సంపూరార్ణావతారం..కృష్ణావతారం!


Sun,August 13, 2017 01:18 AM

చెన్నై ఐఐటిలో ఎంటెక్ చేసిన ఆయన సాఫ్ట్‌వేర్ నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేశారు. శ్రీల ప్రభుపాద స్వామి వారు రాసిన పుస్తకాలు చదివి హరేకృష్ణ మూవ్‌మెంట్ వైపు ఆకర్షితులయ్యారు. ఆయన బాటలోనే నడుస్తూ హరేకృష్ణ మూవ్‌మెంట్‌కి అధ్యక్షులుగా, అక్షయపాత్ర ఫౌండేషన్‌కు సారథిగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు, పేదలకు చేస్తున్న అన్నదానంలో పరమాత్మను దర్శించుకుంటున్నారు. ఇస్కాన్ అక్షయ పాత్ర ద్వారా సుపరిచితులైన ఆయనే సత్య గౌర చంద్ర దాస. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణతత్వం గురించి ఆయనతో చింతన ముఖాముఖి...
Krishna

కృష్ణతత్వంలో ఇమిడివున్న అంశాలేమిటి?

శ్రీమద్భాగవతం పండులా తియ్యనిది. ఇది 18000 శ్లోకాలతో ఉంది. దీన్ని మొదట శుక మహర్షి చెప్పడంతో మరింత తియ్యగా మారింది. కృష్ణావతారం దివ్యమైనదని చెప్తుంది భాగవతం. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణుడే చెప్పాడు.
జన్మ కర్మచ మే దివ్యం
ఏవం యో వ్యక్తితత్వతఃతత్వ దేహం పునర్జన్మనైతి
మామేతి సో అర్జునః (భగవద్గీత 4.9)
మనం ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా, ఏ సంబంధమైనా కలిగి ఉండాలన్నా మన స్వభావం, అభిరుచుల గురించి మాట్లాడతాం. కృష్ణ భగవానుడు కూడా మనతో తన గురించి, తన స్వభావ లక్షణాల గురించి చెప్పాడు భగవద్గీత ద్వారా. తాను భౌతిక నియమాలకు అతీతమైనవాడినంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన జన్మ,కర్మలు దివ్యమైనవి. ఆయన సాధారణంగానే గర్భం నుంచి వచ్చినట్టుగానే అనిపిస్తుంది. కాని ఆయన పుట్టుకే అతిశయమైనది. దేవకి గర్భం నుంచి బయటికి రాగానే ఆమె ముందు నిల్చుంటాడు. సాధారణ పిల్లవాడు అలా నిలబడగలడా! ఆ తర్వాత చిన్న పిల్లవాడిలా మారిపోతాడు కాని శంఖ, చక్ర, గదాయుధాలన్నీ ఉంటాయి. అప్పుడు దేవకి ఆ అసామాన్యమైన రూపాన్ని చూసి కంసుడు ఊరుకోడని ఆయన్ని సాధారణమైన సామాన్య రూపంలోకి రమ్మని కోరుతుంది. అప్పుడు కృష్ణుడిలా సాధారణంగా కనిపిస్తాడు. ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చిన స్వామి. నిజానికి మనమందరం అక్కడి వాళ్లమే. ఆయన్ని కాదనుకుని వచ్చాం. ఆయన జగత్ప్రభువు కదా! తండ్రి దగ్గర మనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. అందుకే పిల్లవాడు ఆడుకోవడానికి ఇల్లు, బొమ్మలు అడిగినట్టుగా ఈ ప్రపంచాన్ని అడిగాం. మనం నివసిస్తున్నది వైకుంఠాన్ని పోలిన మరో చిన్న ప్రపంచంలో. ఆడుకోవడానికి మనం కోరిన మీదటే ఇంకో ప్రపంచాన్ని ఆయన సృష్టించాడట.

దశావతారాల్లో కృష్ణుడికి ఉన్న ప్రత్యేకతలేంటి?

