అసెంబ్లీ ముంగట అంబేద్కర్ విగ్రహం మాట్లాడలేదు. గాంధీ విగ్రహం కూడా. మాట్లాడి ఉంటే గాంధీ విగ్రహం ముందుగా అసెంబ్లీలో తనకు నివాళులు అర్పించి మరీ దౌర్జన్యంగా కూడబలుక్కుని ఒక తీర్మానాన్ని గబగబా చదివి, యస్ఆర్ నో అని మూజువాణి ఓటుతో అధికార తీర్మానం ఆమోదించినట్టు శాసనసభ స్పీక ర్, ఆయన చుట్టూ కాపలా ఉన్న సీమాంధ్ర మందబలం, చివరగా జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేసిన ముఖ్యమంత్రి తీరు మీద మాట్లాడేదేమొ. అరవై ఏడు సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదేనని అవాక్కయి, మాట వచ్చినా మళ్లీ పడిపోయేదేమొ. ఇక అంబేద్కర్ సరే సరే! ముందర విగ్రహం పెట్టి మరీ లోపల జరిగినవన్నీ రాజ్యాంగస్ఫూర్తికి భిన్నమైనవే.
ఒక రాష్ట్ర విభజనకు సంబంధించి సభలో సీమాంధ్ర సభ్యులు మాట్లాడిన తీరు, చేసిన రకరకాల వ్యాఖ్యానాలు ఇవన్నీ పోను రాజ్యాంగ పరిధిలో, రాజ్యాంగ సంరక్షకుడు రాష్ట్రపతి పంపిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చేసిన వాదనలు విని ఉంటే అంబేద్కర్ ఏమయ్యేవారు. ఆర్టికల్3 ప్రకారంగా బిల్లుపై చర్చ చేసీచేసీ చివరకు, ఈ బిల్లు చెల్లదని, ఏమాత్రం సంబంధంలేని ఒక తీర్మానాన్ని అక్రమంగా ఆమోదించుకుని అదే బిల్లుకు తిరస్కర ణ అని చంకలు గుద్దుకున్న సీమాంధ్ర మంద, వారికి తానే అంటే తందానా? అని తీర్మానం తిరస్కతిని, బిల్లు తిరస్కతిగా తాటికాయంత అక్షరాలు పెట్టి న మీడియాలను చూసి బహుశా విగ్రహమే అయినా అంబేద్కర్ కలతపడే ఉంటాడు. విగ్రహాలు మాట్లాడితే ఇవాళ్ల సీమాంధ్ర ఆజమాయిషీ, ఆధిప త్యం,అహంకారం ఏస్థాయిలో పాదుకున్నదో? లోకానికి తెలియజెప్పేవి. ఎందుకంటే అంబేద్కర్ ఈదేశ అభాగ్యుల గురించి నిర్భయంగా నిజాలు మాట్లాడి, రాసి, రాజ్యాంగాన్ని ప్రసాదించారు. అలాంటి అసెంబ్లీ ముందు విగ్రహాలకు జరిగిందంతా అపచారమే.
సాధారణంగా కొందరికి భ్రమలు ఏర్పడతాయి. ఈ భ్రమలకి హేతువు ఉండదు. చివరకి భ్రమలే నిజమని నమ్మే భ్రాంతి కూడా ఏర్పడినప్పుడు ఇలాంటి సంధి ప్రేలాపనలు, సంధి కార్యకలాపాలు సాధ్యం. మిగ్వెల్ది సెర్యాంటెస్ అనే స్పానిష్ రచయిత సష్టించిన ఒకపాత్ర డాన్క్విక్సాట్. ఈ నవల రెండవ భాగాన్ని ఒక తాత్విక నవలగా భావిస్తారు. ఆ తత్వం అట్లా ఉంచి డాన్క్విక్సాట్ సాహస పుస్తకాలు చదివి, తనను తాను ఈ సాహసాలు చేసే వీరునిగా ఊహించుకుని, కొన్ని సాహసాలను ఆచరణలో చెయ్యబోయి అభాసుపాలయి, చివరికి భ్రాంతికి లోనై తాను సాహసాలు చేసినట్టుగా భావించుకుని తనకు తాను అతి గొప్పవాడిగా ఊహించుకునే పాత్ర. ఈ పాత్రను మళ్లీ లోకంలోకి తెచ్చే ప్రేయసి పాత్ర కూడా ఉంటుంది.
