కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్రం నిద్రపోతున్నదా? అసలుఈ దేశంలో ప్రతి సమస్యకు కోర్టులే పరిష్కరమా? మన రాష్ట్రంలో కూడా నిత్యం నీళ్ల కోసం కొట్లాట లేకుండా ఏం చేయాలి?
-చెరుకు ముత్యాలు, భైంసా, ఆదిలాబాద్
మీరు ప్రశ్నలు అడిగే తీరు చూస్తుంటే మీ మనస్సు ఎంత కలత చెందుతున్నదో అర్థం అవుతోంది. మీరే కాదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నీటి కోసం జరుగుతున్న ఉద్యమాలు, పోరాటాలు చూస్తుంటే భవిష్యత్‌లో ప్రపంచ యుద్ధాలు సంభవిస్తే అవి నీటి కోసమే అని నిపుణులు చెప్పేమాట నిజమే కావొచ్చు అనిపిస్తున్నది.మీరు కావేరీ జలవివాదం గురించి అడిగారు. ముం దుగా దాని గురించి: కావేరీ నది కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లాలో పుట్టి తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలోని కొన్ని భూభాగాలనుంచి ప్రవహిస్తూ అంతిమంగా బంగాళాఖాతంలో కలుస్తుంది. కావేరీ పరివాహక ప్రాంత వైశాల్యం 87,900 చదరపు కిలోమీటర్లు. ఇందులో కర్ణాటక 41.2 శాతం, తమిళనాడు 55.5 శాతం, 3.3 శాతం కేరళ కలిగి ఉన్నాయి.పాండిచ్చేరి క్షేత్రం నామమావూతమే. కావేరీ జలవివాదం ఇప్పటిది కాదు. దీనికి రెండు వందల సంవత్సరాల కం ఎక్కువ చరిత్ర ఉంది. అంతర్ రాష్ట్ర జలవివాదం మూలంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక, పర్యావరణ కోణాలనుం చి ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలు దేశం బాగా దెబ్బతిన్నాయి. అలనాటి మద్రాసు ప్రెసిడెన్సీ (ఆంగ్లేయుల పాలన), రాచరికపు వ్యవస్థ కింద పరిపాలన కొనసాగుతున్న మైసూర్ రాష్ట్రం మధ్య ఈ జలవివాదం 1807లో మొదలైంది. 1892లో ఇరు ప్రభుత్వాల మధ్య ఒక ఒడంబడిక ఖరారైంది. 41.5 టీఎంసీల సామర్థ్యంతో మైసూరు తలపెట్టిన కృష్ణా రాజసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదన మదరాసు తలపెట్టిన 80 టీఎంసీల సామర్థ్యం కలిగిన మెట్టూరు ప్రాజెక్టు ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నదన్న కారణం మళ్ళీ వివాదానికి తెరలేపింది. తిరిగి 1924లో అంగీకారం కుదిరింది. అనుబంధంగా 1929,1933లలో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 1956 లో రాష్ట్రాల విభజన జరిగి కొత్త రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, కర్ణాటక కావేరీ జలాలలో భాగస్వాములైన తమతమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రతిపాదనలు పెట్టాయి. అంతర్రాష్ట్ర చర్చలు ప్రారంభమయ్యాయి.1986 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన ఓ రైతు సంఘం సుప్రీంకోర్టుకు చేసిన ఫిర్యాదు కారణంగా నాలుగేళ్ల తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ట్రిబ్యూనల్ ని ఏర్పాటు చేసింది. తమిళనాడు సుప్రీంకోర్టు ద్వారా ట్రిబ్యూనల్పై ఒత్తిడి తేగా ట్రిబ్యూనల్ ఒక మధ్యంతర ఆదేశాన్నిచ్చింది. ఆ ఉత్తరువు ప్రకారం కర్ణాటక నిర్ణీత సమయాల్లో ఏడాది లోపు 205 టీఎంసీల నీటిని తమిళనాడులోని మెట్టూరు జలాశయానికి వదలాల్సి ఉంటుంది. అంతేగాక, కావేరీ జలాలను ఉపయోగించుకుని కర్ణాటక తన రాష్ట్రంలో కొత్త ఆయకట్టును ఏర్పాటు చేసుకోరాదని కూడా ఆదేశం. ట్రిబ్యూనల్ మధ్యంతర ఉత్తర్వులు కర్ణాటక ప్రభుత్వానికి మింగుడుపడలేదు.
