పూజలో సందేహం వద్దు..!


Sun,September 10, 2017 01:17 AM

Puja
పూజ చేసేటప్పుడు మడిబట్ట కట్టుకోవడం, పూజలో చేసేవన్నీ ఒక పద్ధతి ప్రకారం పాటించడం లాంటివన్నీ ఆచార సంప్రదాయాల్లో భాగాలే. అయితే ఈ ఆచార సంప్రదాయాల కన్నా కూడా భగవంతునిపై చిత్తం ఏమేరకు ఉందనేదే ముఖ్యం. ఇలాంటి కర్మలు ఆచారాల్లో భాగాలే. సంప్రదాయాలను పాటించాల్సిందే. కాని ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించినవి. ఈ శరీరంలో జీవుడు ఉన్నందువల్ల ఇలాంటి సాధారణ కర్మలను చేస్తూ ఉండాలి. అంతేగాని మనం చేసే కర్మల్లో అనుమానాలు వ్యక్తం చేస్తూ, అసలైన ధ్యానం దెబ్బతినకూడదు. కొంతమంది సంప్రదాయబద్ధంగానే పూజ చేస్తుంటారు. ధ్యాస మాత్రం ఎటో ఉంటుంది. ఇలాంటి వాళ్లను కర్మలంపటులు అంటారు. ఇలా భగవంతునిపై ధ్యాస లేకుండా నామమాత్రంగా చేయడం వల్ల ఆయా పూజలు, కర్మల వల్ల కలిగే ఫలం దక్కదు. అంతేకాదు. జీవుడికి యమయాతన కూడా తప్పదని యమధర్మరాజు చెప్పారు. భాగవతంలో భాగమైన అజామిలోపాఖ్యానంలో యమధర్మరాజు ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. నరకంలోకి ఎలాంటివాళ్లను ముందుగా తీసుకురావాలో తన భటులతో చెప్తూ వాళ్ల లక్షణాల గురించి వివరించే సందర్భంలో కర్మలంపటుల ప్రస్తావన ఉంటుంది.

యాంత్రికంగా చేసే పూజలు, నమస్కారాల వల్ల ఫలితం ఉండదు. అందుకే ఎవరైనా సరే ముందుగా తమ మనసును భగవంతుని వైపు ఎన్నిసార్లు ఎలా మళ్లించుకోగలమా అనే ఆలోచించాలి. శరీరంలో జీవుడు ఉన్నందువల్ల సాధారణ కర్మలు నిర్వర్తించాల్సి ఉంటుంది. నిజానికి మనసులో చేసే భగవన్నామస్మరణే అన్నింటి కన్నా ముఖ్యమైంది. సాధారణ కర్మలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అసలైన భగవన్నామ స్మరణ మరువడం తగదంటాడు యమధర్మరాజు.

మడి, ఆచారం వంటివి పాటించాలని మన పెద్దలు చెప్తారు. నిజమే. కాని కొంతమంది ఈ మడి, ఆచారం అనే ప్రవాహంలో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ నిశ్చలమైన మనసుతో భగవంతుడ్ని ధ్యానించరు. ఉదాహరణకి పూజలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న పసిపిల్లవాడు వచ్చి మడిబట్టలు ముట్టుకున్నారనుకోండి. ఇక రణరంగమే. పూజ చేస్తున్నామనే విషయాన్ని కూడా మరిచిపోయి ఆ పసివాళ్లకు పాపం అంటుతుందేమోనని ఆలోచిస్తూ ఉంటారు. మనసు భగవంతునిపై ఉండదు. మడి బట్టలు ముట్టుకున్న పిల్లవాడి మీదనే ఉంటుంది. అదేవిధంగా దీపారాధన కోసం వత్తులు వేస్తున్నప్పుడు ఎన్ని వత్తులు వేయాలి.. నేను చేసేది సరైనదేనా.. ఏ నూనె వాడాలి.. ఇలా ఎన్నో రకాల సందేహాలు. ఈ ఆలోచనల్లో మునిగితేలి భగవంతునికి దూరమవుతారు. యాంత్రికంగా పూజ చేస్తుంటారే గానీ మనసు మాత్రం భగవంతునిపై లగ్నం కాదు.

ఏం చేయాలి?

పరమాత్మను అర్చించేటప్పుడు మనసు ఆయన మీద తప్ప మరే ఇతర అంశాలపై ఉండకూడదు. కనీసం అందుకు ప్రయత్నించాలి. ఎన్ని అనుమానాలున్నా వదిలేయాలి. పసిపిల్లలు దేవుడితో సమానం. ఉదాహరణకు పసిపిల్లవాడు మడి బట్టలు ముట్టుకున్నప్పుడు అతడినే భగవంతుడిగా భావించాలి. నేను కట్టుకోబోయే ముందే నా చీర లేదా పంచె ముట్టుకుని నన్ను ఆశీర్వదించావా తండ్రీ! అంటూ చేతులు జోడించాలి. స్వామికి నైవేద్యం పెట్టకముందే పాపాయి ఎంగిలి చేసిందనుకోండి. అప్పుడు కోపం తెచ్చుకోకుండా భగవతుని అనుగ్రహంలాగే భావించాలి. స్వామీ! నీవే ఈ రూపంలో వచ్చి, నన్ను అనుగ్రహించావా! ఈ నైవేద్యాన్ని తీసుకున్నావా! నాపై నీకెంత కరుణ! అనుకుంటూ స్వామికి నమస్కరించుకోవాలి. ఈ రకమైన ఆలోచనా ధోరణి భగవంతునివైపు మన ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడనే స్పృహను కలిగిస్తుంది. పూజాది కార్యక్రమాల్లో సందేహాలు వచ్చినప్పుడు, నా దగ్గర ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే. ఇక ఏదైతేనేమి! ఇంట్లో ఉన్నది పెడుతున్నా స్వామీ! అని మనసులో గట్టిగా నమ్మి, మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కరిస్తే మనం ఊహించని ఫలితాలను ఆయన కలుగజేస్తాడు.

...? వేదశ్రుతి వెంకట్రామన్

1332
Tags

More News

VIRAL NEWS