ఆదర్శమూర్తి బలహీనుల ఆశాజ్యోతి


Fri,December 1, 2017 01:27 AM

మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఊహ తెలిసినప్పటి నుండి అంతిమ శ్వాస వరకు సమాజ సంక్షేమం కోసం, సంస్కరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. మానవాళికి సత్యధర్మాన్ని పరిచయం చేస్తూ, వారి ఇహ పర సాఫల్యాల కోసం అహర్నిశలు శ్రమించారు. ప్రజలను దుర్మార్గాల నుండి కాపాడి సన్మార్గ పథంపై నడిపించడానికి అలుపెరుగని ప్రయత్నం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వీలైనంత ఎక్కువగా వారికి సేవలు చేసేవారు. కర్తవ్య నిర్వహణలో ఆ మహనీయుడు ఏనాడూ ఎలాంటి లోటూ రానీయలేదు. అల్లాహ్ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా జనావళికి అందజేసి భావి తరాలకు ఆదర్శంగా నిలిచారు.
Miladunnabh
ఆ మహనీయుని జీవన విధానం మానవాళికంతటికీ ఆదర్శం కావాలి. ఆయన సందేశంలో గుబాళించిన విజ్ఞతా కుసుమాలు నేడు మన జీవన విధానంలోనూ పరిమళించాలి. ప్రజలతో ఆయన ఏ విధంగా ప్రేమానురాగాలతో, స్నేహ సౌహార్ద్రతలతో, సానుభూతితో వ్యవహరించేవారో, అవసరార్థులకు, ఆపదలో ఉన్నవారికి ఏ విధంగా ఆపన్నహస్తం అందించేవారో అటువంటి వ్యవహార శైలి నేడు మనలోనూ తొణికిసలాడాలి. ముహమ్మద్ మహనీయుని మమతానురాగాలు, క్షమాగుణం, పరోపకారం, త్యాగ భావం, సహన శీలత, మృదుభాష్యం లాంటి కొన్ని సుగుణాలనైనా కనీస స్థాయిలో మనం అమలు చేయగలగాలి. అసహనం, ఆగ్రహం, చిరాకు, చపల చిత్తం మానవ సమాజానికి శోభించని లక్షణాలు.
ఆ మహనీయుని మంచితనానికి, మానవీయ సుగుణానికి అద్దం పట్టే ఓ సంఘటనను ఈ సందర్భంగా మననం చేసుకుందాం.

ఇది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ధర్మ ప్రచారం చేస్తున్న తొలినాళ్ల మాట. ఒకసారి ఆయన మక్కా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక చౌరస్తాలో ఒక వృద్ధురాలు తన మూటాముల్లెతో సహా నిలబడి ఉంది. వృద్ధురాలు కావడంతో మూటల బరువు మోయలేక పరుల సహాయం కోసం అర్థిస్తోంది. దారిన వెళ్లేవారిని కాస్తంత సాయం చేయమని బతిమాలుతోంది.చాలామంది ఆ దారిన వెళ్తున్నారు గాని ఎవరూ ముందుకు రావడం లేదు. వృద్ధురాలిని ఎవరూ పట్టించుకోలేదు. అంతలో ముహమ్మద్ ప్రవక్త అటుగా వెళ్తూ వృద్ధురాలిని ఎవరూ పట్టించుకోకపోవడం చూసి ఆమెను సమీపించారు. అమ్మా! నేను మీకు సహాయం చేస్తాను అన్నారు. బాబ్బాబూ.. నీకు పుణ్యముంటుంది. ఈ మూట చాలా బరువుగా ఉంది. మోయలేకపోతున్నాను. కాస్త అందాకా సాయం చేస్తే నేను వెళ్లిపోతాను అన్నదా వృద్ధురాలు.