ఈ ఆదేశాల నుంచి తమ రాష్ట్రాన్ని తప్పించే ప్రయత్నంలో కర్ణాటక ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ని జారీ చేసింది. ఈ పరిణామం రాజ్యాంగ సంక్షోభానికి దారితీయడంతో రాష్ట్రపతి ఈఅంశాన్ని పరిశీలించవలసిందిగా సుప్రీంకోర్టును కోరడం, సుప్రీంకోర్టు కర్ణాటక జారీ చేసీన ఆర్డినెన్స్ చెల్లదనడం, దానితో కేంద్రం ట్రిబ్యూనల్ మధ్యంతర ఉత్తర్వులను డిసెంబర్1991న అధికారికంగా ప్రకటించడం జరిగాయి. మళ్లీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. 1992-95 మధ్యాకాలంలో కావేరీ నదీ పరివాహక ప్రాంతంలో బాగా వర్షాలు కురియడంతో ఈ గొడవలను ఎవరూ పట్టించుకోలేదు. తిరిగి 1995మధ్యలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఉద్రికత్తలు మొదలయ్యాయి. మళ్లీ తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు సమస్యను పరిష్కరించే బాధ్యతను ప్రధానికి అప్పచెప్పడం జరిగింది. ఫలితంగా ప్రధాని అధ్యక్షతన కావేరీ రివర్ అథారిటీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంవూతులు, కేంద్ర జలవనరుల మంత్రి సభ్యులుగా ఏర్పాటైంది. ఈ అథారిటీకి సాయపడేందుకుగాను కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సచివుడు అధ్యక్షుడుగా, నాలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర జలసంఘం చైర్మన్ సభ్యులుగా కావేరీ మానిటరింగ్ కమిటీ సీఎండీ ఏర్పాటు జరిగింది. ఎలాగోలాగ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించినా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ ప్రతి సంవత్సరం కర్ణాటక మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం నీరు వదలకపోవడం తమిళనాడు కేంద్రానికి ఫిర్యాదు చేయడం జరుగుతూనే ఉన్నాయి. ఈలోగా ట్రిబ్యూనల్‌లో కూడా యథావూపకారం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ట్రిబ్యూనల్ చైర్మన్ పదవి ఖాళీ కావడంతో ట్రిబ్యూనల్ తదుపరి చర్చలు ఆగిపోయాయి. ఈ ఏడాది కూడా మళ్లీ అదేపాత కథ. కావేరీ బేసిన్లో నీటి ఎద్దడి ఏర్పడిందని కర్ణాటక ట్రిబ్యూనల్ మధ్యంతర ఉత్తర్వులు బేఖాతరు చేయడం, తమిళనాడు కావేరీ రివర్ అథారిటీకి ఫిర్యాదు చేయడం ఒకదాని మరొకటి చకచక జరిగా యి. పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మానిటరింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన కావేరీ రివర్ అథారిటీ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 15 దాక 9 వేల క్యూసెక్కుల చొప్పున కర్ణాటక తమిళనాడుకు వదలాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు కర్ణాటకకు ఆగ్రహం తెప్పించాయి. కర్ణాటక ససేమిరా నీటిని వదలనంది. దానితో తమిళనాడు యథావూపకారం సుప్రీంకోర్టు గడతొక్కక తప్పలేదు.
సీడీఏ ఆదేశాలను పాటించవలసిందేనని కర్ణాటకకు సుప్రీంకోర్టు హుకుం జారీ చేసింది. మళ్లీ రాష్ట్రంలో ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. కర్ణాటక తీర్పును పునఃసమీక్షించవలసిందిగా సుప్రీంకోర్టును కోరినా ఫలితం దక్కలేదు. ఇక కర్ణాటకకు విధిలేని పరిస్థితి ఏర్పడింది. ఏమైనాసరే నీళ్లొదిలేది లేదు అని సుప్రీంకోర్టు ధిక్కారణకు సంసిద్ధమైంది. కర్ణాటకలో ఇలాంటి పరిస్థితే ఏర్పడితే రాష్ట్రపతిపాలన తప్ప మరో గత్యంతరం ఉండదు. 