నమో బుద్దాయ!


Sun,July 9, 2017 01:01 AM

బుద్దుడు ఈ ప్రపంచానికి కొత్తదారి చూపించిన మార్గదర్శి. శాంతి, సహనం, ప్రేమ, కరుణ, శీలం, ధ్యానం, ఉపేక్ష, త్యాగం, వీర్యం, సత్యం లాంటి మానవీయ గుణాలతో మనసుల్ని పునర్నించిన పరమోత్తమ ధార్మికుడు. ఆయన ఒక సంస్కర్త. సంఘ నిర్మాత. ఒక తాత్వికుడు. మార్గదర్శి. ఒక నాయకుడు. ఒక సామాజిక విప్లవకారుడు. ఒక ఆర్థికవేత్త. రాజనైతికవేత్త. ఆధునిక ప్రపంచం నడిచే అన్ని మానవీయ మార్గాలూ ఆయన మార్గంలో నుంచి పుట్టినవే! అందుకే రెండువేల ఐదువందల సంవత్సరాలైనా ఈ ప్రపంచానికే వెలుగుగా నిలిచాడు. ఆషాఢ పున్నమి (అంటే నేడు) బుద్ధుడు మొట్టమొదట ప్రబోధం చేసిన రోజు. అందుకే బౌద్ధ సంప్రదాయంలో నేడు బుద్ధ పూర్ణిమ - గురు పూర్ణిమగా జరుపుకొంటారు.
Buddhudu
మానవత్వాన్ని ఒక ధర్మంగా ప్రబోధించిన తాత్తికుడు గౌతమ బుద్ధుడు. ఆయన సిద్ధాంతం కరుణ, ప్రేమ, దయ, దానం, శీలం, జ్ఞానం, ప్రజ్ఞ, జీవకారుణ్యంతో నిండి ఉంటుంది.
ఈ ప్రపంచం దుఃఖమయం అనీ, ఆ దుఃఖాన్ని నిరోధించే మార్గం ఏమిటనీ చిన్నప్పటి నుండే ఆలోచించేవాడు. ఒక రాజ్యానికి మహా చక్రవర్తిగా ఉంటే ప్రజల ఇబ్బందుల్ని తొలగించవచ్చు గానీ, మానసికమైన దుఃఖాన్ని తొలగించలేమని భావించాడు. చక్రవర్తిగా కంటే తత్త్వవేత్తగానే దుఃఖనివారణా మార్గాన్ని కనుక్కోవాలనుకున్నాడు. ఆ అన్వేషణ కోసం రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని, కుటుంబాన్ని త్యజించాడు.

ఇల్లు వదిలిన నాటి నుండి ఆరేళ్లు అహోరాత్రులు అన్వేషణ సాగించాడు. అంతవరకూ ఉన్న ధర్మాలూ, మార్గాలేవీ మానవ జాతిని దుఃఖాన్నుండి కాపాడలేవని అవగతం చేసుకున్నాడు. తనదైన సొంత మార్గంలో సాధన, శోధన సాగించాడు. ఆత్మ, పరమాత్మ, దైవం చుట్టూ కాకుండా మనిషి, మనసు, ఆలోచనలు, మానవ సమాజాలు, కోర్కెలు, ఆరాటాలు.. ఈ విషయాల మీద శోధన కొనసాగించాడు. దుఃఖం పుట్టుకకు కేంద్రబిందువు మనసే అని గ్రహించాడు. ఆ మనసుకి సరైన చికిత్స చేస్తే దుఃఖం దూరమవుతుందని నిర్ధారణకు వచ్చాడు. మనోవిశ్లేషణ సాగించి, దాన్ని దుఃఖదూరం చేయాలంటే తగిన మార్గం కూడా కనుగొన్నాడు. అదే ఆయనకు కలిగిన జ్ఞానోదయం. ఆ మార్గమే అష్టాంగమార్గం.

దుఃఖ నివారణకు 8 మార్గాలు

అష్టాంగ మార్గం జ్ఞానం, శీలం, ధ్యానం అని మూడు భాగాలు. సరైన దృష్టి (సమ్యక్ దృష్టి), సరైన నిర్ణయం (సమ్యక్ సంకల్పం), సరైన మాట (సమ్యక్ వాక్కు) అనేవి మూడు జ్ఞాన విభాగానికి చెందినవి. ఈ మూడు అంగాల్నీ సాధిస్తే మనకు సరైన దృక్పథం ఏర్పడుతుంది.
అలాగే.. సరైన పని (సమ్యక్ కర్మ), సరైన జీవనం (సమ్యక్ ఆ జీవం) ఈ రెండూ శీల విభాగానికి చెందినవి. ఈ మూడూ సాధిస్తే సమాజంతో మంచి సంబంధాలు కలిగి ఉంటాము.

