వైరం వైరాన్ని చంపదు!


Sun,July 23, 2017 12:52 AM

నహి వైరేణ వైరాణి శామ్యంతీహ కదాచన
అవైరేణ చ శామ్యంతి ఏషధర్మః సతాతనః

Story-Illustration
వైరం వల్ల వైరం ఈ లోకంలో ఎప్పుడూ నశించదు. మైత్రి వల్లనే వైరం పోతుంది. ఇదే ఎన్నటికీ, ఎప్పటికీ మారని సత్యం. సనాతన ధర్మం. ఇదే బుద్ధ ధమ్మసారం. ఈ విషయాన్ని బౌద్ధంలోని దీర్ఘాయు కథ తెలియజేస్తుంది. కోసల రాజు దీధితి. కాశీరాజు బ్రహ్మదత్తుడు. ఇరు రాజ్యాలకూ 32 తరాల వైరం. ఒకరాజును మరో రాజు చంపుకొంటూనే వస్తున్నారు. ఒకసారి బ్రహ్మదత్తుడు కోసల మీదికి దాడి చేశాడు. ఓడిపోయిన కాశీరాజు భార్య, తన ఏకైక కుమారునితో పారిపోయాడు. తమ ఉనికి తెలిస్తే బ్రహ్మదత్తుడు చంపడం ఖాయం అని భయపడిన కోసల రాజు ఒక కూలివానిగా మారి, కాశీ పట్టణానికే చేరాడు. అక్కడే ఒక కుమ్మరి ఇంట్లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. బ్రహ్మదత్తుడు పారిపోయిన కోసల రాజు కోసం వేగుల్ని పంపి, రాజ్యాలన్నీ వెతికిస్తూనే ఉన్నాడు.

వారు తన రాజధానిలోనే ఉన్నారనే విషయం గ్రహించలేకపోయాడు. ఏనాటికైనా తమ సమాచారం తెలిస్తే తమతో పాటు తన కుమారునికి కూడా ప్రమాదమే అని నమ్మిన కోసల రాజు తన కుమారుడు దీర్ఘాయువుని మరో సుదూర గ్రామంలో ఉంచాడు. కుమారునికి విషయం అంతా చెప్పాడు. పన్నెండేళ్లు గడిచాయి. దీర్ఘాయువుకి పదహారేళ్లు నిండాయి. ఒకసారి తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు. కాశీకి వచ్చాడు. అతను వచ్చిన సమయంలోనే బ్రహ్మదత్తునికి కోసలరాజు రహస్యం తెలిసింది. పట్టి, బంధించి తెమ్మని భటుల్ని పంపాడు. భటులు వచ్చి తల్లిదండ్రుల్ని బంధించి, తీసుకుపోతున్న సమయానికి దీర్ఘాయువు వెళ్లాడు.

అప్పుడు కోసలరాజు తన బిడ్డతో, నాయనా! వైరం వైరాన్ని చంపదు. మైత్రి మాత్రమే వైరాన్ని చంపేస్తుంది అని అన్యాపదేశంగా సందేశం ఇచ్చాడు. బ్రహ్మదత్తుడు ఆ తల్లిదండ్రులిద్దర్నీ చంపేశాడు. ఆ కక్షతో దీర్ఘాయువు సంగీత విద్వాంసునిగా శుభగుప్తుడు అనే పేరుతో బ్రహ్మదత్తుని ఆస్ధానంలో చేరి, మెల్లగా అతనికి ఆంతరంగికునిగా మారాడు.
ఒకసారి దీర్ఘాయువుని వెంట తీసుకుని వేటకు వెళ్లాడు బ్రహ్మదత్తుడు. దీర్ఘాయువు రాజుని జాగ్రత్తగా దారి తప్పించి నట్టడివిలోకి చేర్చాడు. దిక్కులేని ఆ ప్రదేశంలోకి చేరాక రాజుకి అలసట వచ్చింది. శుభగుప్తా! అలసిపోయాను.

మంచి పాట పాడు. విశ్రమిస్తాను అని అతని తొడపై తల పెట్టుకుని పడుకున్నాడు రాజు. అదే మంచి సమయం అనుకుని తన తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తన ఒరలోంచి కత్తి లాగాడు. ఒక్క వేటుతో తల నరికివేయాలనుకుని, కత్తి ఎత్తాడు. ఇంతలో తండ్రి చెప్పిన ఆఖరి సందేశం గుర్తొచ్చింది. తమాయించుకొని కత్తి దించాడు. ఆ సమయంలో కళ్లు తెరిచి చూసిన రాజు, ఎవరవు నీవు? అని అడిగాడు. దీర్ఘాయువు విషయం చెప్పాడు. శుభగుప్తా! నేను ఎంతో తప్పు చేశాను. చంపాల్సిన వ్యక్తి ఒళ్లో ఉన్నా, చంపడానికి చేతిలో కత్తి ఉన్నా, చంపేందుకు పూర్తి అవకాశం ఉన్నా - చంపలేదు చూడు - అదే మానవత్వం అంటే.. నా కంటే నీవూ, నీ తండ్రే గొప్పవారు. మీ రాజ్యం నీవే తీసుకో. నేనూ ఈనాటి నుండి మీ తండ్రి చెప్పిన ధర్మోపదేశాన్ని పాటిస్తాను అని చెప్పి, అలాగే చేశాడు. ఆ ఇరు రాజ్యాలు ఎన్నో వందల తరాల పాటు మైత్రితో మెలిగాయి.
- బొర్రా గోవర్ధన్

430
Tags

More News

VIRAL NEWS