356 అధికరణం కింద కేంద్రం తదుపరి చర్యలకు పూనుకోవడవలసివస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఇది. ఏమవుతుందో వేచి చూడవలసిందే. తమ ప్రయోజనాలకే సరిపడా నీళ్లు లేనప్పుడు తమిళనాడు కెలావదలడం? అని కర్ణాటక భీష్మించుకు కూర్చుంది. ఏమైనా సరే కావేరీ జలాలను సాధించుకోవాలని తమిళనాడు పట్టుబడుతోంది. ఈరెండు రాష్ట్రాల పట్టుదల మధ్య కేంద్రం నలిగిపోతోంది. ఇలా రాష్ట్రాలు దెబ్బలాడుకుంటూ ఉంటే కేంద్రం ఏం చేస్తోంది అన్నది మీ తదుపరి ప్రశ్న. నిజానికి రాష్ట్రాల దెబ్బలాటలో కేంద్రం చేయగలిగేది అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో రాజ్యాంగం జలవివాద విషయంలో ఏం చెబుతుందో చూద్దాం. రాజ్యాంగంలోని 262 అధికరణలో అంతర్ రాష్ట్ర నదీజలాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం గురించి ప్రస్తావిస్తూ రెండు అంశాలు స్పష్టం చేయబడ్డాయి.ఒకటి: అంతర్రాష్ట్ర నదీజలాల వినియోగం పంపకం, నియంవూతణ విషయంలో ఏదైనా తగాదా ఏర్పడితే, దాన్ని పరిష్కరించే నిమిత్తం పార్లమెంటు చట్టం చేయవచ్చు. రెండు: పైన చెప్పిన తగాదా విషయంలో సుప్రీంకోర్టుగానీ, ఇతర కోర్టులుగానీ జోక్యం చేసుకోరాదని పార్లమెంటు చట్టం చేయవచ్చు.ఈ 262అధికరణ కింద పార్లమెంటు 1956లో అంతర్రాష్ట్ర జలవివాద చట్టాన్ని రూపొందించింది. ఈ యాక్ట్‌లో ని సెక్షన్ 3లో ఈ విధంగా ఉంది.‘పరాయి రాష్ట్రం చేసే లేక చేయబోయే చట్టం వల్ల కానీ, అధికారిక చర్యల మూలంగానీ, అంతర్ రాష్ట్ర జలాల వినియోగం, పంపకం, నియంవూతణ విషయంలో తమ అధికారాలను అమలు చేయడంలో రాష్ట్రం లేక ఆ రాష్ట్ర సంబంధిత సంస్థ విఫలం కావడం కారణంగా కానీ, తమతో ఆ పరాయి రాష్ట్రం చేసుకొన్న ఒప్పందం ప్రకారంగా కార్యక్షికమాలు అమలు జరగని సందర్భంలో కానీ, ఆ పరాయి రాష్ట్రంలో తమ రాష్ట్రానికి నీటి తగాదా ఏర్పడిందని లేక ఏర్పడబోతోందని, ఆ తగాదా మూలంగా తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే అవకాశముందని అనిపించినప్పుడు ఆ రాష్ట్రం నీటి తగాదాని పరిష్కరించేందుకు న్యాయమండలి టిబ్యూనల్)ని ఏర్పాటు చేయమని కోరవచ్చు. సెక్షన్ 4 ఏం చెబుతున్నదంటే.. సెక్షన్ 3 క్రింద ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నీటి తగాదాని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెస్తే చర్చలు సంప్రదింపుల ద్వారా ఆ తగాదా పరిష్కారం సాధ్యం కాదని కేంద్రానికి అనిపిస్తే, కేంద్ర ప్రభుత్వ అధికార పత్రం ద్వారా ఆనీటి తగాదా పరిష్కరం నిమిత్తం న్యాయమండలి ఏర్పాటు చేయవచ్చు.
తేలికైనా మాటల్లో చెప్పాలంటే ఏదైనా రాష్ట్రం, పక్కరాష్ట్రంపైన నీటి సంబంధించిన ఏర్పడ్డ తగాదా పైన చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారం కానీ సమస్యను కేంద్రం దృష్టికి తెస్తే , మొదట కేంద్రం ఆ సమస్యను తనంతటతాను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. అలా కుదరనప్పుడు ట్రిబ్యూనల్ ని ఏర్పాటు చేయించేందుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఉదాహరణకు కృష్ణా జలాల వినియోగం, పంపకం విషయంలో ఏర్పడ్డ తగాదా పరిష్కారం నిమిత్తం మొదట బచావత్ ట్రిబ్యూనల్, ఆతర్వాత అంటే గడువు ముగిసాక బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ ఏర్పడ్డాయి. గోదావరి జలాల వియోగంలో వివిధ రాష్ట్రాలు కుదుర్చుకున్న ఒప్పందాలను ఒకచోట చేర్చి బచావత్ ట్రిబ్యూనల్ నివేదిక అందించింది. ట్రిబ్యూనల్ తుది తీర్పు సుప్రీంకోర్టు డిక్రీతో సహనం- దాన్ని విధిగా అన్ని రాష్ట్రాలు పాటించవలసిందే. ఏదైనా రాష్ట్రం ట్రి బ్యూనల్ తీర్పును ఉల్లంఘిస్తే, దాన్ని