అయ్యో! దీనికేం భాగ్యం అంటూ మూట భుజానికి ఎత్తుకొని ఆమె కోరిన చోటుకు చేర్చారు ప్రవక్త మహనీయులు.
బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డవో గాని ముక్కూ మొహం తెలియని నాలాంటి ముసలిదానికి ఇంత సహాయం చేశావు. బాబూ! ఒక్కమాట వింటావా. ఎవరో ముహమ్మద్ అట. ఏదో కొత్త మతాన్ని ప్రచారం చేస్తున్నాడట. అతని మాటల్లో ఏముందో గాని చాలామంది అతని ప్రభావంలో పడిపోతున్నారు. జాగ్రత్త నాయనా! అతని మాటల్లో పడకు. నేను కూడా ఊరే విడిచి వెళ్లిపోతున్నాను అని హితవు పలికింది. సరేనమ్మా అంటూ ఆమె చెప్పిందంతా ఓపిగ్గా విని, వినయపూర్వకంగా అవ్వకు అభివాదం చేసి సెలవు తీసుకున్నారు ముహమ్మద్ ప్రవక్త (స).
ఆ మహనీయుని మంచితనానికి వినయపూర్వకమైన ఆ వీడ్కోలుకు ఆనందభరితురాలైన వృద్ధురాలు ఒక్కసారిగా భావోద్రేకానికి లోనై బాబూ! అని పిలిచింది ఆప్యాయంగా. అమ్మా! అంటూ దగ్గరికి వచ్చిన ప్రవక్త తలపై చేయి వేసి నుదుటిని ముద్దాడుతూ, బాబూ! నీ పేరేమిటి నాయనా? అని ప్రశ్నించింది ప్రేమగా. కాని ప్రవక్త ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు.

బాబూ! పేరైనా చెప్పు నాయనా కలకాలం గుర్తుంచుకుంటాను అంటూ అభ్యర్థించింది.
అప్పుడు ప్రవక్త మహనీయులు అమ్మా! నా పేరు ఏమని చెప్పను? ఏ ముహమ్మద్‌కు భయపడి నువ్వు దూరంగా వెళ్లిపోతున్నావో ఆ అభాగ్యుణ్ణి నేనేనమ్మా! అన్నారు ప్రవక్త మహనీయులు. దీంతో ఒక్కసారిగా ఆ వృద్ధురాలు అవాక్కయిపోయింది. కాసేపటి వరకు ఆమెకేమీ అర్థం కాలేదు. ఏమిటీ.. నేను వింటున్నది ముహమ్మద్ మాటలనా..! నేను చూస్తున్నది స్వయంగా ముహమ్మద్ నేనా..? నా కళ్లు, చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా..! ఆమె మనసు పరి పరి విధాలా ఆలోచిస్తోంది. ఎవరి మాటలు వినకూడదని, ఎవరి ముఖం కూడా చూడకూడదని పుట్టి పెరిగిన ఊరినే వదిలేసిందో, అతనే తనకు సహాయం చేశాడు. ఎవరూ పట్టించుకోని నిస్సహాయ స్థితిలో ఆప్యాయత కురిపించాడు. సహాయం కంటే ఎక్కువగా ఆయన మాట, మంచితనం, వినమ్రత, మానవీయ సుగుణం ఆమెను మంత్ర ముగ్ధురాల్ని చేసింది. కళ్ల నుండి ఆనంద బాష్పాలు జలజలా రాలుతుండగా, బాబూ ముహమ్మద్! నువ్వు నిజంగా ముహమ్మద్‌వే అయితే నీనుండి పారిపోవాలనుకోవడం నా దురదృష్టం. ఇక నేను ఎక్కడికీ వెళ్లను. నీ కారుణ్య ఛాయలోనే సేదదీరుతాను అంటూ అదే క్షణాన ప్రవక్తవారి ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. ఇదీ ప్రవక్త మహనీయుని ఆచరణా విధానం. ప్రజల పట్ల, ముఖ్యంగా నిస్సహాయులు, బడుగు బలహీనులు, శ్రామిక వర్గాల పట్ల ఆ మహనీయుడు అవలంబించిన ఆచరణా శైలి. ఇందులో ఎంతో కొంతైనా, కనీస స్థాయిలోనైనా మనం ఆచరించడానికి ప్రయత్నిస్తే నేటి మన సమాజం ఎంతో బాగుంటుంది.
- మదీహా అర్జుమంద్

550
Tags

More News

VIRAL NEWS