ఇక.. సమ్యక్ ప్రయత్నం, సరైన ఎరుక (సమ్యక్ స్మృతి), సరైన ఏకాగ్రత (సమ్యక్ సమాధి) - ఈ మూడూ ధ్యాన విభాగానికి చెందినవి.
ఈ మూడు అంగాలూ సాధిస్తే మనల్ని మనం శుద్ధి చేసుకుంటాము. ఆంతరంగిక పరిశుద్ధి కలుగుతుంది. వ్యక్తి, సమాజం, జ్ఞానం ఈ మూడు విషయాల్లో మనకి సరైన దృక్పథం ఉంటే దుఃఖం దూరమవుతుంది.

అదే గురు పూర్ణిమ!

ఈ విశ్వంలో శాశ్వతమైనది ఏదీ లేదని, ప్రతిదీ ప్రతిక్షణం మారిపోతూ ఉంటుందని, ప్రతిదీ క్షణికమే అనీ, అందుకే మనసూ ప్రతిక్షణం మారిపోతూ ఉంటుందని, ఈ మార్పులు, ఈ మార్పుల్లో వచ్చిన అంతరాలు, భేదాలే దుఃఖ హేతువులుగా భావించాడు. వీటిని అర్థమయ్యేలా చెప్పడం సాధ్యమా? కాదా? ప్రజలు దీన్ని అర్థం చేసుకోగలరా? లేదా? అని ఏడు వారాలు ఆలోచించి.. వీటిని సాధారణ ప్రజలకు కూడా అర్థం అయ్యేలా బోధించాలని అందుకోసం ఒక ఆశ్రమంలో తిష్టవేసి కూర్చోకుండా నిరంతరం జనంలో తిరిగి ప్రబోధాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

తొలిగా బుద్ధగయ నుండి సారనాథ్‌కి వెళ్లి ఆషాఢ పున్నమి రోజున కౌండిన్యుడు, కశ్యపుడు, బుద్దియుడు, అశ్వజిత్తు, మహానామ అనే ఐదుగురు మిత్రులకు తాను కనుగొన్న విషయం చెప్పాడు. ఐదు రోజులు వారికి తన నూతన మార్గాన్ని గురించి ప్రబోధించాడు.
అంత జటిలమైన విషయం కూడా వారికి చాలా తేలిగ్గా అర్థమై, వారు తమ దారిని మార్చుకుని ఆయనకు అనుయాయులుగా మారారు. ఆనాటి నుండి బౌద్ధ సంప్రదాయంలో గురుపూర్ణిమ ప్రారంభమైంది. పండితులకి, పామరులకు, తత్త్వవేత్తలకు - ఎవరి స్థాయిని బట్టి వారికి అర్థమయ్యేలా చెప్పగల గొప్ప ప్రబోధకుడు కాబట్టే బుద్ధుడిని మహాశాస్త అంటే మహా గురువుగా అభివర్ణిస్తారు.

అంతేకాదు.. దుఃఖ వినాశకుడు, క్లేశ వినాశకుడు కాబట్టి భగవానుడు, నిర్వాణాన్ని పొందిన వాడు కాబట్టి అరహంతుడు, సంపూర్ణ సంబోధి పొందాడు కాబట్టి సమ్మాసంబుద్ధుడు, నిర్వాణ పథాన్ని చూపాడు కాబట్టి సుగతుడు, లోకం శోకం బాపినవాడు కాబట్టి లోకవిదుడుగా పాళీ జయమంగళంలో కీర్తింపబడింది.
మహాగురువు అయిన తథాగత బుద్ధునికి, అతని మార్గానికి, సంఘానికి వందనం.
- బొర్రా గోవర్ధనం

బుద్ధుడు-నామాలు

బౌద్ధపండితుడు అమరసింహుడు రాసిన అమరకోశంలో, త్రిషిటకాల్లోని జయమంగళ గాథల్లో బుద్ధుణ్ణి అనేక రకాల పేర్లతో ప్రస్తుతించారు.
సర్వజ్ఞః సుగతో బుద్దో ధర్మరాజస్తథాగతః
సమంత భద్రో భగవా న్మారజిల్లోక జిజ్జినః
షడ్‌భిజ్ఞోదశబల్కోద్వయవాదీ వినాయకః
మునీంద్రః శ్రీఘనః శాస్తామునిః
సశాక్ససింహస్సర్వార్థసిద్ధ భౌద్ధోదనిశ్చసః
గౌతరశ్చార్కబంధుశ్చ మాయాదేవీ సుతశ్చసః

