, దానిమీద నిలబెట్టి కదా ఉరితీసేది! ఇప్పుడు ఈ దొంగ ఇక్కడ పట్టుబడితే వాడితో పాటు నాకూ మూడుతుంది. నిలువైన, బలమైన నా కొమ్మను నరికి, దానిమీద ఉరితీస్తారు. రాబోయే ఆపద నాకు కనిపించింది. అందుకే ఇక్కడి నుండి తరిమాను అంది. అప్పుడే అక్కడికి రాజభటులు వచ్చారు. కాగడాల వెలుగులో వెతికారు. వేపచెట్టు కింద దొంగ అడుగుజాడలు గుర్తించారు. వాడు ఇక్కడి నుండి అటు పోయాడు. ఇక్కడే దొరికి ఉంటే.. ఈ వేపచెట్టు కొమ్మను నరికి, ఇక్కడే ఉరితీసే పని అనుకొంటూ దొంగ పోయిన దారిలో పోయారు. ముందుచూపుతో చెడును వదిలించుకున్న వేపచెట్టును చూసి, రావిచెట్టుకు జ్ఞానోదయం అయ్యింది. మనం కూడా మనలోకి వచ్చిన దుర్గుణాల్ని ఇలానే వదిలించుకోవాలి అని బౌద్ధం సందేశం ఇస్తుంది.
...?బొర్రా గోవర్ధన్

651
Tags

More News

VIRAL NEWS

Featured Articles