సరిగ్గా ఈ పోలిక ఇప్పటి సందర్భంలో తనను తాను ఒక మహా సమైక్యాంధ్ర నేతగా భావించుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అచ్చంగా సరిపోతుంది. నిజానికి సమైక్యాంధ్ర భావన ఉనికిలో ఉండడానికి ఆస్కారం లేని ఒక అవశేషమై చాన్నాళ్లయిపోయింది. అందుకు కారణాలు కూడా ప్రతిష్టతమైపోయాయి. విలీనం అయినప్పుడు షరతులతో ఒడంబడికలతో ఎట్లా బలవంతంగా విలీనం అయిందో? విడిపోయేప్పడు కూడా మందబలంతో మెజారిటీ సభ్యుల దౌర్జన్యం మధ్య అవసరంలేని ఒక తీర్మానంతో ముగిసింది. ఇది ఒక అంతం. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఇదే అసెంబ్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం చేతి లో విభజన అంశం ఉందని, వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించాడు.
కానీ ఆతర్వాత సీడబ్ల్యూసీ నిర్ణయం వచ్చినప్పటి నుంచి ఒక మంకుపట్టుతో సమైక్యాంధ్రను రక్షించే కంకణం కట్టుకున్నారు. కానీ అది నిజమేనా? సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్రికెట్ భాష ప్రయోగించి, ఆఖరిబంతి, ఆ బంతీ ఈ బంతీ అని అన్నమాటలు ఒక్కటన్నా ఫలించాయా? అడ్డంకులు సష్టించడానికి చేసి న ఏ ప్రయత్నమైనా ఫలవంతం అయ్యిందా? నిజమే రాష్ట్రం విడిపోతే కష్టమనే అభిప్రాయం ఉండడంలో తప్పులేదు. సమైక్యాంధ్ర వాదనలు చెయ్యడంలో తప్పులేదు. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి వాదనలు ఒక్కటీ నిలబడేవి కావు. చరిత్ర గురించి కానీ, భవిష్యత్ గురించి కానీ, భయాల గురించి కానీ ఆయన చెప్పినవేవీ నిలబడేవి కావు. సమైక్యాంధ్ర తాత్విక పునాది దాకా ఎందుకు? సమైక్యాంధ్ర ఎందుకు ఉండాలో? చెప్పాల్సిన ముఖ్యమంత్రి విభజన ఎందుకు వద్దో? వాదనలు నిర్మిస్తున్నాననుకొని పదే పదే మూడునాలుగు విలేకరుల సమావేశాలు పెట్టి, వాటి ఎక్స్‌టెన్షన్‌గా అసెంబ్లీలో ఆరుగంటలు మాట్లాడారు.
ఆయన మొదటి విలేకరుల సమావేశం నుంచి అసెంబ్లీ ప్రసం గం దాకా ఒకే మూస. నిజంగానే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించగలననీ, నిజంగానే తానొక్కడే నిలువరించగలవాడిననీ, దొరికిన వేదికలు, సమావేశాలు, చివరికి ఢిల్లీ సంప్రదింపుల్లో కూడా ఆయన ఇదే వాదాన్ని దరిదాపుగా అనేక రకాలుగా ప్రదర్శించారు. కానీ ఆయన ఏ సాహసమూ ఫలించలేదు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు,ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నిర్ణయాన్ని ఆపగలననుకోవడం మొదటి భ్రమ. తన వాదనా పటిమ అద్భుతమైనది. రెండవ భ్రమ తన వాదనలకు బలం ఉంది. అవి గెలిపిస్తా యి. అవి మనసు మారుస్తాయి అన్న భ్రమ.
ఇక మూడవ భ్రమ సమైక్యాంధ్రకు తానొక్కణ్నే ఛాంపియన్,ఎట్లాగైనా బిల్లును ఆఖరి బంతితోనన్నా ఆపగలననుకొన్న భ్రాంతి. కానీ డాన్ క్విక్సాట్ లాగానే కిరణ్‌కుమార్‌రెడ్డి అచ్చంగా అధిష్ఠానానికి ఎదురొడ్డి, కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానాన్ని చిరాకు పెట్టి, ధైర్యంగా, మెండిగా నిలబడ్డాననుకొని ఒక భ్రమ మీదే నిలబడి, తాను తలపెట్టిన ఏ ఒక్క సాహసమూ ఫలించక చివరికి ఆ పాత్రలాగే నిలబడ్డాడు. ఇంతకుమించి రాయడం బాగుండదు.