పేర్కొంటూ బాధిత రా ష్ట్రం సుప్రీంకోర్టు తలుపుతట్టవ చ్చు. బచావత్ ట్రిబ్యూనల్ (గోదావరి ) తీర్పును మనం ఉల్లంఘించి పోలవరం ప్రాజెక్టును కడుతు న్నామని ఆంధ్రవూపదేశ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ఫిర్యాదు చేశాయి. అదేవిధంగా మహారాష్ట్ర ట్రిబ్యూనల్ తీర్పును ఉల్లంఘించి ఆంధ్రవూపదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగించేట్టుగా బాబ్లీని నిర్మిస్తున్నారని మనరాష్ట్రం సుప్రీంకోర్టులో మొరపెట్టుకుంది. బాబ్లీపైన విచారణ తుదిదశలో ఉంది. పోలవరం పైన ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఈ నీటి జగడాలకు కోర్టుకు వెళ్లడం తప్ప మరోమార్గం లేదా అని మీరడుగుతున్నారు. అసలు ఈదేశంలో కాని, రాష్ట్రంలో సజావుగా పాలన సాగుతోందని భావిస్తున్నారా? పాలకులకు నిజాయితీ ఉన్నదా. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని కేంద్రానికి, అన్ని ప్రాంతాలపై సమన్యాయం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించదు. ఎక్కడా చూసినా అవినీతి, ఆశ్రీత పక్షపాతం. ఎవరు ముఖ్యమంత్రి అయితే, వారు తన ప్రాంతానికి నీళ్లు నిధులు తరలించాలని ప్రయత్నిస్తారు. బలమున్నవర్గం, బలహీన వర్గాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నది. నిన్నటిదాక కోస్తా వాళ్ల చేతిలో శక్తి ఉంది. అది ఆర్థికశక్తి. అందుకని నీరు అటువైపు పరుగెత్తింది. ఈరోజు సీమ చేతిలో రాజకీయశక్తి ఉంది. కనుక నీరుగేట్లు (పోతిడ్డిపాడు) తెరుచుకుని అటువైపు పరిగెడ్తోంది. తెలంగాణ వాడు బక్కచిక్కనవాడు. బలహీనుడు - ఏం చేయగలడు? కేంద్రానికి మొరపెట్టుకోవాలంటే ప్రత్యేక రాష్ట్రం రాదాయె. అంతర్రాష్ట్ర చట్టం 1956 అనుసరించి కేంద్రం తెలంగాణను పట్టించుకోదు. ఎందుకంటే దానికి రాష్ట్ర ప్రతిపత్తి లేదు. ఇక అప్పుడు ఏం చేయాలి? హైకోర్టు గడపతొక్కాలి. హైకోర్టులో న్యాయం దొరికితే అదృష్టమే (ఇటీవల శ్రీశైలం, నాగార్జునసాగర్ విషయంలో). దొరక్కపోతే సుప్రీంకోర్టుకు వెళ్లకతప్పదు. రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రజాహిత వ్యాజ్యం వేయాలి. ఇదివరలో రాజోలిబండ విషయంలో హైకోర్టులో న్యాయం దొరకలేదని సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. ఏళ్లుగడిచినా ఆ కేసు విచారణకు రాలేదుపాంతాలకు జరిగే అన్యాయం పట్టించుకునే యంత్రాంగం లేదు. అదృష్టం బావుంటే హైకోర్టులో రెండు రాష్ట్రాల మధ్య జరిగే గొడవలు అన్నీ కూడా సుప్రీంకోర్టు పరిష్కరించవలసిందే. ఇటీవలే సుప్రీంకోర్టు జోక్యంతో సమసిన పెరియార్ డ్యాం వివాదం (తమిళనాడు, కర్ణాటక మధ్య) ఇందుకు తార్కాణం. ట్రిబ్యూనళ్లు తీర్పులు ప్రకటించినా వాటి తీర్పులు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమైనా ఏదో మిషపైన రాష్ట్రాలు సుప్రీంకోర్టు తలుపులు తట్టుతూనే ఉన్నాయి. అంటే ట్రిబ్యూనల్ తీర్పుయే అమలు కానప్పుడు ఇక కేంద్రంమాటనెవడు లెక్కపెడుతాడు? రాజ్యాంగం ఏర్పాటు చేసిన కాగ్ వంటి సంస్థల పైన్నే ప్రభుత్వాలు విరుచుకుపడుతూ ఉంటే, సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టే సాహసానికి ఒడిగట్తుంటే రాజకీయాలు ఎన్ని వెర్రితలలు వేస్తున్నాయో స్పష్టమవుతుంది. ఇదే తరహా కొనసాగితే సమీప భవిష్యత్‌లో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదపుటంచులను తాకడం ఖాయం.
-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
vsrao2010@gmail.com