కృష్ణుడితో మనకు 5 రకాల సంబంధాలుంటాయి.
-మొదటిది శాంత రసం : ఒక రకంగా చెప్పాలంటే ఇది భగవంతుడికీ, భక్తుడికీ ఉన్నటువంటి సంబంధం. ఏ బంధానికైనా ఆది, అంతం ఉంటుంది. కాని ఆయనతో ఉండేది శాశ్వతమైన బంధం.
మన పైన ఉన్న శరీరం మన ఆత్మకు వస్త్రం లాంటిది. మనం ఆత్మ స్వరూపులం. ఆయనతో మనకు ఆత్మైక సంబంధం ఉంటుంది. ఆయన్ని చూస్తూ రసానుభూతి పొందే బంధమిది.
-రెండవది దాస్య రసం: భగవత్సేవలో తరించడం. హనుమంతుడు దాస్యానికి ప్రతీక.
-మూడవది సఖ్యం: ఆయనతో మనం స్నేహం చేయొచ్చు. స్నేహం ద్వారా ఆయన్ని కొలువొచ్చన్నమాట. ఇందుకు గొప్ప ఉదాహరణ కుచేలుడు, గోపకులు.
-నాలుగోది వాత్సల్య రసం: భగవంతుని పట్ల వాత్సల్యాన్ని కలిగి ఉండడం. ఈ సంబంధం ఆయనే కుమారుడు అనే అనుభూతిని కలిగిస్తుంది. ఇందుకు యశోద మంచి ఉదాహరణ.
-అయిదవది మాధుర్య రసం: ఇది రెండు రకాలు.

స్వకీయం - పరమాత్మనే పతిగా ఆరాధించడం ఈ కోవలోదే. గోపికలు, కృష్ణుని భార్యలు ఈ కోవలోకే వస్తారు. పరకీయ - ఆయన్ని ప్రియునిలా భావించడం. రాధ ఈవిధంగానే ఆయన సేవలో తరించింది. ఇన్ని రకాల సంబంధాల్లో మనం ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. ఏ యధామాం ప్రపధ్యంతే తాం స్తతైవ భజామ్యహం నువ్వు ఎలా తలిస్తే అలా కనిపిస్తాను. ఏ రకంగా కావాలనుకుంటే అలా వస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకే ఆయన్ని కల్పవృక్షం అంటారు. దశావతారాల్లో కెల్లా కృష్ణుడిని సంపూర్ణావతారం అంటారు. అన్ని రకాల సంబంధాలను ఒకే అవతారంలో చూపించాడు. ఆయన్ని అఖిల రసామృత సింధు అని అందుకే అంటారు.

బ్రహ్మానందం అంటాం కదా. అలాంటి ఆనందాన్ని పొందే దారి ఏది?కృష్ణుని ఆరాధనలో వచ్చే ఆనందం అతిశయమైనది. దీని ముందు భౌతికమైన ఆనందాలు ఎందుకూ పనికిరావు. బ్రహ్మానందం పొందడం అని అంటుంటారు కదా. బ్రహ్మానందమంటే ఆత్మానందం. ఆ బ్రహ్మానందమనే సముద్రంలో భౌతికానందం ఒక బొట్టంత. అలాంటి సముద్రంలాంటి బ్రహ్మానందం కూడా కృష్ణానంద సాగరంలో ఒక బొట్టంత. అంటే అన్ని ఆనందాల కంటే కృష్ణానందం దివ్యమైనదన్నమాట. అయితే పచ్చకామెర్లు ఉన్నవాళ్లకి చెరుకు తీపి తెలియనట్టుగా అజ్ఞానంలో ఉన్నవాళ్లకు ఈ ఆనందపు రుచి తెలియదు. ఆ జబ్బు పోవాలంటే ఆచార్యుల వద్ద సాధన తీసుకుని, శాస్ర్తానుగుణంగా పాటించాలి. అప్పుడు జబ్బు తగ్గి ఆరోగ్యంగా అవుతాం. భగవత్సంబంధాన్ని పునరుద్ధరించుకోగలుగుతాం. ఇక ఆయన్ని వదిలి వెళ్లడానికి ససేమిరా అంటాం. భవసముద్రంలో పడను అని మొరపెట్టుకుంటాం. ఆత్మకి ఈ విషయాలన్నీ తెలుసు. కాని మర్చిపోయాం. సాధన వల్ల నిద్రాణ స్థితి నుంచి బయటికి వస్తుంది.
భగవంతుని చేరుకోవాలన్నా, కృష్ణానందాన్ని పొందాలన్నా ఎలాంటి సాధన చేయాలి?
పద్మ పురాణంలో నాలుగు రకాల సంప్రదాయాలున్నాయి. అవి బ్రహ్మ, శ్రీ, కుమార, రుద్ర సంప్రదాయాలు. ఇవన్నీ భగవంతుని గురించిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుతాయి. విష్ణు/కృష్ణ గురించి జ్ఞానం ఇస్తాయి. మేము పాటించేది బ్రహ్మ మధ్వ గౌడ్య సంప్రదాయం. దీని ప్రకారం హరినామ సంకీర్తనే సాధన.

హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
ఇతి షోడశక నామ్నాం కలికల్మశ నాశనం.
నాథః పరతురోపాయ సర్వవేదేశు దృశ్యతే అని చెప్తోంది కలి సంతరణ ఉపనిషత్తు.

