దొంగను మార్చిన మహనీయుడు


Sun,September 17, 2017 12:24 AM

Story-illustration
పూర్వం బాగ్దాదు పట్టణంలో ఒక పెద్ద పేరు మోసిన గజదొంగ ఉండేవాడు. ఎన్నిసార్లు పోలీసుల లాఠీదెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు జైలుకి వెళ్లాడో లెక్కే లేదు. అతడి ఆగడాలు భరించలేక చివరికి చేతిని కూడా ఖండించారు. అయినా అతడిలో పరివర్తన రాలేదు. జైలు నుండి తిరిగి రాగానే మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి ఓ పెద్ద భవంతిని దొంగతనం కోసం ఎంచుకున్నాడు. అది బాగ్దాదు నగరంలోనే పెద్ద హోల్‌సేల్ బట్టల దుకాణం. ఒకనాటి రాత్రి ఆ గజదొంగ దుకాణంలోకి దూరాడు. అంత పెద్ద దుకాణమైనా పెద్దగా బందోబస్తు లేకపోవడంతో సునాయాసంగా అందులోకి చొరబడ్డాడు. కళ్లు చెదిరే వస్త్ర సంపదను చూసి, తల తిరిగినంత పనైంది. నచ్చిన థానులు ఎన్నుకున్నాడు. ఒకవైపు తన అదృష్టానికి పొంగిపోతూ, ఎక్కువ మొత్తంలో మూటగట్టుకోలేకపోతున్నానే అని మదనపడసాగాడు. ఒకచేయి ఖండించబడి ఉండడం వల్ల ఒంటిచేత్తో ఎక్కువగా శ్రమించలేకపోతున్నాడు. ఈ స్థితిలో కూడా ఆ గజదొంగకు దుకాణ యజమాని అమాయకత్వం పట్ల విపరీతమైన నవ్వొచ్చింది.

ఇతనికి కాస్తయినా బుద్ధీ జ్ఞానం లేదనుకుంటా. ఇంత విలువైన దుకాణానికి సరైన షట్టర్స్ గానీ, సెక్యూరిటీ గాని పెట్టలేదంటే అమాయకత్వమో, అహంకారమో! అనుకున్నాడు. అంతలో ఆ గజదొంగ భుజాన్ని చల్లని చేతిస్పర్శ తాకింది. వయసు పైబడిన ఒక వృద్ధుడు పక్క గదిలోంచి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయిన దొంగకు ముచ్చెమటలు పట్టాయి. కాని ఆ వృద్ధుడు మిత్రమా! భయపడకు. నేను నీకు సహకరిస్తాను. ముందు ఈ చల్లని నీళ్లు తాగు అంటూ నీటికూజా అతనికి అందించాడు. దీంతో అతను కూడా తనలాగే దొంగతనానికి వచ్చాడని భావించిన గజదొంగ తృప్తిగా మంచినీళ్లు తాగాడు. ఆ వృద్ధుడు ఎంతో ప్రేమగా అతని దేహంపైని స్వేదాన్ని కూడా తన పై కండువాతో తుడిచాడు. వృద్ధుడు తోడు దొరకడంతో రెట్టించిన ఉత్సాహంతో మరో మూటకు సరిపడా తాన్లు పేర్చాడు. అతనితోనే ఒక పెద్దమూట, మరో చిన్న మూట కట్టించాడు. పెద్దమూట వృద్ధుని తలపై పెట్టి, చిన్న మూటను తను ఎత్తుకున్నాడు. శక్తికి మించిన బరువు గల మూటను వృద్ధుడు మోయలేకపోతుంటే నానా మాటలన్నాడు. వాటా ఇస్తే తీసుకుంటావా.. మోయడం చేతగాదు గాని అంటూ దుర్భాషలాడాడు. మార్గమధ్యంలో కొట్టినంత పని చేశాడు. వృద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని చెప్పినట్లు చేస్తూ ఇల్లు చేర్చాడు. ఇంటికి చేరిన తరువాత చిన్న మూటను వృద్ధుడికిస్తూ ఇది తీసుకువెళ్లి హాయిగా బ్రతుకు. అప్పుడప్పుడూ కనబడుతూ ఉండు. ఫో అంటూ హూంకరించాడు.

