క్రాంతి శీలుడు


Fri,October 13, 2017 01:40 AM

సదాశయంతో తాము నమ్మిన మార్గంలో పయనించేవారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ మార్గాన్ని వీడిపోగూడదని బుద్ధుడు చెప్పిన సందేశం ఇది. ముందుగా ప్రతి వ్యక్తికీ తాను ఆచరించే సిద్ధాంతంపై ఎనలేని నమ్మకం ఉండాలనేది దీని సారాంశం. పూర్వం వారణాసిని కలాబుడు పాలించేవాడు. అతడు వ్యసనపరుడు. తాగుబోతు. ఒకరోజున బాగా తాగి, నాట్యకత్తెల ఆటపాటలతో గడుపుతున్నాడు. కొంతసేపటికి అలసి నిద్రలోకి జారుకున్నాడు. దాంతో నాట్యకత్తెలు రాజు నిద్రించాడు. నిద్రాభంగం చేయొద్దు అని అనుకొని, మందిరం వదిలి, బైట ఉద్యానవనంలోకి పోయారు.
Kranthi-sheeludu
ఆ వనంలో ఒక చెట్టు కింద ఒక యువ తాపసి ఉన్నాడు. అతని పేరు కుందకుడు. వారు అతని చుట్టూ చేరి, అతను చెప్పే ధర్మ ప్రసంగం వింటూ కూర్చున్నారు. ఇంతలో రాజుకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే నాట్యగత్తెలు లేరు. ఉద్యానవనంలోకి వెళ్లి చూస్తే వారు తాపసి చుట్టూ చేరి ఉండడంతో ఆయనకి ఎక్కడి లేని కోపం వచ్చింది.
ప్రభూ! తాపసి తప్పులేదు. తమకి నిద్రా భంగం అవుతుందని మేమే ఇక్కడికి వచ్చాం అన్నారు. రాజు కోపం అణచుకున్నాడు. అయినా లోలోపల ఉడికిపోతూ,
ఓయీ! తాపసీ! నీ మార్గం ఏమిటి? ఏ మతానికి చెందినవాడవు? అని అడిగాడు.
రాజా! నాది క్షాంతి వాదం అన్నాడు. క్షాంతి అంటే ఓర్పు, సహనం. ఎలాంటి అవరోధాలకూ చెక్కుచెదరని మనోస్థితి. ఈ విషయం తెలిసిన రాజు,
నిజమేనా! లేదా నటనా! పరీక్షించవచ్చా? అని అడిగాడు.
నిరభ్యంతరంగా అన్నాడు తాపసి.
రాజు వెంటనే భటుణ్ణి పిలిచాడు. కొరడాతో వంద దెబ్బలు కొట్టు అని ఆజ్ఞాపించాడు. భటుడు ఆ తాపసి కప్పుకున్న వస్ర్తాన్ని విప్పి, వంద దెబ్బలు తగిలించాడు. అతని శరీరం దెబ్బలకు వాచి, రక్తసిక్తం అయింది. అప్పుడు రాజు,
ఏమి తాపసీ! ఇప్పుడు చెప్పు నీ మతం! అన్నాడు.
రాజా! నాది క్షాంతివాదమే అన్నాడు.
ఇతని చెవులూ ముక్కూ కోయండి అని ఆజాపించాడు. భటులు అలానే చేశారు. అప్పుడు మరలా రాజు,
తాపసీ! ఇప్పుడు చెప్పు నీ వాదం ఏమిటో!
రాజా! ఇప్పటికీ నాది క్షాంతి వాదమే అన్నాడు.
ఇతని కాళ్లూచేతులూ నరకండి అన్నాడు రాజు. భటులు రాజాజ్ఞను అమలు చేశారు.
తాపసీ! ఇప్పటికీ నీది అదే వాదమా?
ఔను రాజా! ఎప్పటికీ నాది క్షాంతివాదమే అన్నాడు.
ఐతే.. పో! అంటూ రాజు వెళ్లిపోయాడు.
కొద్దిసేపటికి తాపసి మరణించాడు. ఈ విషయం ప్రజలకు తెలిసింది. ప్రజలు రాజును దుమ్మెత్తిపోశారు. కలాబుకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కోసల రాజుకి తెలిసింది. దండెత్తి వచ్చాడు. ప్రజల సహకారం లేని కలాబుడు యుద్ధంలో ఓడిపోయాడు. పారిపోతూ మార్గమధ్యంలో తాపసి సమాధి దగ్గరకు వచ్చాడు. నీరసించాడు. దాహం.. దాహం.. అంటూ అల్లాడి సొమ్మసిల్లాడు. ప్రాణాలు విడిచాడు. అతని గురించి పట్టించుకున్నవారెవరూ లేకుండా దిక్కులేని అనాథలా చనిపోయాడు.
- బొర్రా గోవర్ధన్

608
Tags

More News

VIRAL NEWS