బాధ్యతే దైవ బలం


Fri,October 13, 2017 01:42 AM

పూర్వం ఒక ఊరిలో ఒక గొప్ప దైవభక్తిపరుడు ఉండేవాడు. ప్రతినిత్యం దైవధ్యానంలో, దైవనామ స్మరణలో లీనమై ఉండేవాడు. క్షణకాలం కూడా సమయం వృథా చేయకుండా ప్రార్థన, ఆరాధనలో నిమగ్నమై ఉండేవాడు. ఊరు ఊరంతా మార్గభ్రష్టత్వంలో మునిగిపోయినా, పాపాల్లో కూరుకుపోయినా తాను మాత్రం మురికి కూపంలో మెరిసిన పద్మంలా స్వచ్ఛంగా ఉండేవాడు. ఎవరితో ఏ విధమైన సంబంధం లేకుండా ఏకాంతంగా, ఎంతో ఏకాగ్రతతో దైవ ప్రార్థనలో నిమగ్నమై ఉండేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఊరంతా భ్రష్టత్వంలో కూరుకుపోయి ఉంటే పరమ భక్తుడైన ఆ మునీశ్వరుడు మాత్రం ఆ దుర్మార్గాలను ఏమాత్రం పట్టించుకోకుండా అన్నిటికీ అతీతంగా కడిగిన ముత్యంలా ఉండడానికి ప్రయత్నించేవాడు.
Samajika-badhyatha
ఈ క్రమంలోనే, మార్గ భ్రష్టత్వంలో నిండా మునిగి, పీకల్లోతు పాపాల్లో కూరుకుపోయిన ఆ ఊరిని సర్వనాశనం చేసి రమ్మని దైవం తన దూతల్ని పంపించాడు. దైవాజ్ఞ ప్రకారం దూతలు దైవశిక్షను అమలుపరచడానికి ఆ ఊరికి చేరుకున్నారు. తీరా వెళ్లిన తరువాత రెప్పపాటు సమయం కూడా వృథా చేయకుండా దైవధ్యానంలో నిమగ్నమై ఉన్న ఆ పరమ భక్తుడు వారికి కనిపించాడు. శిక్ష అమలుపరుద్దామనుకుంటున్న తరుణంలో అంతటి మహా భక్తుణ్ణి చూసి అవాక్కయ్యారు. వెంటనే వాళ్లు దేవుని సన్నిధిలో హాజరై, దేవా! ఆ ఊరిలో క్షణకాలం కూడా సమయాన్ని వృథా చేయకుండా నీ ధ్యానంలోనే తరిస్తున్న ఓ గొప్ప భక్తుడున్నాడు. మరి మేము ఆ ఊరిపై శిక్షను ఎలా అమలుపరచగలం? అని అడిగారు.
అప్పుడు దేవుడు, ఆ ఊరిని శిక్షించే ప్రక్రియను ముందుగా అతని నుండే ప్రారంభించండి. ఎందుకంటే అతను ఏనాడూ సమాజం గురించి పట్టించుకోలేదు. తెలిసో తెలియకో సాటి మనిషి మార్గం తప్పి, భ్రష్టు పట్టిపోతుంటే సన్మార్గాన పెడదామన్న ఆలోచన కూడా చెయ్యలేదు. సమాజంలో అసంఖ్యాకంగా చెడులు ప్రబలిపోతుంటే వాటి నిర్మూలనకు ప్రయత్నించలేదు. ఎవరు ఎక్కడబోతే నాకెందుకు? నేను బాగుంటే చాలనుకున్నాడు. అందుకని శిక్షకు మొట్టమొదటే అతడే అర్హుడు అన్నాడు దైవం. అందుకే సమాజంలో చెడులను మనకెందుకులే అని వదిలేయకూడదు. ఏదో ఒకరోజు అవి మనల్ని కూడా చుట్టుముట్టి మట్టుబెడతాయి. బాధ్యతను విస్మరించినందుకు ఆ పాపంలో వాటా మూటగట్టుకోవాల్సి వస్తుంది.

అందుకే ముహమ్మద్ ప్రవక్త (స) చెడును చూస్తూ సహించేవాడు దైవవిశ్వాసి కాలేడని, అలాంటి మనిసిలో మానవత్వం ఉండదని అన్నారు. దుర్వాసన వస్తున్నప్పుడు ముక్కుకు దస్తీ కట్టుకోవడం, అత్తరు లాంటి సువాసన రాసుకుని, ఇక తాము దుర్గంధానికి దూరంగా, సురక్షితంగా ఉన్నామనుకోవడం భ్రమ మాత్రమే.కాబట్టి సమాజం నుండి చెడులను, దుర్మార్గాలను నిర్మూలించడం, మంచిని, మానవీయ విలువలను ప్రోది చేయడం, నైతిక, ధార్మిక విలువల పునాదులపై సత్సమాజ నిర్మాణానికి శక్తి మేరు ప్రయత్నించడం ప్రతి ఒక్కరి విధి. ముఖ్యంగా దైవ విశ్వాసుల విద్యుక్త ధర్మం.
- మదీహా అర్జుమంద్

705
Tags

More News

VIRAL NEWS

Featured Articles