కాని ఆ వృద్ధుడు ఎంతో వినయంతో, సున్నితంగా దాన్ని తిరస్కరించాడు. గజదొంగకు ఏమీ అర్థం కాలేదు. ఎక్కువ వాటా కోసమూ కాదు. బ్లాక్‌మెయిల్ చేయడానికీ కాదు. మరెందుకు ఈ వృద్ధుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు? దుకాణం నుండి మొదలు ఇప్పటివరకూ... తనకు నీళ్లు తాగించాడు, చెమట తుడిచాడు, తను మోయాల్సిన బరువు మోశాడు. తనతో నానా తిట్లూ తిన్నాడు. అణిగిమణిగి నమ్మిన బంటులా ఇన్ని సేవలు చేశాడు. ఇంత ప్రేమగా ప్రవర్తించాడు. ఇప్పుడు వాటా కూడా వద్దంటున్నాడు గజదొంగ ఈ ఆలోచనల్లో ఉండగానే మరోమారు ప్రేమ నిండిన చూపులతో వినమ్రంగా నమస్కరించి వెళ్లిపోయాడాయన.తెల్లవారి ఉదయం ఏమీ తెలియనివాడిలా బయలుదేరిన గజదొంగ రాత్రి తను దొంగతనం చేసిన బట్టల దుకాణం ముందు మిషన్ కుట్టుకుంటున్న టైలర్ దగ్గరికెళ్లి ఈ దుకాణం ఎవరిదీ.. అని ఆరా తీశాడు. ఆ దర్జీ ఆశ్చర్యంగా, అదేమిటీ! ఈ దుకాణం ఎవరిదో నీకు తెలియదా? జునైద్ బొగ్దాది గారిది అన్నాడు. బాగ్దాదు మొత్తంలో జునైద్ బొగ్దాది పేరు తెలియనివారు లేరు. అలానే ఆ గజదొంగ కూడా ఆ మహనీయుని పేరు విని ఉన్నాడు. కాని ఆయనెవరో తెలియదు.

అలా ఆలోచిస్తూ దుకాణంవైపు అడుగులు వేశాడు. దుకాణమంతా జనంతో కిక్కిరిసి ఉంది. అక్కడ ప్రవచనం వినిపిస్తోంది ఎవరో కాదు. రాత్రి దొంగతనంలో తనకు సహకరించిన వృద్ధుడు. దైవచింతన, పాపభీతి, నైతిక విలువలు, ప్రేమ, సహనం, త్యాగం, పరోపకారం, పరమత సహనం.. ఇత్యాది అనేక అంశాలను బోధిస్తున్నారాయన. లోపలికెళ్లడానికి దారిలేక గుమ్మంలోనే కూలబడ్డాడు గజదొంగ. అంతలో జొహర్ నమాజు సమయం కావడం, అజాన్ పిలుపు వినిపించడంతో సభ ముగిసింది. ప్రజలంతా వెళ్లిపోయారు. గజదొంగ కూర్చున్న చోటు నుండి కదల్లేదు. పాదరక్షల కోసం వచ్చిన ఆ వృద్ధుని కాళ్లను అమాంతం చుట్టేశాడు. తనను క్షమిస్తే తప్ప వదలనని పట్టుబట్టాడు. కరడుగట్టిన గజదొంగలో ఏ శిక్షలూ తేలేని పరివర్తనను తన ప్రవర్తన ద్వారా తీసుకువచ్చిన ఆ మహనీయుడే వస్త్ర దుకాణ యజమాని జునైద్ బొగ్దాది. ఆ మహనీయుని ప్రవర్తనతో ప్రభావితుడైన గజదొంగ మంచివాడిగా, ఆయన శిష్యుడిగా మారి, గొప్ప పండితుడిగా పేరుతెచ్చుకున్నాడు.
- మదీహా అర్జుమంద్

672
Tags

More News

VIRAL NEWS