విశ్వాసులే మార్గదర్శకులు


Sun,August 13, 2017 01:04 AM

Kuraan
దుర్మార్గాల నిర్మూలన, సత్కార్యాల స్థాపన పైనే మానవాళి సాఫల్యం ఆధారపడి ఉంది. ఈ గురుతరమైన బాధ్యతను గుర్తుచేస్తూ పవిత్ర ఖురాన్ ఇలా అంటున్నది -
మీలో కొందరు ప్రజలను మంచివైపుకి పిలిచేవారు, సత్కార్యాలు చేయమని ఆదేశించేవారు తప్పకుండా ఉండాలి. అలాంటివారు మాత్రమే ఇహ పర లోకాలలో సాఫల్యం పొందేవారు... (3-104). మరొక చోట విశ్వాసులారా! ఇక నుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరే. మీరు సత్కార్యాలు చేయమని ప్రజలను ఆదేశిస్తారు. దుష్కార్యాల నుండి వారిస్తారు. దైవాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు. (3-110).

పవిత్ర ఖురాన్‌లోని ఈ వాక్యాల్లో దైవ విశ్వాసుల జీవిత లక్ష్యం ఏమిటో, వారు నిర్వర్తించవలసిన బాధ్యతలేమిటో విశదీకరించడం జరిగింది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు సమాజంలో ప్రబలి ఉన్న చెడులను, రుగ్మతలను అరికడుతూ మంచిని, మానవీయ విలువలనూ వ్యాపింపచేస్తూ ప్రజలను సంస్కరించడానికి కృషి చేయాలని మనకు అర్థమవుతున్నది. అందుకే పవిత్ర ఖురాన్ ప్రజల్లో దైవభీతిని, పరలోక చింతనను జనింపచేసి తద్వారా వారిని నీతిమంతులుగా, సత్పౌరులుగా తీర్చిదిద్దాలని అభిలషిస్తున్నది. మూఢ నమ్మకాలు, దురాచారాలతో సహా ప్రపంచంలోని అన్ని రకాల చెడులను నిర్మూలించి చక్కని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పదలిచింది. ఈ లక్ష్య సాధన కొరకు పవిత్ర ఖురాన్ దైవ విశ్వాసులపై మంచిని పెంచే, చెడును నిర్మూలించే బృహత్తర బాధ్యతను నిర్బంధం చేసింది. దీనికోసం దైవ విశ్వాసులు ఒక సంఘటిత శక్తిగా రూపొందాల్సిన ఆవశ్యకతను అది గుర్తు చేస్తున్నది.

సమాజ సంస్కరణ, సత్సమాజ నిర్మాణం, మానవాళి ఇహపర సాఫల్యం.. దీని కోసమే దైవ ప్రవక్త మొహమ్మద్ (స) కాలంలో ఆ తరువాతి ఖులఫాయెరాషిదీన్‌ల కాలంలో దైవ విశ్వాసులు ధర్మం, న్యాయం కోసం తమ సర్వస్వాన్ని ధారపోసి కృషి చేశారు. సమాజంలో ఎక్కడ ఏ కొద్ది చెడు కనిపించినా దాన్ని అంతం చేసేవరకు ప్రశాంతంగా నిద్రపోయేవారు కాదు. ప్రజల్లో పాపభీతిని, దైవభీతిని నూరిపోస్తూ, దుర్మార్గాలకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించేవారు. దీని ఫలితంగా ఆనాడు సమాజంలో ఎల్లెడలా నీతి, న్యాయం, శాంతి, సౌశీల్యం, సౌభ్రాత్రతలు వెల్లివిరిశాయి. ధర్మ పరాయణత, బాధ్యతా భావం, జవాబుదారీతనం, పరస్పర గౌరవాభిమానాలు సర్వత్రా విస్తరించాయి. నిజంగానే అదొక స్వర్ణయుగం. ప్రపంచమంతా కీర్తించిన కాంతి యుగం. కాని ఆ యుగం అంతరించింది. ఈ దుస్థితి మారాలంటే చెడులు అంతమయ్యేవరకు అలుపెరుగని పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చాలి. అప్పుడు మాత్రమే సమాజ సంస్కరణ సాధ్యమవుతుంది. ఇహపర సాఫల్యం సిద్ధిస్తుంది.
- యం.డి. ఉస్మాన్ ఖాన్

420
Tags

More News

VIRAL NEWS