ఆయన ఆఖరు బంతినే చూద్దాం. సభకు రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చింది. చాలా ఆలస్యంగా జ్ఞానోదయం అయిన ముఖ్యమంత్రికి బిల్లు తప్పుగా కనబడింది. ఆర్టికల్ 3 ప్రకారం పంపిన బిల్లు కనుక దీనిపై అభిప్రాయాలు పంపాలని రాష్ట్రపతి కోరారు. తీర్మానాలు చెయ్యాలని కానీ, ఈ బిల్లుపైన ఓటింగ్ జరపాలని కానీ ఆయన కోరలేదు. అభిప్రాయాలు పంపాలంటేనే తీర్మానం కాదని అర్థం. లేదా రాష్ట్రపతి బిల్లులో తీర్మానం పంపండి అనే ఉండే ది. సరే. సాహసవంతులైన కిరణ్‌కుమార్‌రెడ్డికి తన సాహస చర్యలకు మరో దోవ కనబడింది. అసెంబ్లీలో బిల్లు బాగాలేదు వెనక్కి పంపాలని తీర్మానం పెట్టాలని. పోనీ ఆ తీర్మానం అయినా సక్రమంగా పెట్టారా? సభ చివరిరోజు ల్లో పెట్టారు, రూల్‌బుక్‌లో ఇలాంటి అధికార, అనధికార తీర్మానాలకు సంబంధించి రూల్ 77 నుంచి ప్రతి విషయమూ రాసి ఉంది.
ఒక తీర్మానం పెట్టాలంటే పది రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని, సభలో ఆ నోటీసులో ఉన్న అంశాలను ప్రవేశపెట్టాలని, స్వయంగా తీర్మానం ప్రతిపాదించిన వారు కానీ, ఆయన తరఫున కానీ ప్రవేశపెట్టాలని స్పష్టంగా ఉన్నది. అయినా స్పీకర్ ప్రస్తావించి, ప్రవేశపెట్టి, మూజువాణి ఓటు అని ప్రకటించి తీర్మానం ఆమోదించి సైనడై ప్రకటించారు. అయిపోయింది. కానీ పంఛీ ఉడ్ గియా! రాష్ట్రపతి పంపిన బిల్లుపై శాసనసభ అభిప్రాయాలకు, శాసనసభ పరిధిలో రూల్ 77 ప్రకారం ముఖ్యమంత్రి తీర్మానానికి ఎలాంటి సంబంధమూ లేదు. బిల్లు ఇవ్వాళ్ల కాకపోతే రేపు ఢిల్లీకి వెళ్ల డం ఖాయం. ముఖ్యమంత్రి తీర్మానం ఆయన ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికే రావడం ఖాయం. అయిపాయె. ఖేల్ఖత మ్.. దుక్నంబంద్. ఇంగ సీమాంధ్రులు ఇట్లా సభలో తెలంగాణ గురించి చర్చించే అవకాశంలేదంటే చాలు పుట్టెడు సంబురం.
ముఖ్యంగా రాజ్యాం గం గురించీ, ప్రజాస్వామ్యం గురించీ ఈ సభలో చర్చ ఇంక జరగదంటే చాలు. అబ్బ ఇంగ పీడా పోయిందన్న ఒక ఊరట. కానీ ముఖ్యమంత్రి అంతటితో వదలలేదు. ఆయనలోని డాన్క్విక్సాట్ ఆయనను నిలవనియ్యలేదు. చేతులెత్తి సభలో ముఖ్యమంత్రి సమైక్య నినాదం చేశా రు. చాలు. సంబరాలు జరిగా యి. పత్రికల్లో తిరస్కారాలు వచ్చాయి. కానీ నిజ సాహసాలు ఇట్లా ఉండవు. ఇదే అసెంబ్లీ ముందర స్తూపంలో చెక్కని పేర్లుగా నిక్షిప్తమై ఉన్న 369మంది అమరుల సాహసాలు నిజ సాహసాలు. జై తెలంగాణ అంటూ గుండ్లకు గుండెలొడ్డిన ఆ వీరుల సాహసాలకు తోడు మంటల్లో మాడినవాడు, రైలుకు ఎదురేగినవాడు, ఉరిపోసుకున్నవాడు, తెలంగాణ కోసం నిలువునా ప్రాణం తీసుకున్నవాడిది సాహసం. భ్రాంతులు, భ్రమలు అపజయానికి మూలాలు. తెలంగాణ అమరుల సాహసాలు ఇవ్వాల్టి తెలంగాణ చరిత్ర పుటల తొలిపేజీ సంతకాలు. తెలంగాణ విజయం అమరులది.. ఓటమి నయా డాన్ క్విక్సాట్లది...
[email protected]