సమస్తం ఎరిగినవాడు కాబట్టి సర్వజ్ఞుడు, జ్ఞానవంతుడు కాబట్టి సుగతుడు, ఈ ప్రపంచంలో సమస్తం క్షణికం అని కనుగొన్నవాడు కాబట్టి బుద్ధుడు. ధర్మాన్ని ప్రబోధించినవాడు కాబట్టి ధర్మరాజు. పునర్భవం లేని నిర్వాణాన్ని పొందినవాడు కాబట్టి తథాగతుడు. పాపకార్యాలు ఎరుగనివాడు కాబట్టి సమంతభద్రుడు. దుఃఖాన్ని భగ్నం చేసినవాడు కాబట్టి భగవాన్. మారుణ్ణి (మన్మథుణ్ణి) జయించినవాడు కాబట్టి మారజిత్. అంటే కామక్రోధాల్ని జయించినవాడు. లోక విషయాల్ని ధ్యానంతో జయించినవాడు కాబట్టి లోకజిత్. సంసార చక్ర బంధనాలు జయించినవాడు కాబట్టి జినుడు. ఆరు మహాజ్ఞానాలు కలిగినవాడు షట్ అభిజ్ఞుడు. దానం, కర్మల గురించి, కర్మవిపాకం, జీవుల గుణాలు.. మానవ ప్రవృత్తులు, ప్రపంచ బహుముఖ నిర్మాణం, అస్తిత్వ లోక మార్గాలనే ఈ పది విషయాలు ఎరిగినవాడు... అలాగే దానం, శీలం, జ్ఞానం, కరుణ, ప్రజ్ఞ, క్షాంతి, వీర్యం, సత్యం, ఉపేక్ష, అధిష్ఠానం అనే దశ పారమితుల బల సంపన్నుడు కాబట్టి దశబలుడు.

ప్రపంచాన్ని అభేదంగా చూశాడు కాబట్టి అద్వయవాది. వినయము, హితము కోరువాడు కాబట్టి వినాయకుడు. మునులలో శ్రేష్ఠుడు కాబట్టి మునీంద్రుడు. గంభీరమైన బుద్ధుని మౌనాన్ని బౌద్ధపాళీ సాహిత్యం ఆర్యమౌనం అంటుంది. ధ్యాన (యోగ) విద్యా ప్రదాత కాబట్టి శ్రీఘనుడు. దుష్టగుణాల్ని శిక్షిస్తాడు. ఆ గుణాల్ని ఎలా రూపుమాపుకోవాలో బోధిస్తాడు కాబట్టి శాస్త. అలాగే శౌర్యవంశం వాడు కాబట్టి శాక్య ముని అని శాక్య సింహుడు అని అంటారు. అన్ని పనులలో కృతార్థుడు అయ్యాడు కాబట్టి సర్వార్ధసిద్ధుడు. శుద్ధోధనుని పుత్రుడు కాబట్టి శౌద్ధోదనుడు. లేదా న్యాయం అనే పరిశుద్ధమైన అన్నాన్ని తినేవాడు అని కూడా అర్థం. గౌతమ వంశానికి చెందినవాడు కాబట్టి గౌతముడు. సూర్యవంశంవాడు కాబట్టి ఆర్కబంధు. మాయాదేవి కుమారుడు కాబట్టి మాయాదేవీసుతుడు.

బౌద్ధ సారస్వతంలో అహింసావాది అయిన బుద్ధుణ్ణి సింహంతో పోల్చి చెప్పడం ఎక్కువగా కన్పిస్తుంది. ఎందుకంటే బుద్ధుడు ధర్మోపదేశం చేస్తే ఎలాంటి సంశయాలకీ తావుండేది కాదు. ప్రతివాదులు కూడా నోరు కదిపేవారు కాదు. అడవిలో సింహనాదం వింటే మరే జంతువూ గొంతు ఎత్తదు. అడవి నిశ్శబ్దం అయిపోతుంది. అలాగే బుద్ధుడు ప్రబోధిస్తుంటే పరిసరాలు నిశ్శబ్దంగా మారిపోతాయి. అలాగే వాదంలో కూడా బుద్ధుని ముందు నిలబడి నోరెత్తలేరు. అందుకే సింహంతో పోలుస్తారు. అశోకుని స్తంభం మీద సింహాలు కూడా బుద్ధునికి ప్రతీకలే. ఈ గురుపూర్ణిమకు చిహ్నంగా బుద్ధుడు తొలి ప్రబోధం చేసిన సారనాథ్‌లో అశోకుడు నాలుగు సింహాల ధర్మ స్తంభాన్ని నిర్మించాడు. అదే ఈనాటి మన జాతీయ చిహ్నం. అందుకే బుద్ధుడు శాక్య సింహుడు అయ్యాడు.

1037
Tags

More News

VIRAL NEWS

Featured Articles