హరే అంటే భగవంతునికి ఉన్న శక్తి అంటే రాధ అని అర్థం. ఈ విధంగా హరే కృష్ణ అంటే రాధా కృష్ణ అనీ, హరే రామ అంటే సీతా రామ అనీ అర్థాలున్నాయి. ఈ నామం కీర్తించడమంటే మనల్ని తిరిగి ఆయన సేవలో ఉండేట్టుగా అనుగ్రహించమనీ, తన దగ్గరికి తిరిగి తీసుకువెళ్లమనీ అర్థం. నీతో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించమని ఆయన్ని పిలవడం. ఈ సంకీర్తన తులసిమాల (జపమాల) ద్వారా రోజుకి 16 మాలలు చేయాలి. ఇలా కీర్తించడం వల్ల మన పంచేంద్రియాలనూ కేంద్రీకరించి ధ్యానించడం సాధ్యమవుతుంది. ఎలాగంటే కంటితో ఆయన్ని చూస్తూ, చెవులతో నామం వింటూ, తులసిమాలను స్పర్శిస్తూ, నాలుకతో పలుకుతూ - ఇలా పంచేంద్రియ సహిత ధ్యానం అవుతుంది. కలికాలంలో నామ శబ్దమే కృష్ణుడు. కలికాలే నామరూప కృష్ణ అవతార్ అంటారు.

కలేర్ దోష నిధే రాజన్

అస్తిః యేకో మహాన్ గుణఃకీర్తనా దేవ కృష్ణస్య
ముక్త సంగః పరం వ్రజేత్(భాగవతం 12వ స్కంధం)
కలియుగంలో అన్నీ దోషాలే. పండ్లు, కూరగాయలు, నీరు, గాలి, పాలు అన్నీ కలుషితమే. ఎటు చూసినా దోషాలే. కాని ఒక్క మంచి గుణం ఉంది. అదేంటంటే కృష్ణ కీర్తన. అది చేస్తే ముక్తుడివి అవుతావని భాగవతం చెప్తోంది.

ఇస్కాన్ వైపు మీరు ఎలా ఆకర్షితులయ్యారు?

చెన్నైలో ఐఐటి చేస్తుండగా మా కాలేజ్‌కి రష్యన్ యూనివర్సిటీలో పనిచేసే మ్యాథ్స్ ప్రొఫెసర్ వచ్చారు గెస్ట్ లెక్చర్ కోసం. ఖాళీ టైంలో ఆయన భగవద్గీత మీద క్లాస్ తీసుకుంటారని చెప్పారు. ముస్లిం అయిన ఆయన భగవద్గీత క్లాసు చెప్పడం అనేసరికి నాకు ఆసక్తి కలిగింది. ఆయన అప్పటికే హరేకృష్ణ మూవ్‌మెంట్‌లో ఉన్నారు. ఆయన పేరు ఐరావత దాసు. క్లాసు విన్నాక భలే ఉందే అనిపించింది. నేర్చుకుంటే బావుంటుందనుకున్నా. అక్కడ ఆగిన ఆలోచన బెంగుళూరులోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు మళ్లీ చిగురువేసింది. నా రూమ్మేట్స్ హరేకృష్ణ భక్తులు కావడంతో వాళ్లతో పాటు దగ్గర్లోనే ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్లేవాణ్ణి. అక్కడ శ్రీల ప్రభు పాద స్వామి వారివి కొన్ని పుస్తకాలు చదివాను. వాటి ప్రభావం చాలా పడింది. అలా మొదలైన ఆధ్యాత్మిక ప్రస్థానం 1997లో హరేకృష్ణ మూవ్‌మెంట్‌లోకి ప్రవేశించేలా చేసింది. నేను చదువుకున్న యూనివర్సిటీలోనే భగవద్గీత చెప్పే స్థాయికి తీసుకువచ్చింది. ఇప్పుడు కూడా దేవస్థానాల్లో భగవద్గీత, భాగవతంపై క్లాసులు తీసుకుంటున్నాం.యువత కూడా ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతున్నారు. వారిలో తమ ఉనికిని గురించి అనేక ప్రశ్నలున్నాయి. వాటికి సమాధానాల కోసం వెతుకుతున్నారు. ఈ ప్రపంచం ఏంటి? నేనెవరు? కోపం, శత్రుత్వం వంటివి ఎందుకు? ఇంతమంది దేవుళ్లు, మతాలు ఎందుకున్నాయి? మంచివాళ్లకే చెడు ఎందుకు జరుగుతుంది? పునర్జన్మలున్నాయా? మరణం తరువాత ఏమవుతుంది? లాంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నారు.

1020
Tags

More News

VIRAL NEWS

Featured Articles