దీపం..లక్ష్మీ స్వరూపం!


Fri,October 13, 2017 01:49 AM

ప్రతిరోజూ ఇంట్లో ఒక దీపం.. మహా అయితే రెండు దీపాలు వెలిగించి, భగవంతునికి దీపారాధన చేస్తాం. కానీ దీపమే భగవత్ స్వరూపంగా ఆరాధించే పండుగే దీపావళి. నరక సంహారం జరిగిన రోజునే నరక చతుర్దశిగా ఎలాగైతే చెప్పుకుంటామో, దీపావళి రోజున మహాలక్ష్మీ ఆరాధన కూడా కీలకంగా చెప్పుకోదగినదే. మొదటిది కష్టాల చీకట్లు తొలగిపోయిన దానికి సంకేతమైతే, రెండవది అజ్ఞానపు చీకట్లను తొలగింపచేసేందుకు గుర్తుగా ఉంటుంది. ఒకవైపు దీపాల వెలుగులు.. మరోవైపు టపాసుల ఢమఢమలు.. వెరసి దీపావళి ఒక ఆనందపు వేడుక.
Diwalii
దీపావళి అంటే దీపాలు వెలిగించడం, టపాకాయలు కాల్చడమే కాదు, లక్ష్మీపూజ కూడా ప్రధానమైనదే. అయితే దీపావళి రోజున దీపాల వెలిగించడం కూడా లక్ష్మీ ఆరాధనగానే భావిస్తారు. దీపావళి రోజున మహాలక్ష్మిని అర్చించడం వెనుక ఒక పురాణ కథ ఉంది. ఒకసారి త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుని వద్దకు దుర్వాస మహర్షి వస్తాడు. సకల మర్యాదలతో, అతిథి సత్కారాలతో పూజిస్తాడు దేవేంద్రుడు. అతని ఆతిథ్యానికి సంతోషించిన దుర్వాస ముని మహిమాన్వితమైన ఒక హారాన్ని బహుమతిగా ఇస్తాడు. దాని మహిమ తెలియని ఇంద్రుడు తిరస్కార భావంతో ఆ హారాన్ని తన దగ్గరున్న ఐరావతం (ఏనుగు) మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై శపిస్తాడు. దుర్వాసుని శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి, సర్వసంపదలూ పోగొట్టుకుంటాడు. దిక్కుతోచని స్థితిలో శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఇది గమనించిన శ్రీమహావిష్ణువు ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపజ్యోతినే లక్ష్మీస్వరూపంగా తలచి, అమ్మవారిని పూజించమని సూచిస్తాడు. అదేవిధంగా లక్ష్మిని పూజిస్తాడు ఇంద్రుడు. దాంతో అమ్మవారు అనుగ్రహించి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలనూ ఇంద్రునికి ప్రసాదిస్తుంది. అప్పటి నుంచి మహాలక్ష్మీ కటాక్షం కోసం దీపజ్యోతిని పూజించడం ఆనవాయితీగా వస్తున్నదని పురాణాలు చెబుతున్నాయి.

కోరికలు తీర్చే కల్పవల్లి!


దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపాలను ప్రత్యేక వరుసల్లో ఉంచి, వెలిగిస్తారు.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్!
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే!!

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తారు. మానసిక వికాసానికి, ఆనందపు మార్గానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా దీపాలను భావిస్తారు. అందుకే స్త్రీలందరూ ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి, జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు.
దీపాలు వెలిగించడమే కాదు.. దీపమే అమ్మవారి స్వరూపంగా భావించి, కొలుస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని కొలిస్తే సకల కోరికలు నెరవేరి, సర్వసంపదలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. ఇందుకు కూడా పరోక్షంగా ఇంద్రుడే కారణం. దీపాన్ని లక్ష్మిగా కొలిచిన ఇంద్రుడు ఈ సందర్భంలో లక్ష్మీదేవిని ఒక ప్రశ్న వేస్తాడు. తల్లీ! నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమేనా? నీ భక్తులను కూడా కరుణించవచ్చు కదా! అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్తుంది. త్రిలోకాధిపతీ! నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి అభీష్టాలకు అనువైన రూపంలో వాళ్లను కటాక్షిస్తాను అని చెప్తుంది. మహర్షులకు మోక్షలక్ష్మిగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కాంక్షించేవారికి ధనలక్ష్మిగా అనుగ్రహిస్తానని చెప్తుంది. సమస్త కోరికలను తీర్చడానికి వరలక్ష్మిగా ప్రసన్నురాలిని అవుతానంటుంది. అందుకే దీపావళి రోజున చేసే లక్ష్మీపూజ ప్రత్యేకమైనది.

