గురువు శత్రువు కాదు


Sun,June 25, 2017 12:59 AM

Illustration
పూర్వం కాశీ రాజుకు ఒక కుమారుడున్నాడు. ఆ రోజుల్లో కాశీలో పెద్ద పెద్ద విద్యాలయాలు ఉండేవి. అయినా తన కుమారుడు ఇక్కడైతే అధికారంతో, అహంకారంతో విద్య సరిగా నేర్చుకోడని ఆలోచించిన రాజు తక్షశిలకు పంపాడు. అక్కడ ఒక ప్రసిద్ధ గురువు దగ్గర శిష్యునిగా చేరాడు రాకుమారుడు. రోజూ నదీస్నానానికి పోతూ రాకుమారుణ్ణి కూడా తన వెంట తీసుకుపోతూ ఉండేవాడు. ఆ నదీతీరంలో ఒక ముసలమ్మ నువ్వులు ఆరబోసుకుంది. రాకుమారుడు ఒక రోజున ఒక గుప్పెడు నువ్వులు తీసుకుని గుట్టుగా నోట్లో పోసుకున్నాడు.పాపం పిల్లాడు. జిహ్వ చాపల్యం అనుకొని ఊరుకొంది ముసలమ్మ. మరుసటి రోజు కూడా అలాగే చేశాడు. ఆరోజూ ఏమా అనలేదు. మరలా అలవాటు ప్రకారం మూడో రోజూ అలాగే చేశాడు. ఆరోజు ఆమె పెద్దగా కేకలు వేస్తూ ఈ గురువు గారు తన శిష్యునికి దొంగతనంతో ఇలా శిక్షణ ఇస్తున్నాడు అంటూ గగ్గోలు పెట్టింది.

గురువు వెనుదిరిగి వచ్చి విషయం అడిగి, ఇప్పుడు నేను ఏం చేయాలి? నీ నువ్వులకు సరిపడే వెల ఇస్తాను. సరేనా అన్నాడు. లేదు. నాకే వెలను చెల్లించవద్దు. నేను చూస్తుండగా మీ శిష్యుణ్ణి మూడు దెబ్బలు కొట్టండి అంది. సరేనని గురువుగారు వెదురు బెత్తం తీసుకొని వంగబెట్టి వీపు మీద మూడు తగిలించాడు. శిష్యుడికి పట్టరాని కోపం వచ్చింది. గురువుగారి వంక గుడ్లురిమి చూశాడు. కానీ అంతలోనే తమాయించుకున్నాడు. ఇప్పుడు కాదు. నన్ను సింహాసనం అధిష్ఠించనీయండి. నీ తల కొట్టిస్తాను అనుకొన్నాడు.

ఆ తర్వాత ఆ రాకుమారుడు విద్యాభ్యాసం పూర్తిచేసి వారణాసికి తిరిగి వెళ్లాడు. తండ్రి మరణానంతరం రాజయ్యాడు. వెంటనే గురువుగారిని తీసుకురమ్మని భటుల్ని పంపాడు.
గురువు రాగానే రాజు మండిపడి - ఆరోజున నీవు నన్ను కొట్టిన దెబ్బల్ని మర్చిపోలేదు. ఆ దెబ్బల నొప్పి ఇప్పటికీ ఉంది. కాబట్టి నీకు రాజదండన విధిస్తున్నాను అన్నాడు.

అప్పుడు గురువు నవ్వి - పిచ్చివాడా! నేను ఆరోజున కొట్టిన దెబ్బల వల్లే నీవు ఈరోజున రాజువయ్యావు. నేను నిన్ను అలా ఉపేక్షించి ఊరుకుంటే నీ దొంగతనాలు ఆగేవి కాదు. నువ్వుల నుండి ఆహార పదార్థాలు, వస్తువులు, ఆ తర్వాత దోపిడీలకు అలవాటు పడేవాడివి. దొంగగా పట్టుబడేవాడివి. ఎప్పుడో రాజదండనకి గురయ్యేవాడివి. కాబట్టి ఈరోజున నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం, పదవి అన్నీ ఆ రోజు నేను విధించిన దండన వల్ల వచ్చినవే. మంచిని కోరి గురువులు వేసే దండనను శత్రుత్వంగా భావించకూడదు అన్నాడు. సభలో ఉన్న మంత్రులు, సామంతులు, ప్రజలు గురువుగారికి జేజేలు పలికారు. రాజు తన తప్పు తెలుసుకుని సింహాసనం దిగివచ్చి గురువు పాదాలపై పడ్డాడు. రాజు మనస్సులో ఆ కోపం పొరలు తొలగిపోగానే తన గురువుగారి సందేశాలన్నీ గుర్తొచ్చాయి. నీతి ప్రబోధాలు కళ్లెదుట కనిపించాయి. వెంటనే తన గురువు గారిని తన రాజ్యానికి సలహాదారుగా నియమించాడు. ఆయన ఆదేశానుసారం పాలిస్తూ గొప్ప చక్రవర్తిగా కీర్తి గాంచాడు.
- బొర్రా గోవర్ధన్

1225
Tags

More News

VIRAL NEWS