భరధ్వాజ మహర్షి


Fri,October 13, 2017 01:44 AM

వేదాలను అర్థం చేసుకోవడానికి తన జీవిత కాలాన్ని వెచ్చించినవాడు భరధ్వాజ మహర్షి. ఆయన దేవతల గురువైన బృహస్పతి కుమారుడు. బృహస్పతి అంగీరస మహర్షి కుమారుడు. భరధ్వాజుని కుమారుడే కురుపాండవులకు గురువైన ద్రోణాచార్యుడు. భరధ్వాజునికి ఘృతాచి అనే అప్సరస వలన జన్మించిన వాడు ద్రోణాచార్యుడు. భరధ్వాజుడు సుశీల అనే భార్య ద్వారా గర్గ మహామునికి జన్మనిచ్చాడు. భరధ్వాజునికి దేవవర్ణిని అనే కుమార్తె కూడా ఉన్నది.
MaharishiBhrighuji
భరధ్వాజుడు తండ్రి నుండి అపారమైన పాండిత్యం సంపాదించాడు. ఏకాగ్రతతతో తనకు కావాల్సిన విద్యను నేర్చుకోవడంలో ఆయన దిట్ట. ఆయుర్వేదాన్ని లోకానికి పరిచయం చేసినవాడు భరధ్వాజుడు. వాల్మీకి, బోయవాడు క్రౌంచ పక్షిని బాణంతో కొట్టినప్పుడు చెప్పిన రామాయణ ప్రారంభ శ్లోకం సమయంలో భరధ్వాజుడు అక్కడ ప్రత్యక్ష సాక్షి.
మహర్షి కఠోర వేద పాండిత్య గ్రహణాభిలాష ఒకప్పుడు ఇంద్రుడిని ఇబ్బంది పెట్టింది. భరధ్వాజునికి వేదాలన్నీ తన జీవితకాలంలో ఔపోశన పట్టాలని కోర్కె ఏర్పడింది. తన జీవితకాలం నూరు సంవత్సరాలని తెలుసు. ఆలోపు వేదాలను అభ్యసించలేనని తెలిసి, ఇంద్రుని ప్రార్థించి తనకు మూడు వేదాలూ అభ్యసించడానికి మరొక నూరు సంవత్సరాలు ఆయువు ప్రసాదించమని కోరాడు.

మహర్షిలో ఉన్న జ్ఞాన తృష్ణకు ఇంద్రుడు సంతోషించి తథాస్తు అని దీవించి మరొక నూరు సంవత్సరాలు ఆయుర్దాయం పెంచాడు. రెండవ శతాబ్ది అవుతున్నా తన వేదాభ్యాసానికి అంతు కనబడలేదు. ఎంతో వ్యాకులపడుతూ భరధ్వాజ మహర్షి ఇంద్రుని మళ్లీ ఎంతో నిష్ఠతో ప్రార్థించి, ఇంకొక వంద సంవత్సరాలు ఆయుర్దాయం అడిగాడు. సరే అన్నాడు ఇంద్రుడు. ఆ విధంగా భరధ్వాజ మహర్షి అయిదు సార్లు తన ఆయుఃప్రమాణాన్ని ఇంద్రుని కటాక్షం వల్ల పెంచుకుని వేదాలన్నీ చదివి, వాటిలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో పడ్డాడు.
ఆ విధంగా అయిదువందల సంవత్సరాల ఉండి కూడా భరధ్వాజుడు వేదాల సారాన్ని గ్రహించలేకపోయాడు. మళ్లీ ఇంద్రుని ప్రార్థించగా ఇంద్రునికి అర్థమైంది. భరధ్వాజునికి తాను దిశానిర్దేశం చెయ్యాల్సిన సమయం ఆసన్నమైందని.

భరధ్వాజుడు మళ్లీ ఆయుర్దాయం పెంచమని అడిగేలోపే ఇంద్రుడు భూః భువః సువః అనే మూడు శబ్దాలు ఉచ్చరించి మూడు పెద్ద పర్వతాలను భరధ్వాజుని కనుల ముందు సృష్టించాడు. భరధ్వాజుడు తాను నేర్చుకున్న వేదాల పరిజ్ఞానం ఈ విధంగా తన కనుల ముందు ఇంద్రుడు చూపిస్తున్నాడనుకుని ఆసక్తిగా చూడసాగాడు.
అప్పుడు ఇంద్రుడు భరధ్వాజుని వైపు జాలిగా చూస్తూ ఆ మూడు పర్వతాల నుండి పిడికెడు మట్టిని తీసుకువచ్చి ఓ మహర్షీ! ఈ అయిదు శతాబ్దాలుగా నీవు నేర్చుకున్న వేద విజ్ఞానం ఇదిగో, ఈ మట్టి పరిమాణమంత. నీవు నేర్చుకోవలసినది ఆ మూడు పర్వతాలంత అని చెప్పి, భరధ్వాజునికి దిగ్భ్రాంతికి గురిచేశాడు.
భరధ్వాజ మహర్షికి అర్థమైంది. నేను అయిదు శతాబ్దాల నుండి వేదాలకై సాధన చేశాను గానీ, దాన్ని పొందడం అంత కష్టమని తెలుసుకోలేకపోయాను అని పరితపించి, దారి చూపమని ఇంద్రుని శరణు కోరాడు. అప్పుడు ఇంద్రుడు మహర్షీ! వేద విజ్ఞానం అపరిమితం. ఒక్క మహావిష్ణువుకే వేదసారమంతా తెలుసు. మనం తెలుసుకోవలసింది వేదముల ఉపయోగము. మానవ జీవితంలో ఎంతవరకు అని, అది తెలుసుకుని ఆచరించడమే. అన్ని వేదాల పరమార్థము ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన గురించి తపస్సు చెయ్యి. ఆయనే నీకు కావాల్సిన లక్ష్యం నెరవేరుస్తాడు అని చెప్పాడు. వేదాలను పూర్తిగా గ్రహించడమంటే శ్రీహరి కైవల్యం పొందడమేనని భరధ్వాజుడు అప్పుడు తెలుసుకున్నాడు.
ఇంద్రుడు చెప్పిన విధంగా భరధ్వాజుడు శ్రీహరిని ప్రార్థించడానికి అనువైన ప్రదేశం వెదికి, చివరికి మట్టపల్లి అనే గ్రామం (మన రాష్ట్రంలోని నల్లగొండజిల్లా) వెళ్లి, అక్కడ నిత్యమూ కృష్ణా నదిలో స్నానం ఆచరిస్తూ, నరసింహ స్వామిని గురించి తపస్స చేశాడు. భరధ్వాజుని తపస్సుకు మెచ్చి, నారసింహుడు మహర్షికి వైకుంఠప్రాప్తి కలుగజేశాడు.
- గండవరపు ప్రభాకర్

1542
Tags

More News

VIRAL NEWS