ముగురమ్మల మూలం.. దీపం!

జీవుల మనుగడకు ప్రధానమైంది, పంచభూతాల్లో ముఖ్యమైందీ అగ్ని. తేజస్సుకూ, విజ్ఞానానికీ ప్రతీక. దీపాలను వెలిగించడం ద్వారా ఈ ఆధ్యాత్మిక భావాన్ని తెలుపుతుంది దీపావళి. అగ్ని నిండా నింపుకొన్న దీపమే పరోక్షంగా ఆహారానికీ, ఆరోగ్యానికీ దోహదకారి అని శాస్త్రం కూడా చెప్తుంది. మన ఉనికికి మూలమైన అగ్నిని దీపం రూపంలో కొలువడమే దీపావళిగా అభివర్ణించవచ్చు కూడా. అంతేకాదు. దీపంలోని జ్యోతిలో ప్రధానంగా మూడు రంగులు కనిపిస్తాయి. పసుపు, తెలుపు, నీలి రంగులు. ఇవి సత్వరజస్తమోగుణాల సమ్మేళనమంటారు ఆధ్యాత్మికులు. అంతేకాదు ఇవి ముగురమ్మలకు గుర్తులనీ, దీపాన్ని వెలిగించడం ద్వారా ఈ ముగ్గురు అమ్మలనీ ఆరాధించినట్టు అవుతుందని చెప్తారు.

దీపాలే మేలు!

diwalie
టపాకాయలు కాల్చడమంటే ఆ వెలుగులో, శబ్ద తరంగాలలో దారిద్య్ర దుఃఖాలు దూరంగా తరిమివేయబడతాయనీ, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందనీ అంటారు. అంతేగాక, వర్షరుతువులో వర్షాల వల్ల ఏర్పడిన తేమలో అనేక రకాల క్రిమి కీటకాలు ఎక్కువగా పెరుగుతాయి. అయితే ఈ టపాకాయల పొగలకి అవన్నీ నశిస్తాయంటారు.
అయితే ఇది ప్రాచీన కాలంనాటి మాట. ఇప్పుడు మనకు పొగలకు తక్కువ లేదు. క్రిమి కీటకాలు చనిపోవడమేమో గానీ పొగ కాలుష్యంతో అనేక రకాల అనర్థాలు చుట్టుముడుతున్నాయి. అందుకే విపరీతమైన పొగనూ, శబ్ద కాలుష్యాన్నీ కలిగించే టపాసుల జోలికి వెళ్లకుండా కన్నుల కాంతి నింపే, జ్ఞానజ్యోతులు వెలిగించే దీపాలతో పండుగ చేసుకోవడమే మంచిది. దీపావళి అచ్చంగా దీపాల పండుగ. అందుకే దీపపు కాంతులతో మనలోని అజ్ఞానాన్ని తరిమికొడదాం. అమ్మవారిని ఆరాధిద్దాం.

తల్లి చేతిలోనేనరకుడు హతం..

Diwalii1
దీపావళి అనగానే ముందుగా గుర్తువచ్చేది నరక సంహారం.. నరక చతుర్దశి. ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజునే నరకాసుర వధ జరిగింది కాబట్టి ఆ రోజును నరక చతుర్దశిగా పరిగణిస్తారు. ఈ నరకాసురుడు ఒక రాక్షసుడు. హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి, భూదేవిలకు అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు కాబట్టి రాక్షసుడయ్యాడు. లోక కంటకుడిగా తయారైన నరకుడిని తండ్రియైన మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించాలని వరం పొందుతుంది భూదేవి. అలా ఆమె ద్వాపర యుగంలో సత్యభామగా జన్మిస్తుంది. శ్రీకృష్ణుడి ఇష్టసతిగా నరకాసురుడిపైన యుద్ధానికి తానూ వెళ్తుంది. భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు నరకుడు. నరకుడి పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజున ప్రజలు వేడుకలు చేసుకుంటారు. అమావాస్య కావడంతో చీకటి పోవడానికి దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చి పండుగ చేసుకున్నారని కథ. దీపాలు వెలిగించే పండుగ కాబట్టి ఇదే దీపావళి అయింది. రాముడు రావణ సంహారం చేసి, విజయంతో, సీతా సమేతంగా అయోధ్యకు తరలి రావడం వల్ల అయోధ్య ప్రజలు సంబరంతో దీపావళి వేడుక చేసుకున్నారనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.

2691
Tags

More News

VIRAL NEWS