అహంపతనానికి నాంది


Sat,July 29, 2017 11:52 PM

Gambar
గర్వం, అహంకారం సైతాన్ గుణాలు. కేవలం అహం కారణంగానే వాడు దైవానికి అవిధేయుడై దుర్మార్గుల్లో కలిసిపోయాడు. ధూర్తుడిగా మిగిలిపోయాడు. దైవం మానవుణ్ణి సృష్టించిన తరువాత, అందరూ అతనికి సజ్దా (సాష్టాంగ ప్రణామం) చెయ్యాలని ఆదేశించాడు. ఫరిష్తాలతో (దైవదూతలు) సహా అందరూ ఆదిమానవుడికి సాష్టాంగ అభివాదం చేశారు. కాని సైతాన్ చేయలేదు. దైవాదేశాన్ని ధిక్కరించాడు. దీనికి కారణం వాడిలోని అహమే అంటూ చెబుతోంది పవిత్ర ఖురాన్.
అహం అంటే తానే గొప్పవాడినని భావించడం, ఇతరులను తక్కువగా చూడడం. సైతాన్ ఇక్కడ రెండు తప్పులు చేశాడు. ఒకటి దైవాదేశాన్ని తిరస్కరించడం. రెండోది ఆది మానవుణ్ణి తనకన్నా తక్కువవాడిగా, నీచుడిగా చూశాడున. తన సృజన అగ్నితో జరిగింది కాబట్టి మట్టితో సృష్టించబడినవాడి కంటే తానే గొప్పవాడినన్న అహం అతడిది. అదే సత్య తిరస్కారానికి కారణమైంది. ఈ విధంగా వాడు తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు.

గర్వం, అహంకారాల వల్ల మనిషిలో దైవం పట్ల తిరుగుబాటు ధోరణి, విద్రోహ భావనలు జనిస్తాయి. ఇవి మానవుడి ఆంతర్యంలో ఏ స్థాయిలో ఉంటాయో దైవం పట్ల తిరుగుబాటు కూడా అదే స్థాయిలో ఉంటుంది. దైవం తనకు ఇవ్వని స్థానాన్ని, స్థాయిని అతని మనసు బలంగా కోరుకుంటుంది. ఎవరి మనసులోనైతే ఇలాంటి అహం ఉంటుందో అలాంటివారి మనస్తత్వం దేవుని విధేయతకు, సత్యాంగీకారానికి సిద్ధమవడం అసంభవం. అహంకారి సమాజంలో తనకో గొప్ప స్థానం ప్రాప్తం కావాలని కోరుకుంటాడు. మరెవరూ తన స్థాయికి కనీసం దరిదాపుల్లోకి రావడాన్నీ అతడు సహించలేడు. అంతా తన పెత్తనమే సాగాలని అభిలషిస్తాడు. ఈ వైఖరి సరైనది కానప్పటికీ ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ అతనిలోని అహం తప్పుడు వైఖరి గురించి ఆలోచించే అవకాశమే ఇవ్వదు. మంచి అనేది తనలోనే ఉందని, ఇతరులు చేరుకోకముందే తాను అందిపుచ్చుకుంటానని అతను భావిస్తాడు. ఎదుటివారిలోని ఏ నైతిక సుగుణాన్నీ అతను అంగీకరించడు. నైతిక వర్తనుడైనా, సౌజన్యశీలుడైనా అంతా తానేనని తలపోస్తాడు.

ఇలాంటివారిని ఎవరైనా సంస్కరించడానికి ప్రయత్నిస్తే లేక ఎవరైనా తమ తప్పులు ఎత్తిచూపితే సహించలేరు. ఎన్ని ఇబ్బందులకైనా సిద్ధపడతారు. కాని ఒకరి హితవును స్వీకరించడానికి సిద్ధపడరు. తమను తాము సంస్కరించుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోరు. ఇలాంటివారు తమ అహంకార వైఖరి కారణంగా తమను తామే నష్టపరుచుకుంటారు. ఇదంతా దైవాదేశాలను కాదన్న ఫలితం. ఇలాంటి వారిని గురించి పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది : కొందరు తమ వద్ద ఎలాంటి ప్రమాణం లేకపోయినా దేవుని సూక్తుల విషయంతో వితండవాదం చేస్తారు. వారి మనసులో తామేదో గొప్పవాళ్లమన్న అహంకారం తిష్ట వేసుకొని ఉంది. కాని ఆ గొప్పదనానికి వారు ఎన్నటికీ చేరుకోలేరు. కనుక నీవు అల్లాహ్ శరణు వేడుకో. ఆయన అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. (41-56)
- యం.డి. ఉస్మాన్ ఖాన్

553
Tags

More News

VIRAL NEWS